సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువ తను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణంగా ఎన్నికల వేళ జాబ్ మేళాలు నిర్వహించే నేతలు ఈసారి కొత్తగా యువ ఓటర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తు న్నారు.
ఇందుకోసం ఆయా నియోజక వర్గాల్లో ఏకంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం మీసేవ సెంటర్లకు వెళ్లి, నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను పరిశీలించి ఆయా ప్రాంతాల్లోని ఎంవీ ఇన్‌స్పెక్టర్లు లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తారు.
లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ కోసం చెల్లించాల్సిన రుసుము రూ.300 కూడా నాయకులే చెల్లిస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట్, గజ్వేల్ నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఈ కౌంటర్లను ఏర్పాటు చేయగా, దుబ్బాకలో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు వీటిని తెరిచారు. అలాగే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా నేతలు ఈ కౌంటర్లను తెరిచేందుకు సిద్ధమయ్యారు.
మా వద్దనే దరఖాస్తు చేసుకోండంటూ ప్రకటనలు
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం తమ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ఆయా పార్టీల నేతలు, ప్రజాప్రతి నిధులు ప్రకటనలు చేస్తున్నారు. మరో వైపు ఆయా మండలాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయ కుల ద్వారా కూడా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్ పొందాక, ఆరు నెలల తర్వాత రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకునేందుకు వీలుంటుంది. ముందు లెర్నింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తున్న నేతలు, మరో ఆరునెలల్లో పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఇప్పిస్తామని భరోసా ఇస్తున్నారు.
యువ ఓటర్లే ఎక్కువ..
లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్లు నిండాలి. అలాగే 18 ఏళ్లు నిండిన వారికే ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుంటుంది. దీంతో నేతలు ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లలో యువ ఓటర్లే అధికంగా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా ఒక్క దుబ్బాకలోనే బీఆర్‌ఎస్, బీజేపీ ఏర్పాటు చేసిన కౌంటర్లలో వేలల్లో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment