
సిద్దిపేట జిల్లా: చదువుపై ఇష్టం లేక ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బెజ్జంకి మండల కేంద్రంలోని గుట్టపైన సత్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన ప్రవీణ్‌కుమార్ కరీంనగర్‌లోని ప్రైవేటు కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తరచూ ఇంటికి వస్తుండటంతో హాస్టల్‌లో ఉండి చదువుకోవాలని తండ్రి సూచించాడు. ఈ నెల 12న మళ్లీ ఇంటికి వచ్చి కాలేజీకి పోనని చెప్పడంతో బుధవారం అతడిని సముదాయించి కాలేజీకి పంపించారు.
తిరిగి ఎప్పుడు వచ్చాడో కాని బెజ్జంకి గుట్టపై అదే రోజు రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఉరి వేసుకునే ముందు క్రిమిసంహారక మందు తాగినట్లు, చేతిని కోసుకున్నట్లుగా తెలుస్తోంది. చదువడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితుడి తండ్రి వెంకటేశం చెబుతున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ అభిలాష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment