Congress Senior Leader Harish Rawat: సొంత పార్టీపై గళమెత్తిన రావత్‌.. - Sakshi
Sakshi News home page

Harish Rawat: సొంత పార్టీపై గళమెత్తిన రావత్‌.. ఆయన దారి కెప్టెన్‌ దారేనా? లేక

Published Sun, Dec 26 2021 2:05 PM | Last Updated on Sun, Dec 26 2021 3:10 PM

What Are The Steps To Be Taken By Congress Senior Leader Harish Rawat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వ లేమిపై సీనియరత్‌ నేతల అసమ్మతి.. మరోవైపు వరుస ఎదురుదెబ్బలతో సమతమతమవుతున్న కాంగ్రెస్‌కు మరో సమస్య వచ్చిపడింది. ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ హరీష్‌ రావత్‌ అసంతృప్తి గళం వినిపించడం కలకలం రేపుతోంది. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా.. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న రావత్‌ యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 

ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మొన్నటి వరకు పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఓ వెలుగు వెలిగారు. అయితే అమరీందర్‌సింగ్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ మధ్య విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే కారణంతో ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. దానికితోడు ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఇటీవల నియమితులైన దేవేంద్ర యాదవ్‌కు, రావత్‌కు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరీష్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 
(చదవండి: ఒమిక్రాన్‌పై ఊరటనిచ్చే విషయం.. కేసులు తక్కువ, రికవరీ ఎక్కువ.. ఇంకా)

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన రావత్‌ ట్విట్టర్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇంటా బయట చర్చనీయాంశమయ్యాయి. పార్టీలో తనకు కాళ్లు, చేతులు కట్టేసినట్టుగా ఉందని.. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందేమోనని ట్వీట్‌ చేయడమే కాకుండా భవిష్యత్‌ కార్యాచరణపై కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడం దుమారానికి కారణమైంది. 

వెంటనే హైకమాండ్‌ జోక్యం చేసుకుని రావత్‌ను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఉత్తరాఖండ్‌ సీఎల్పీ నేత ప్రీతమ్‌సింగ్‌, పీసీసీ చీఫ్‌ గణేశ్ గొడియాల్‌, హరీష్‌ రావత్‌ను శుక్రవారం ఢిల్లీకి రావాలని పిలిచింది. అయితే అధిష్ఠానం జోక్యంతో రావత్‌ మెత్తబడతారా లేక కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తరహాలో తిరుగుబాటు బావుటా ఎగరేసి చికాకులు తెస్తారా అనే చర్చ హస్తిన వర్గాల్లో సాగుతుండడం ఆసక్తికరంగా మారింది. రావత్‌ మాత్రం సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని ప్రకటించడం మరింత ఉత్కంఠ రేపుతోంది.
(చదవండి: మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement