రాష్ట్రపతి పాలనా? విశ్వాస పరీక్షా?
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని నెలకొన్న రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి హరీశ్ రావత్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనుండగా.. అంతకుముందే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కదులుతోంది.
కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసినట్టు వార్తలు వేస్తున్నాయి. ఈ సస్పెన్షన్ కనుక నిజమైతే.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ప్రస్తుతం 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో స్పీకర్ సస్పెన్సన్ నిర్ణయంతో ఆ సంఖ్య 61 పడిపోనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు సభ్యుల అండ కూడా రావత్ ప్రభుత్వానికి ఉంది. దీంతో 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో బలనిరూపణ చేసుకుంటుంది.
ఈ క్రమంలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్పీకర్ సస్పెన్షన్ ఉత్తర్వుల నేపథ్యంలో విశ్వాస పరీక్షకు ముందు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 9మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్రం గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకుంది. అసోంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ చేరుకొని.. కేంద్ర మంత్రిమండలితో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతోపాటు కేంద్రం ముందు ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలను ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. అయితే ఈ భేటీలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నదనేది ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కేంద్రం కదులుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలు సరికావని ఉత్తరాఖండ్ మంత్రి ఒకరు తెలిపారు. ఈ పరిణామాల నడుమ ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనా? లేక విశ్వాస పరీక్ష అన్నది తేలాల్సి ఉంది.