సీబీఐ ఎదుట హాజరైన హరీశ్ రావత్
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంచలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మంగళవారం సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం విచారణ కొనసాగుతోంది. ఓ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో హరీష్ రావత్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపుతూ ఉన్న ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న సీబీఐ దీనిపై విచారణ చేపట్టింది. విచారణకు హజరయ్యేందుకు వెళుతూ రావత్... తాను ఎలాంటి తప్పు చేయలేదని, సీబీఐ అడిగినా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.
ఉత్తరాఖండ్లో ప్రభుత్వ బలనిరూపణకు ముందు.. స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎమ్మెల్యేలను బేరమాడుతున్నట్లు ఓ వీడియో టేపులు బయటకు వచ్చిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఆయనను విచారిస్తోంది. కాగా మే 10న రావత్ బలనిరూపణ పరీక్షలో రావత్ గెలుపొందిన విషయం తెలిసిందే. సీబీఐ ఇప్పటివరకు రావత్కు మూడుసార్లు సమన్లు జారీ చేసింది.