ఆ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు: నటి
ముంబై: రెండువేల కోట్ల రూపాయల అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది. తానొక యోగిని అని, నిర్దోషిని అని చెప్పింది. ‘నేనొక యోగిని. గత 20 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. డ్రగ్స్ కేసులో నేను నిర్దోషిని’ అని రికార్డు చేసిన వీడియో టేపులో మమత చెప్పింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉంటోంది.
డ్రగ్స్ కేసులో తన పేరును అక్రమంగా ఇరికించిన మహారాష్ట్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, కిరెన్ రిజిజులకు లేఖ రాసింది. కాగా ఈ కేసులో మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను ఇటీవల మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు. గుజరాత్, ముంబై ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న కనీసం 8 ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు చెప్పారు. మమతా కులకుర్ణితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న విక్కీ గోస్వామి కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితుడు. ముంబైలో వెలుగుచూసిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమత, విక్కీ గోస్వామితో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు.