అక్టోబర్ వస్తోంది. దసరా సెలవులు వస్తాయి. కాలేజ్, ఉద్యోగం స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం ఎటైనా టూర్‌కెళ్తే బావుణ్ననిపిస్తుంది. ఈ సీజన్‌లో మనదేశంలో ఏ ప్లేస్ బెస్ట్ అంటే ముందు రిషికేశ్‌ని గుర్తు చేసుకోవాలి.
రిషికేశ్ టూర్ అంటే అట్లా ఇట్లా ఉండదు. ఒక అడ్వెంచరస్ టూర్, ఒక తీర్థయాత్ర, ఒక హనీమూన్ వెకేషన్, ఓ తథాత్మ్యత... అన్నీ కలిపిన తీర్థం, క్షేత్రం ఇది. గంగోత్రి నుంచి గంగానది కొండ వాలుల మధ్య ప్రవహిస్తూ నేల మీదకు వచ్చే వరకు ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. గంగోత్రి నుంచి రిషికేశ్‌కు 250 కిమీల దూరం ఉంటుంది. రిషికేశ్ పట్టణం సముద్రమట్టానికి పదకొండు వందల నుంచి పదిహేడు వందల అడుగుల ఎత్తులో విస్తరించి ఉంది. రిషికేశ్ వరకు గంగానది ఎక్కువ వెడల్పు లేకుండాపాయలాగ వేగంగా ప్రవహిస్తూ ఆకాశం నుంచి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడి నుంచి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న హరిద్వార్ వరకు ప్రవాహం విశాలమవుతూ, పరుగు వేగం తగ్గుతుంటుంది. గంగానది కలుషితం కావడం హరిద్వార్ దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి అంతకంటే పైన రిషికేశ్ దగ్గర గంగాస్నానం చేయాలనుకుంటారు ఎక్కువ మంది. యువత అయితే గంగానదితోపాటు ఒక్క ఉదుటున భూమ్మీదకు దూకడం కోసం రిషికేశ్‌కు ఇరవై కిలోమీటర్ల పైకి వెళ్లి అక్కడి నుంచి రాఫ్టింగ్ మొదలు పెడతారు. రిషికేశ్‌లో రివర్‌రాఫ్టింగ్ నిర్వహించే సంస్థలు ప్రతి వీధిలోనూ కనిపిస్తాయి. బంగీ జంప్, ఫ్లయింగ్ పాక్స్ కూడా చేయవచ్చు. నగరం ఎంత ఇరుకుగా ఉంటుందో నది తీరాన గుడారాల్లో క్యాంపింగ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కనిపిస్తాయి.
లక్ష్మణ్ ఝాలా
గంగానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి సస్పెన్షన్ బ్రిడ్జి ఉంది. దాని పేరు లక్ష్మణ్ ఝాలా. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు, సీత కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు. సీత నది దాటడం కోసం లక్ష్మణుడు అడవి చెట్ల తీగలతో వంతెనను అల్లాడని, దాని పేరే లక్ష్మణ్ ఝాలా అని చెబుతారు. రిషికేశ్‌కు మరికొంత దూరంలో రామ్ ఝాలా ఉంది. అది రాముడు అల్లిన తీగల వంతెన. ఈ రెండు వంతెనలు నది దాటడానికి అనువుగా ఉండేవి. కాలక్రమంలో ఆ వంతెనల స్థానంలోనే ఇనుప వంతెనలు నిర్మాణం జరిగింది. పర్యాటకులు లక్ష్మణ్ ఝాలా మీద నుంచి అవతలి తీరానికి చేరి అక్కడి నుంచి పడవలో విహరిస్తూ ఇవతలి ఒడ్డుకు రావచ్చు. పడవలో మెల్లగా సాగుతూ ఒక ఒడ్డున మనుషులను, మరో ఒడ్డునున్న ఎత్తైన కొండలను, కొండవాలులో, నది తీరాన ఉన్న నిర్మాణాలను చూస్తూ ఉంటే ఒక్కసారిగా తుళ్లింతలతో యువకులు రివర్ రాఫ్టింగ్ చేస్తూ దూసుకొస్తారు. నదిలో బోట్ షికార్ టికెట్‌ల మీద ప్రభుత్వ నిఘా పెద్దగా ఉండదు. ప్రైవేట్ బోట్‌ల వాళ్లు ఒక్క ట్రిప్‌కి వేలల్లో అడుగుతారు. పెద్ద బోట్‌లలో వెళ్లడమే శ్రేయస్కరం. గంగ పరవళ్లు తొక్కుతుంటుంది. చిన్న పిల్లలతో వెళ్లిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.
యోగా క్యాపిటల్
రిషికేశ్, హరిద్వార్ రెండూ నేషనల్ హెరిటేజ్ సిటీలు. కేరళలో ఉన్నట్లే ఆయుర్వేద వైద్యం, పంచకర్మ చికిత్స కేంద్రాలుంటాయి. హిమాలయాల నుంచి సేకరించిన ఔషధ మొక్కలతో వైద్యం చేస్తారు. రిషికేశ్‌లో ఏటా యోగా, మెడిటేషన్ సెషన్‌లు జరుగుతాయి. భారత ప్రధాని కూడా రిషికేశ్ పర్యటన సందర్భంగా పట్టణంలోని ఒక గుహలో ధ్యానం చేశారు. భవబంధాలను వదిలి మోక్షసాధన కోసం జీవితంలో అంత్యకాలాన్ని ఇక్కడ గడపడానికి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. రోజూ సాయంత్రం గంగాహారతి కనువిందు చేస్తుంది. నది మధ్యలో ధ్యానముద్రలో ఉన్న ఈశ్వరుని విగ్రహాన్ని చూడడానికి దగ్గరకు వెళ్లడం కంటే ఒడ్డున ఘాట్ నుంచి చూస్తేనే శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. ఉత్తరాఖండ్ వర్షాకాలం వరదల బారిన పడుతుంటుంది. కానీ ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. కాబట్టి సీజన్ వచ్చే సరికి టూరిస్టుల కోసం సిద్ధమైపోతుంది. అన్నట్లు ఈ టూర్ గుర్తుగా రుద్రాక్ష తెచ్చుకోవడం మర్చిపోవద్దు. మన దగ్గర జామచెట్లు ఉన్నట్లు ఎక్కడ చూసినా రుద్రాక్ష చెట్లే.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment