ఇక అధికారికంగా ఆయనే ముఖ్యమంత్రి | Harish Rawat wins Trust Vote in Uttarakhand assembly, says supreme court | Sakshi
Sakshi News home page

ఇక అధికారికంగా ఆయనే ముఖ్యమంత్రి

Published Wed, May 11 2016 12:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఇక అధికారికంగా ఆయనే ముఖ్యమంత్రి - Sakshi

ఇక అధికారికంగా ఆయనే ముఖ్యమంత్రి

డెహ్రాడూన్: ఎమ్మెల్యేల తిరుగుబాటు, పార్టీ ఫిరాయింపులు, రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం, మెజార్టీ లేదంటూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం, రెబెల్స్, సర్కార్ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కోర్టును ఆశ్రయించడం, ఈ మధ్యలో ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడ్డారంటూ స్టింగ్ ఆపరేషన్ వీడియోలు వెలుగుచూడటం.. ఇలా ఎన్నో రాజకీయ మలుపులు తిరిగిన ఉత్తరాఖండ్లో పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అధికారికంగా విజయం సాధించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో హరీశ్ మెజార్టీ నిరూపించుకున్నట్టు సుప్రీం కోర్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. బలపరీక్షలో హరీశ్ సర్కార్కు అనుకూలంగా 33 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 28 ఓట్లు పడ్డాయి. ముఖ్యమంత్రిగా హరీశ్ బాధ్యతలు చేపట్టేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు వీలుగా ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కేంద్రం తరపున అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం బలపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించగా, ఈ రోజు ఫలితాన్ని ప్రకటించింది.

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్స్పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 61 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో బీజేపీకి 28, కాంగ్రెస్కు 27, బీఎస్పీకి ఇద్దరు, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్కు ఓ ఎమ్మెల్యే, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖ ఆర్య బీజేపీ గూటికి చేరగా, బీజేపీ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో హరీశ్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. మార్చి 27 న రాష్ట్రపతి పాలన విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement