సాక్షి, సిటీబ్యూరో: ఒకటి కాదు.. రెండు కాదు.. పదులసార్లు పోలీసులకు చిక్కి, జైలు ఊచలు లెక్కపెట్టినా వీరి బుద్ధి మారలేదు. మాదకద్రవ్యాలకు బానిసలైన నలుగురు పాత నేరస్తులు మళ్లీ ఖాకీలకు చిక్కారు. ఎల్బీనగర్‌లో గంజాయి, ఎండీఎంఏ కొనుగోలు చేస్తుండగా ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.4,040 నగదుతో పాటు 15 గ్రాముల ఎండీఎంఏ, 2 కిలోల గంజాయి, కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సరూర్‌నగర్‌కు చెందిన జక్కా సునీల్, వనస్థలిపురానికి చెందిన షేక్ నోమాన్ ఇద్దరు స్నేహితులు. డ్రగ్స్‌కు బానిసలైన ఇరువురు సేవించడంతో పాటు విక్రయిస్తుంటారు కూడా. ఈ క్రమంలో నోమాన్ స్నేహితులైన సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ ఖాన్ అలియాస్ ఖాన్ సాబ్, పహాడీషరీఫ్‌కు చెందిన మహ్మద్ జాబీర్ ఖాద్రీ అలియాస్ షాజాడా, సంతోష్‌నగర్‌కు చెందిన మీర్జా ఇస్మాయిల్ అలీబేగ్‌లకు కూడా డ్రగ్స్ అలవాటైంది. వీరిపై ఏపీతో పాటు రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు ఠాణాల్లో పదుల సంఖ్యలో ఎన్‌డీపీఎస్, హత్య కేసులు ఉన్నాయి.
ఈక్రమంలో మూడు రోజుల క్రితం అరకు ప్రాంతానికి వెళ్లిన సునీల్.. స్థానికంగా గంజాయి సరఫరా చేసే శత్రు అనే వ్యక్తి నుంచి 2 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, ఎల్బీనగర్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ స్నేహితుడు నోమాన్‌ను కలిశాడు. సునీల్ నుంచి రూ.4–5 వేలకు గంజాయి కొని వాటిని చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కోటి సైజును బట్టి రూ.500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు.
ఈక్రమంలో కారులో సునీల్, నోమాన్‌లు శనివారం ఉదయం ఎల్బీనగర్ క్రాస్‌రోడ్‌కు అప్పటికే ఆరీఫ్ ఖాన్, జాబీర్ ఖాద్రీ, మీర్జాలు ఎదురుచూస్తున్నారు. కారు రాగానే వెనకాల ఎక్కిన ముగ్గురు నోమాన్, సునీల్ నుంచి గంజాయి, ఎండీఎంఏలను కొనుగోలు చేశారు. అకస్మాత్తుగా నోమాన్ కారు దిగి ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అప్పుడే ఎల్బీనగర్ ఎస్‌ఓటీ, ఎల్బీనగర్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి కారులో ఉన్న నలుగురు నిందితులను పట్టుకున్నారు. నోమాన్, శత్రు పరారీలో ఉన్నారు.
చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి..
Comments
Please login to add a commentAdd a comment