రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీలో అప్పుల బాధతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రకాంత్‌రావు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా భార్యాపిల్లలు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విదితమే.. అనేక సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రకాంత్‌రావు ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. చంద్రకాంత్‌రావు దుండిగల్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో 2004 – 08లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు.
చదవండి: కాపురానికి రానందని కాటికి..
అప్పు తీర్చడానికి మరిన్ని అప్పులు
గతంలో పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. 3, 4 ఏళ్ల క్రితం అమెరికాకు పోయేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాని కోసం క్రెడిట్ కార్డులను వాడి సకాలంలో కట్టకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి మనోవేదనకు గురయ్యాడు. వాటిని తీర్చే క్రమంలో మరిన్ని అప్పులు చేయడం, సిబిల్ స్కోర్ దెబ్బతినడంతో మరింత ఆవేదనకు గురయ్యాడు. అదే సమయంలో రుణాలు తీసుకొని స్థానికంగా ఓ ఇంటిని నిర్మించాడు. కోవిడ్ కారణంగా అద్దెకు ఎవరూ రాకపోవడంతో ఆర్థికంగా మరింత దెబ్బతిన్నాడు. అతడి భార్య తండ్రి సైతం ఆర్థిక సహాయాన్ని అందించాడు. సమస్యలు చుట్టుముట్టడంతో చంద్రకాంత్‌రావు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
నాలుగు నెలల క్రితం ఈ సమస్యలు ఎక్కువగా ఉండేవని, అప్పుడున్నంత ఒత్తిడి ఇప్పుడు లేదని, భార్యాపిల్లలతో చంద్రకాంతరావు ఎంతో ఆనందంగా ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అతడికి లేదని, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని, ఆపదలో ఉన్నప్పుడు తోచిన సహాయం చేశామని అంటున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో ఏం జరిగిందో తెలియదని, తన గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన లావణ్య, పిల్లలు జోగిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి వీరి మృతదేహాలను విద్యుత్‌నగర్ కాలనీకి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలను రామచంద్రాపురంలోని శ్మశానవాటికలో నిర్వహించారు. కాగా శనివారం రాత్రి మృతురాలు లావణ్య తండ్రి పోలీసులకు తన కూతురి మరణానికి అత్తామామలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఇలా ఏ కుటుంబంలో జరగవద్దు: చంద్రకాంతరావు స్నేహితుడు
చంద్రకాంతరావు అందరితో స్నేహంగా ఉండేవాడు. నాలుగైదు నెలల క్రితం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డాడు. స్నేహితులం సహాయ సహకారాలు అందించాం. ఈ మధ్యకాలంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కూడా చెప్పాడు. చెప్పిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం బాధాకరం. ఇలా చేసుకునే ముందు భార్యాపిల్లలు, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండు.
Comments
Please login to add a commentAdd a comment