సాక్షి, చైన్నె: కరోనా రూపంలో ఎదురైన కష్టాలతో అప్పుల పాలైన ఐటీ ఉద్యోగి తన తల్లిదండ్రులకు, భార్య, కుమారుడితో విషపు మాత్రలను మింగిచ్చి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే స్పృహలోకి వచ్చిన తల్లి ఇంటిలోని దృశ్యాలను చూసి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు తరలి వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. సేలం జిల్లా గోరిమేడు న్యాయ కళాశాల సమీపంలోని ఎంజీఆర్ నగర్‌లో శివరామన్(85), వసంత(56) దంపతుల కుటుంబం నివాసం ఉంటోంది. శివరామన్ బెంగళూరు విమానాశ్రయంలో పనిచేసి పదవీ విరమణ పొందారు.
ఈ దంపతులకు చంద్ర(40), తిలక్(38) కుమారులు. చంద్ర బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తిలక్ చైన్నెలోని ఓ ఐటీ సంస్థలో పనిచేసేవాడు. తిలక్‌కు భార్య మహేశ్వరి(35), సాయి కిషోర్ ప్రశాంత్(6) కుమారుడు ఉన్నారు. కరోనా పరిస్థితుల అనంతరం తిలక్‌కు వర్క్ ఫ్రం హోం విధులను కేటాయించారు. జీతం తగ్గడంతో పాటు మాటలు రాని స్థితిలో ఉన్న తన కుమారుడికి వైద్య చికిత్స తిలక్‌కు భారంగా మారింది. దీంతో పలు చోట్ల అప్పులు చేశాడు.
అందరికీ విషం ఇచ్చి..
మంగళవారం సాయంత్రం భార్య మహేశ్వరితో కలిసి తిలక్ మార్కెట్‌కు వెళ్లాడు. వారికి కావాల్సిన వస్తువులను కొని తెచ్చాడు. ఫుడ్ కూడా ఆర్డర్ చేసి మరీ తెప్పించాడు. రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ ఇంట్లో నుంచి వసంత పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పరుగులు తీశారు. ఓ గదిలో నురగలు కక్కిన స్థితిలో శివరామన్, మరో గదిలో మహేశ్వరి, సాయి కిషోర్ పడి ఉండటం, అదే గదిలో తిలక్ ఉరివేసుకుని వేలాడుతుండంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ దృశ్యాలన్నీ చూసిన వసంత స్పహ తప్పింది.
ఆమెను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఆ ఇంట్లో ఆంగ్లంలో తిలక్ రాసి పెట్టిన లేఖబయట పడింది. వర్క్‌ఫ్రం హోం రూపంలో ఎదురైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుమారుడి ఆరోగ్య పరిస్థితి, అప్పుల భారం పెరగడం వెరసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
తల్లిదండ్రుల తో నిద్ర మాత్రలుగా పేర్కొంటూ, విషపు మాత్రలను మింగిచ్చినట్లు అందులో వివరించాడు. భార్యకు ఆహారంతో పాటు, కుమారుడికి యథా ప్రకారం ఇచ్చే మాత్రలతో కలిపి విషపు మాత్రలను మింగిచ్చినట్లు పేర్కొన్నారు. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నానని ముగించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. బెంగళూరులో ఉన్న పెద్దకుమారుడు చంద్రకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment