పంతం నెగ్గించుకున్న మోదీ సర్కారు!
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని నెలకొన్న రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తీసుకుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర కేబినేట్ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు శనివారం సిఫార్స్ చేశారు. గవర్నర్ తన నివేదిక, సిఫార్సును ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ, గవర్సర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పాలన అమలుచేశారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం హరీశ్ రావత్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనుండగా.. అంతకుముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా పావులు కదిపిన విషయం తెలిసిందే.
బలం ఉన్నా... హైడ్రామా జరిగింది!
కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడం.. ఈ సస్పెన్షన్ కనుక నిజమైతే, అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ప్రస్తుతం 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో స్పీకర్ సస్పెన్సన్ నిర్ణయంతో ఆ సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు సభ్యుల అండ కూడా రావత్ ప్రభుత్వానికి ఉంది. దీంతో 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో బలనిరూపణ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు రాష్ట్రపతి పాలన కోసం శతవిధాలా ప్రయత్నించి తమ పంతం నెగ్గించుకుంది.