డెహ్రాడూన్: వాళ్లిద్దరూ విభిన్న భావజాలం కలిగిన పార్టీలకు చెందిన వారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఒకే లక్ష్యంతో పోటీకి దిగారు. మాజీ సీఎంలైన తమ తండ్రులకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తండ్రులు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఎన్నికల బరిలో దిగారు. వారే కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ కుమార్తె అనుపమా రావత్. బీజేపీ మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి. బీసీ ఖండూరి 2012 ఎన్నికల్లో కొత్‌ద్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న రీతూ ఖండూరి మాట్లాడుతూ ‘అప్పట్లో మా నాన్న గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఇప్పుడు అదే స్థానంలో పోటీ చేసి నేను గెలిచి చూపిస్తా. మా పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది’’ అని అన్నారు. ఇక హరీశ్ రావత్ 2017 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి హరిద్వార్ (రూరల్) నుంచి ఓటమిపాలయ్యారు. రావత్ కుమార్తె అనుపమా గత ఏడేళ్లుగా హరిద్వార్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ‘‘హరిద్వార్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటివరకు నెగ్గలేదు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే మా నాన్నను ఓడించి తప్పు చేశామన్న భావన ప్రజల్లో ఉంది. ఈ సారి గెలుపు నాదే’’ అని అనుపమ ధీమాగా చెప్పారు. మొత్తానికి ఈ ఇద్దరు కుమార్తెలు తండ్రుల ఓటమికి ప్రతీకారంగా అవే నియోజకవర్గాలను ఎంచుకొని పోటీకి దిగడం అందరినీ ఆకర్షిస్తోంది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment