రిషికేశ్‌లో ఈ నెల 10న ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పుట్టపర్తి శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లో రిషికేశ్ వద్ద గంగానది ఒడ్డున నిర్మించిన స్నాన ఘట్టం (ఘాట్)ను ఈ నెల 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రారంభించనున్నారు. ఈ ఘాట్‌లో ఏటా సుమారు 10 లక్షల మంది స్నానమాచరించే అవకాశం ఉంది. ఈ నెల 9-11 తేదీల్లో సత్యసాయి సేవా సంస్థ రిషికేశ్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఈ సందర్భంగా యువ సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు శ్రీ సత్యసాయి నామ్ సంకీర్తన్ సమ్మేళన్ పేరిట వార్షిక సంగీతోత్సవంతో పాటు అనూప్ జలోటా, ప్రశాంత్ భజన బృందంతో ప్రత్యేక ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని కూడా నిర్వహిస్తారు. సత్యసాయి బోధనలతో కూడిన పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు కూడా ఉచితంగా అందుబాటులో ఉండేలా 11న శ్రీ సత్యసాయి వేదిక్ లెర్నింగ్ సెంటర్, లైబ్రరీని ప్రారంభిస్తారు.
ఉచిత విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్న తమ సంస్థ నూతనంగా చేపట్టే కార్యక్రమాల ద్వారా రిషికేశ్‌లోని భక్తులకు మరింత మెరుగైన మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సత్యసాయి సేవా సంస్థ అఖిల భారత అధ్యక్షుడు నిమిశ్ పాండ్యా తెలిపారు.