మమతా కులకర్ణి (ఫైల్‌ఫోటో)
సాక్షి, థానే : కోట్లాది రూపాయల డ్రగ్ రాకెట్ కేసులో కీలక నిందితురాలు, బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రత్యేక ఎన్‌డీపీస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి పలుమార్లు కోర్టు ఎదుట హాజరు కావడంలో విఫలమవడంతో మమతా ఆస్తులను అటాచ్ చేయాలని న్యాయమూర్తి హెచ్‌ఎం పత్‌వర్ధన్ ఆదేశించారు. మమతా కులకర్ణికి చెందిన ముంబయిలోని మూడు విలాసవంతమైన ఫ్లాట్లను అటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫ్లాట్ల ప్రస్తుత విలువ రూ 20 కోట్లుగా ఉంటుందని అంచనా.
మమతా ఆస్తుల అటాచ్‌ను కోరుతూ ప్రాసిక్యూషన్ దరఖాస్తుకు సానుకూలంగా స్పందించిన కోర్టు మమతా కులకర్ణికి చెందిన మూడు ఆస్తులను అటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హిరే చెప్పారు. రూ 2000 కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకానందున మమతా కులకర్ణి పరారీ ఉన్నారని కోర్టు ప్రకటించింది. డ్రగ్ బ్యారన్ విక్కీ గోస్వామితో సన్నిహిత సంబంధాలతో అక్రమ కార్యకలాపాల్లో ఆమె చురుకుగా పాల్గొనేదని పోలీసులు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందట థానే పోలీసులు వెలుగులోకి తెచ్చిన డ్రగ్ రాకెట్‌కు మమతా కులకర్ణిని సూత్రధారిగా పోలీసులు ఆరోపిస్తున్నారు. కెన్యాలో తలదాచుకున్న గోస్వామి, మమతా కులకర్ణిలను భారత్‌కు రప్పించే ప్రక్రియను చేపట్టామని థానే పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment