నేడు యూపీ, ఉత్తరాఖండ్‌లలో పోలింగ్
లక్నో/డెహ్రాడూన్ : రెండో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. అలాగే ఉత్తరాఖండ్‌లోని మొత్తం 70 నియోజకవర్గాలకు గానూ 69 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. పశ్చిమ యూపీలోని ఫిలిబిత్, బిజ్‌నూర్, మొరాదాబాద్ తదితర 11 జిల్లాల్లో ఉన్న 67 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
మొత్తం 2.28 కోట్ల మంది ఓటేయనుండగా, అందులో మహిళలు 1.04 కోట్ల మంది ఉన్నారు. 720 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బర్హాపూర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని 69 స్థానాలకు మొత్తం 628 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
మిస్డ్ కాల్ మేనిఫెస్టో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త విధానంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలను తెలుసుకోవాలనే ఓటర్లు ఒక నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఆ సమాచారాన్ని ఫోన్ లోనే పొందొచ్చు. మిస్డ్ కాల్ ఇచ్చిన వారికి తిరిగి ఫోన్ వస్తుంది. ఆన్సర్ చేయగానే కేవలం 60 సెకన్లలో మేనిఫెస్టోలోని 16 ప్రధానాంశాలను వినిపిస్తారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ప్రచారం చేయలేరు కాబట్టి ఈ విధానం ఉపయోగపడుతుందని అంటున్నారు.