
ఇన్నాళ్లూ అబద్ధం ఎందుకు చెప్పారు?
రెబల్ ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ గత 35 రోజులుగా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆ సీడీలలో ఉన్నది తానేనంటూ రావత్ అంగీకరించడంతో ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ స్పందించారు. రావత్ ఉన్న సీడీ బయటపడి 35 రోజులు కావస్తోందని, ఇన్నాళ్లబట్టి ఆయన అది తప్పుడు సీడీ అని.. మార్ఫింగ్ చేశారని చెబుతూ ఉత్తరాఖండ్ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించారని ప్రశ్నించారు. సీడీలో ఉన్న గొంతు తనది కాదంటూ ఇన్నాళ్లుగా చెప్పడానికి కారణమేంటో ఆయన బయటపెట్టాలని చౌహాన్ డిమాండ్ చేశారు. తనకు, సదరు జర్నలిస్టుకు ఓ సమావేశం జరిగిందని కూడా రావత్ అంగీకరించారని ఆయన అన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రావత్.. ప్రభుత్వ హెలికాప్టర్‌లో జాలీగ్రాంట్ ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్ వద్దకు ఒక జర్నలిస్టును కలిసేందుకు వెళ్లారంటేనే విషయం అర్థమవుతోందని చౌహాన్ చెప్పారు. తాను ఏమైనా తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని గతంలో హరీష్ రావత్ చెప్పిన విషయాన్ని చౌహాన్ గుర్తుచేశారు.
అయితే హరీష్ రావత్ మాత్రం ఒకవైపు ఆ సీడీలో ఉన్నది తానేనని ఒప్పుకొంటూనే జర్నలిస్టుతో భేటీ కావడం తప్పా.. సాంకేతికంగా అప్పటికి ఇంకా అనర్హత వేటు పడని ఎమ్మెల్యే నాతో మాట్లాడితే ఏమవుతుంది అంటూ వితండవాదం చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైనా చానల్‌ను బ్లాక్ చేయించానా అని కూడా ప్రశ్నించారు. రెబల్ ఎమ్మెల్యేలను తాను మద్దతు కోరి, అందుకు బదులుగా వాళ్లకు ఏమైనా ఆఫర్ చేసినట్లు ఆ సీడీలో రుజువైతే తాను బహరింగ ఉరికి కూడా సిద్ధమని చెప్పారు.