![Harish Rawat Resigns For Assam Congress defeat In Assam - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/4/rawat.jpg.webp?itok=lz3-_UFi)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ వైదొలిగిన మరుసటి రోజు అసోం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మరో కీలక నేత హరీష్ రావత్ ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అసోంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించిన హరీష్ రావత్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ పనిచేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని లోక్‌సభ ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థానాలకు గాను, కేవలం మూడింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకొంది. దీంతో హరీష్ రావత్ అస్సాం ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నట్లు గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తానే బాధ్యుడినని పేర్కొంటూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. తన రాజీనామాను తక్షణమే ఆమోదించి తదుపరి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు రాసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టేవరకూ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా మోతీలాల్ వోరాను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment