డెహ్రాడూన్:భారతదేశంలో ఐటీ విప్లవంలో వచ్చిన సమూల మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే కారణమని ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రశంసలు కురిపించారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడకు విచ్చేసిన రావత్.. రాజీవ్ గాంధీ ఎప్పటికీ ఐటీ విప్లవ పితామహుడిగా నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ప్రపంచదేశాల్లో భారత్ ను బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి వెలకట్టలేదని రావత్ తెలిపారు. ఆయన 1984-89 మధ్య కాలంలో దేశ ప్రధానిగా చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల్లో నిలిచిపోతాయన్నారు.
ఆయన ఎప్పుడూ నియంతలా కాకుండా ప్రజల ఐక్యత కోసం పాటు పడేవారని కొనియాడారు. ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి పరచడంలోనే కాకుండా.. ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరం ఎంతో ఉందని గ్రహించిన ప్రధాని ఆయననే పేర్కొన్నారు. ఆ క్రమంలోనే పంచాయతీ రాజ్ లను తీర్చిదిద్దడానికి రాజీవ్ ఎంతో కృషి చేశారన్నారు.