బలపరీక్షకు ముందు ఎమ్మెల్యేలు జంప్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మెజార్టీ నిరూపించుకుంటారని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంతో ఉండగా, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖ ఆర్య షాక్ ఇచ్చారు. సోమవారం నుంచి కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలో ఉన్న రేఖ పార్టీ ఫిరాయించారు. ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు. మంగళవారం రేఖ ఆర్య బీజేపీ సభ్యులతో కలసి అసెంబ్లీ వద్ద ప్రత్యక్షమయ్యారు. ఆమె హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా బీజేపీ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య ఆ పార్టీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. ఆయన హరీశ్ రావత్ తో కలసి అసెంబ్లీకి వచ్చారు. భీమ్ లాల్ కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీఎస్పీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు.
సుప్రీం కోర్టు పర్యవేక్షణలో అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ ఈ రోజు బలపరీక్ష నిర్వహించారు. బలపరీక్ష వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. బుధవారం సుప్రీం కోర్టు అధికారికంగా బలపరీక్ష వివరాలను ప్రకటించనుంది. కాగా ఓటింగ్లో తామే గెలిచినట్టు హరీశ్ రావత్ ప్రకటించారు.