
కొన్ని గంటలకే మాటమార్చిన సీఎం
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాలు చొరబడిన విషయం నిజమేనని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ మాట మార్చారు. భారత సరిహద్దు వెంట చైనా బలగాల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే గానీ, ఉత్తరాఖండ్ భూభాగంలోకి మాత్రం చైనా దళాలు వచ్చాయంటూ వస్తున్న కథనాలు సరికాదని ఆయన అన్నారు. తమ భూభాగాన్ని మ్యాపింగ్ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర రెవెన్యూ బలగాలకు చైనా దళాలు కనిపించాయని, అంతకుముదు అప్పుడప్పుడు చైనా వాళ్లు కనిపించి పోయినా.. ఈసారి మాత్రం పెద్ద సంఖ్యలో చైనా సైనికులు వచ్చారని ఆయన అన్నారు. అయితే.. ఆ బలగాలు చైనా భూభాగంలోనే ఉండటంతో వాళ్ల కార్యకలాపాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజాగా చెప్పారు. వాళ్ల కదలికలు కనిపించడంతో తాము అప్రమత్తమయ్యామని, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉందని.. తగిన సమయంలో సరైన చర్యలు తీసుకుంటారని రావత్ అన్నారు.
ఇదే విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. సరిహద్దుల్లో కదలికల గురించి ఇండో టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ) సునిశితంగా పరిశీలిస్తోందని, చైనా దళాలు నిజంగా మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయా.. లేవా అనే విషయాన్ని, పరిస్థితి తీవ్రతను వాళ్లు అంచనా వేస్తున్నారని అన్నారు. సమగ్ర నివేదిక తీసుకుని.. ఏం చేయాలో చేస్తామని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.