
ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
విశ్వాస పరీక్షలో క్రాస్ ఓటింగ్ చేసినందుకు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజ్వల్ అనర్హత వేటు వేశారు. వేటు పడిన వారిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే. హరీష్ రావత్ సర్కారుపై మే 10వ తేదీన నిర్వహించిన విశ్వాసపరీక్షలో కష్టమ్మీద అధికార కాంగ్రెస్ పార్టీ నెగ్గిన విషయం తెలిసిందే. బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వీళ్లిద్దరిపైనా అనర్హత వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పీకర్ గురువారం తెలిపారు.
వాళ్ల చర్య ఫిరాయింపుల నిరోధక చట్టం కింద శిక్షార్హమని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం.. తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా సభ్యుడు ఓటు వేసినా, ఓటింగుకు గైర్హాజరైనా వాళ్ల మీద అనర్హత వేటు వేయొచ్చు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తమ తమ నిర్ణయాలకు అనుకూలంగా విప్‌లు జారీచేశాయి. అయినా కూడా ఆ ఎమ్మెల్యేలిద్దరూ వాటిని ఉల్లంఘించారు. ఇద్దరిపై వేటు వేయడంతో.. ఇప్పుడు 61 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ పార్టీకి 26 మంది, బీజేపీకి 27 మంది సభ్యులు ఉన్నట్లయింది. అయితే ఆరుగురు సభ్యులున్న ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) మద్దతుతో కాంగ్రెస్ గట్టెక్కుతోంది.