మమతా కులకర్ణి (Mamta Kulkarni).. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసి చాలాకాలమే అవుతోంది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చింది. మళ్లీ సినిమాల్లోకి వస్తుందా? అని అభిమానులు ఆశగా ఆరా తీశారు. అటువంటి ఆలోచనే లేదని కుండ బద్ధలు కొట్టింది మమత. మహాకుంభమేళా కోసమే వచ్చానంది.
23 ఏళ్లుగా దీనికోసమే చూస్తున్నా..
ఈ వేడుకలో పాల్గొని వెళ్లిపోతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ మమత తీసుకున్న ఊహించని నిర్ణయం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆమె అన్నింటికీ స్వస్తి పలుకుతూ సన్యాసం తీసుకుంది. కిన్నార్ అఖారాకు మహామండలేశ్వర్‌గా మారిపోయింది. శ్రీయామై మమతా నందగిరిగా పేరు మార్చుకుంది. సినిమాల్లో రీఎంట్రీ, ఆధ్యాత్మిక మార్గం గురించి మమతా కులకర్ణి మాట్లాడుతూ.. 23 ఏళ్లుగా దీనికోసమే తపస్సు చేస్తున్నాను. ఇన్నాళ్లకు సన్యాసం స్వీకరించాను. ఒలంపిక్ పతకం గెల్చినంత సంతోషంగా ఉంది.
అందుకే ఆ సమూహంలోకి..
మళ్లీ సినిమాలు చేయాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు. ఇక అది అసాధ్యమే అవుతుంది. కిన్నార్ అఖారా (వీరు ట్రాన్స్‌జెండర్స్) సమూహంలోని వారు అర్ధనారీశ్వరునికి ప్రతీకగా నిలుస్తారు. ఈ అఖారా గ్రూపులో మహామండలేశ్వర్‌గా స్థానం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆదిశక్తి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైంది. నేను కిన్నార్ అఖారానే ఎందుకు ఎంచుకున్నానంటే వీరు స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ ఎలాంటి కట్టుబాట్లు ఉండవు.
బుద్ధుడు కూడా అంతేగా!
సినిమాల గురించి మాట్లాడుతూ.. జీవితంలో ప్రతీదీ ఉండాలి. అందులో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఒక భాగమే! అయితే మీరు దేన్నైనా పొందుతారేమో కానీ ఆధ్యాత్మిక భావం అనేది అదృష్టం ఉంటేనే కలుగుతుంది. సిద్దార్థుడు జీవితంలో అన్నీ చూసిన తర్వాతే మార్పు దిశగా ప్రయత్నించాడు. గౌతమ బుద్ధుడిగా మారిపోయాడు అని చెప్పుకొచ్చింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.
చదవండి: నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment