మత్తులో.. చిత్తు కావొద్దు
జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, వాడకం
బానిసలుగా మారుతున్న విద్యార్థులు?
మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం
నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్రే కీలకమంటున్న నిపుణులు
నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
ఖమ్మం: దేశాభివృద్ధిలో కీలకమైన యువత మాదకద్రవ్యాల బారిన పడుతోంది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఎక్కడ పడితే అక్కడ లభిస్తుండడంతో పదిహేనేళ్ల లోపు పిల్లలు మొదలు యువత వరకు పలువురు మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని తెలుస్తోంది. మత్తు పదార్థాలు వివిధ రూపాల్లో లభిస్తుండడంతో ధూమపానం, మద్యపానం వంటివి క్రమంగా జీవితంలో భాగమై పలువురు విచక్షణ మరిచి నేరాలకు పాల్పడుతున్నారు.
అంతేకాక ఈ అలవాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పడు మారుమూల పల్లెలకు సైతం పాకింది. ఈనేపథ్యాన నేడు(బుధవారం) అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు.
విద్యాసంస్థలే లక్ష్యంగా దందా..
యువతే టార్గెట్‌గా ఉమ్మడి జిల్లాలో గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. కౌమారదశలో ఉన్న విద్యార్ధులు మంచి, చెడు గుర్తించలేక త్వరగా అలవాటయ్యే అవకాశముండడంతో సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వ్యాపారుల కన్ను వారిపై పడింది. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఇన్నాళ్లు పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో మాదకద్రవ్యాల అమ్మకం, వాడకం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజు గంజాయి పట్టుబడుతుండడం.. ప్రతీ పాన్‌షాపు, కిరాణ షాపుల్లోనూ లభిస్తున్నట్లు తెలుస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
సరదాగా మొదలు.. ఆపై వ్యసనం
యుక్తవయస్సు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. సాహసాలు చేయాలని మనసు ఆరాటపడుతుంటుంది. దీంతో ఇలాంటి వారిని మత్తు పదార్థాలు ఆకర్షించే అవకాశముంది. ధూమపానం, మద్యపానం ఇతర మత్తుపదార్థాలు తొలినాళ్లలో సరదాగా అలవాటవుతున్నా ఆ తర్వాత వ్యసనంలా మారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. గంజాయిలో ఉండే టెట్రా హైడ్రోకెనబినాయిడ్(టీహెచ్‌సీ) రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తుంది.
అది మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని దెబ్బతీయడమే కాక చురుకుదనాన్ని తగ్గిస్తుంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించిన తర్వాత వ్యక్తుల్లో భ్రమలు మొదలై నేరప్రవృత్తి పెరగడంతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు సైతం వస్తుంటాయి. దీంతో తమను తాము గాయపర్చుకోవడమే కాక దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదముంది.
తల్లిదండ్రులు గమనించాలి..
పిల్లలు, యువత మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా అడ్డుకోవడంలో తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం లేదంటే మౌనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. ఇలాంటి వారిని నిత్యం పర్యవేక్షిస్తూ వారి గదులు, బ్యాగులను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. అంతేకాక ఎవరిరెవరితో తిరుగుతున్నారో పరిశీలిస్తే అవసరానికి మించి డబ్బు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని చెబుతున్నారు.
మెదడుపై తీవ్ర ప్రభావం..
మత్తుపదార్థాల వాడకం సరదాగా ప్రారంభమైనా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తుపదార్థాలు తీసుకున్న వారి మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. తద్వారా శరీరం ఉత్తేజంగా ఉన్నట్లు అనిపించి.. కాసేపటికి మళ్లీమళ్లీ తీసుకోవాలనిపిస్తుంది. క్రమంగా తీవ్రమైన మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి.
– డాక్టర్ అప్పారావు ఎండీ, డీఎం (న్యూరాలజీ)
అందరూ భాగస్వాములు కావాలి : సీపీ సునీల్ దత్
ఖమ్మంక్రైం: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నివర్గాల ప్రజలు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరాలని కోరారు.
ఈమేరకు వారం పాటు మాదకద్రవ్యాల వినియోగం, దుష్పలితాలపై విద్యాసంస్థల్లో అవగాహన కల్పించడమే కాక ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. అలాగే, ఐసీడీఎస్, పోలీస్ శాఖలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యాన బుధవారం ఉదయం 7గంటలకు సర్ధార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment