రావత్ గెలుపునకు ‘సుప్రీం’ ఆమోదం
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన తొలగించాలని కేంద్ర కేబినెట్ సిఫారసు
♦ 9 మంది ఎమ్మెల్యేల అనర్హతను రద్దు చేస్తే మళ్లీ విశ్వాసపరీక్ష
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం జరిగిన బలపరీక్షలో కాంగ్రెస్ నేత హరీశ్‌రావత్ విజయానికి సుప్రీంకోర్టు బుధవారం ఆమోదముద్ర వేసింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను వెంటనే తొలగించాలని కేంద్రానికి నిర్దేశించింది. ఈ పరిణామాలు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రంలోనిమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్ష, ఓటింగ్ ప్రక్రియ, ఫలితాలను అధికారులు సీల్డ్ కవర్‌లో సుప్రీంకు అందించగా.. జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ శివకీర్తిసింగ్‌ల బెంచ్ తెరచి పరిశీలించింది. ‘మొత్తం 61 (ఎమ్మెల్యే) ఓట్లలో రావత్‌కు 33 లభించాయి.
ఓటింగ్‌లో ఎలాంటి అక్రమాలూ కనిపించలేదు. 9 మంది ఎమ్మెల్యేలు అనర్హత కారణంగా ఓటు వేయలేదు’ అని స్పష్టంచేసింది. అటార్నీ జనరల్ ముకుల్‌రోహ్తగి మాట్లాడుతూ.. రావత్ శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకున్నారనటంలో సందేహం లేదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగిస్తామని కేంద్రం చెప్పినట్లు నివేదించారు. కోర్టు అనుమతితో బుధవారం నాడే రాష్ట్రపతి పాలనను తొలగిస్తామని చెప్పారు. రాష్ట్రపతి పాలనను తొలగించిన తర్వాత రావత్ సీఎంగా బాధ్యతలు చేపడతారని కోర్టు చెప్పింది. రాష్ట్రపతి పాలనను తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం తమకు అందివ్వాలంది.
అయితే.. మార్చి 28న విధించిన రాష్ట్రపతి పాలన చట్టవ్యతిరేకమని రాష్ట్ర హైకోర్టు కొట్టివేయగా దానిపై సుప్రీంలో విచారణ సాగుతున్నందున.. రాష్ట్రపతి పాలన చట్టబద్ధత అంశమింకా మనుగడలోనే ఉంటుందని పేర్కొంది. అనర్హతకు గురైన 9 మంది ఎమ్మెల్యేలు హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారని.. దానిపైనా విచారణ కొనసాగుతోందని ప్రస్తావించింది.‘రాష్ట్రపతి పాలన విధించటం సమర్థనీయమా కాదా అన్నది పరిశీలించాల్సి ఉంది. ఒకవేళ ఎమ్మెల్యేల అనర్హతను మేం కొట్టివేసినట్లయితే.. మరోసారి విశ్వాస పరీక్ష జరుగుతుంది’ అని వివరించింది. అంతకుముందు.. విశ్వాస పరీక్ష ఫలితాలను సుప్రీం తెవరకుండా అడ్డుకునేందుకు.. అనర్హతకు గురైన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే శైలారాణిరావత్ పిటిషన్ వేయటం ద్వారా చేసిన ప్రయత్నం ఫలించలేదు. రావత్ గెలుపుకు సుప్రీం ఆమోదముద్ర లభించిన వెంటనే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించాల్సిందిగా కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. దీంతో.. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసినట్లు బుధవారం రాత్రి కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్, ఆప్
ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యం గెలిచిందని, అక్కడ అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ప్రధానిమోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేశాయి. ఇది మోదీకి ఒక గుణపాఠమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఆప్ నేత కేజ్రీవాల్ కూడా మోదీ క్షమాపణ చెప్పాలని ట్విటర్‌లో డిమాండ్ చేశారు.