వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే...
► కాంగ్రెస్–ఎస్‌పీ పొత్తుపై మోదీ విమర్శలు
► యూపీలో అచ్చేదిన్ రాలేదంటే దానికి బాధ్యత అఖిలేశ్‌దే..
బదౌన్ (ఉత్తరప్రదేశ్): తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో ఇరు పక్షాలు జతకట్టాయని సమాజ్‌వాదీ–కాంగ్రెస్ పార్టీల పొత్తుపై ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘అఖిల్‌శ్.. అచ్చేదిన్ (మంచిరోజులు) ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. గత ఐదేళ్లుగా ఆయనే యూపీ సీఎం. మంచిరోజులు రాలేదని ప్రజలు ఆయనతో చెపుతున్నారంటే.. దానికి బాధ్యత ఆయనదే. దీనికి బీఎస్పీ, కాంగ్రెసూ కారణమే’’అని అచ్చేదిన్ హామీపై వెల్లువెత్తిన విమర్శలకు బదులిచ్చారు. అఖిలేశ్ చెపుతున్న ‘కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది)’ నినాదం పంక్చర్ అవుతుందని, ఆయన చెపుతున్న మాటలు రాష్ట్రంలోని చెడునంతా ప్రజల కళ్లముందు ఉంచుతున్నాయన్నారు.
శనివారం బదౌన్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. మాయావతి ప్రభుత్వం అవినీతి మయమని, దోషులుగా తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అఖిలేశ్ ఇప్పుటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏ విషయంలోనూ మాయావతి, ములాయం ఒక్కటి కారని, కానీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తనపై కోపంతో వారిద్దరూ ఏకమయ్యారన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరుగుతున్న అవినీతి కారణంగా.. యూపీలో నిజాయితీ కలిగిన, అన్ని అర్హతలు ఉన్న ప్రజలు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని చెప్పారు.
అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయండి
రుద్రపూర్: ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న రాజకీయ సంకల్పం లేదని మోదీ విమర్శించారు. రాష్ట్ర ప్రగతి కోసం బీజేపీకి ఓటేయాలని రుద్రపూర్‌లో జరిగిన సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కెమెరాల ముందు కూడా భయం లేకుండా లంచం తీసుకునే ‘బాహుబలి’లాంటి రాజకీయ నేతలను రాష్ట్రం వదిలించుకోవాలంటూ సీఎం హరీశ్ రావత్‌కు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను మోదీ ప్రస్తావించారు.