
ఉత్తరాఖండ్ సీఎంగా రావత్
మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్ పగ్గాలు చేపట్టారు. శనివారమిక్కడ రాజ్‌భవన్ లాన్స్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా 65 ఏళ్ల రావత్‌తో గవర్నర్ అజీజ్ ఖురేషీ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా ఇంతకుముందు విజయ్ బహుగుణ మంత్రివర్గంలో పనిచేసినవారే.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రావత్ మాట్లాడుతూ.. గతేడాది సంభవించిన పెను వరదల తాకిడితో దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి కోలుకునేలా చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని ఉద్ఘాటించారు. అంతకుముందు దాదాపు సుదీర్ఘంగా ఐదుగంటలపాటు సాగిన ఉత్తరాఖండ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో కేంద్ర మంత్రి హరీశ్ రావత్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జనార్దన్ ద్వివేదితోపాటు గులాం నబీ ఆజాద్, అంబికాసోనీలు పార్టీ కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. సమావేశానంతరం పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది మాట్లాడుతూ.. రావత్ పేరును కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించినట్టు వెల్లడించారు. గతేడాది ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో సీఎంగా ఉన్న విజయ్ బహుగుణ వ్యవహరించిన తీరుపై విపక్షాలనుంచేగాక సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారింది.