ఈ బాహుబలిని చూస్తే రాజమౌళి కూడా షాకే!
డెహ్రాడూన్: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను తమ బుట్టలో వేసుకునేందుకు వీలైన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాలకు కూడా దిగుతున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కుతుందన్న ఎగ్జిట్ పోల్స్ మహత్యమో లేక ప్రధాని మోదీకి ధీటుగా తామెం ప్రచారంలో తక్కువకాదని నిరూపించుకునో ప్రయత్నమో మొత్తానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత హరీశ్ రావత్ బాహుబలి అవతారం ఎత్తారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాహుబలి ఎంతటి క్రేజ్ సంపాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అందులో ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది’ అనే పాట మేకింగ్ ఎప్పటికీ వండర్. సినిమాలోని హీరోయిజం మొత్తం ఈ ఒక్కపాటతోనే అర్థమవుతుంది. ఈ గీతం బ్యాక్ గ్రౌండ్‌తోనే ఇప్పుడు బాహుబలి 2 పేరిట ఉత్తరాఖండ్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలి హరీశ్ రావత్ కావడం విశేషం. దీన్ని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధం చేసి విడుదల చేయగా హరీశ్ రావత్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియో జనాలను కనురెప్పవేయనివ్వడం లేదంటే నమ్మండి. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీశ్ రావత్ అని టైటిల్ పడుతుండగా పాట మొదలవుతుంది. అక్కడి ప్రసిద్ధమైన ప్రాంతాల చిత్రాలు వేగంగా వచ్చి వెళతాయి.
అనంతరం బాహుబలిగా హరీశ్ రావత్ కనిపిస్తారు. ఆయనకు ఎదురుగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎలా ఎత్తుకుంటాడో అతడిని మించిన స్థాయిలో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ హరీశ్ కూడా ఉత్తరాఖండ్ భాగాన్ని తన భుజాలకు ఎత్తుకుంటాడు. అది చూసి అమిత్ షా అవాక్కవుతాడు. కొసమెరుపేంటంటే ఒరిజినల్ బాహుబలిలో సాధువుగా కనిపించిన తనికెళ్ల భరణి ప్రభాస్ శివలింగం అమాంతం ఎత్తుకొని భుజాన పెట్టుకున్నప్పుడు ఎంతగా సమ్మోహితుడై అవాక్కవుతాడో ఆయన స్థానంలో ప్రధాని మోదీ కనిపిస్తూ అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఒక్క ముఖాలను ఎడిట్ చేసి రూపొందించిన ఈ వీడియో చూపరులను కట్టిపడేస్తోంది.