హీరోయిన్ 8 బ్యాంక్ ఖాతాల స్తంభన
ముంబై: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు. గుజరాత్, ముంబై ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న కనీసం 8 ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు చెప్పారు.
మమత ఎకౌంట్లలో 90 లక్షల రూపాయలకుపైగా నగదు ఉంది. మలాడ్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లోని మమత ఖాతాలో 67 లక్షలు ఉండగా, ఇతర బ్యాంకుల్లో మరో 26 లక్షల రూపాయల నగదు నిల్వ ఉన్నట్టు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మమతా అక్కతో పాటు ఇతరులను ప్రశ్నిస్తున్నారు. ఇక మమత ఆస్తులకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సంబంధిత అధికారులను సంప్రదించారు.
మమతా కులకుర్ణితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న విక్కీ గోస్వామి కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితుడి. ముంబైలో వెలుగుచూసిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమత, విక్కీ గోస్వామితో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. 10 మందిని అరెస్ట్ చేయగా, మిగిలినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మమత ప్రస్తుతం నైరోబీలో ఉంటోంది.