సీఎం చాప కిందకు మళ్లీ నీళ్లు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్లీ రాజకీయ అనిశ్చితి మొదలయ్యేలా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, దాని భాగస్వామ్య పక్షం పీడీఎఫ్‌కు మధ్య విభేదాలు రాజుకున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయను వెంటనే తొలగించకపోతే తాము తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పీడీఎఫ్ చీఫ్ మంత్రిప్రసాద్ నైథాని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అంబికా సోనీకి స్పష్టం చేశారు. పీడీఎఫ్ మద్దతు ఉపసంహరించుకుంటే హరీష్ రావత్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోతుంది. వచ్చే సంవత్సరం ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. అప్పటివరకు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టంగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌తో కలుస్తారా లేదా అన్న విషయాన్ని మాత్రం పీడీఎఫ్ అప్పుడే చెప్పడం లేదు. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ మాత్రం ఏమీ స్పందించడం లేదు.
ఇంతకుముందు మార్చినెలలో ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం తర్వాత మొత్తం 12 మంది సభ్యులపై అనర్హత వేటు వేశారు. వారిలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. దాంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 58కి పడిపోయింది. కాంగ్రెస్, బీజేపీలకు తలో 26 మంది సభ్యులుండగా, పీడీఎఫ్‌కు ఆరుగురు (ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు యూకేడీ) ఎమ్మెల్యేలున్నారు. ఇన్నాళ్లూ ఈ ఆరుగురు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ ప్రభుత్వం ఎలాగోలా నడుస్తోంది. ఇప్పుడు వాళ్లు మాట మారిస్తే.. మళ్లీ అధికార మార్పిడి తప్పకపోవచ్చు.