యూపీ రెండో సమరం షురూ.. ఉత్తరాఖండ్‌లోనూ
లక్నో/డెహ్రాడూన్: యూపీలో రెండో సమరం మొదలైంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ ప్రారంభమైంది. అలాగే ఉత్తరాఖండ్‌లోని మొత్తం 70 నియోజకవర్గాలకు గానూ 69 స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. పశ్చిమ యూపీలోని ఫిలిబిత్, బిజ్‌నూర్, మొరాదాబాద్ తదితర 11 జిల్లాల్లో ఉన్న 67 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది.
మొరాదాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో పెద్దమొత్తంలో బలగాలను మోహరించారు. ఈ దశ ఎన్నికల్లో మొత్తం 2.28 కోట్ల మంది ఓటేయనుండగా, అందులో మహిళలు 1.04 కోట్ల మంది ఉన్నారు. 720 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బర్హాపూర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని 69 స్థానాలకు మొత్తం 628 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.