సర్కారుపై గుస్సా | Market Committee Chairman, director in concern | Sakshi
Sakshi News home page

సర్కారుపై గుస్సా

Published Wed, Jul 16 2014 4:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Market Committee Chairman, director  in concern

 సాక్షి, మంచిర్యాల : కొత్త ప్రభుత్వం తమ పదవికి ముప్పు తెస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్, డెరైక్టర్ పదవుల్లో కొనసాగుతున్న పలువురు నాయకులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సర్కారు నిర్ణయంతో ఊడిపోనున్న తమ పీఠాలను తలుచుకొని నిర్వేదానికి లోనవుతున్నారు. కోల్పోనున్న పదవిని తిరిగి పొందేందుకు కొందరు.. కొత్తగా పదవి పొందేందుకు మరికొందరు హైదరాబాద్‌లో మకాం వేసి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పదవి కాలంతో మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, డెరైక్టర్లను నియమితులయ్యారు. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పరాజ యం పాలై టీఆర్‌ఎస్ గద్దెనెక్కడం, ప్రస్తుత కమిటీలను రద్దు చేసే దిశగా టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తుండటంతో ప్రస్తుతం ఉన్న వారు ఆవేదన చెందుతున్నారు.

 న్యాయశాఖ సలహాతో ముందుకు..
 స్థానిక సంస్థల కమిటీల నియామకాన్ని రద్దుచేసే అవకాశం రాజ్యాంగం కల్పించనందున రాష్ట్రపతి పాలన సమయంలో మార్కెట్ కమిటీలు రద్దు కాలేదు. దీంతో తెలంగాణ సర్కారు తాజాగా మార్కెట్ కమిటీలను రద్దుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. అసెంబ్లీ ఆర్డినెన్స్ ద్వారా ఈ చర్యకు దిగాలా లేక ప్రభుత్వ నిర్ణయం సరిపోతుందా అనే విషయంలో న్యాయశాఖ సలహా తీసుకుంది.

‘ప్రభుత్వ విధాన నిర్ణయంతో పాలకవర్గాలను రద్దు చేయవచ్చు’అని న్యాయశాఖ స్పష్టం చేయడంతో ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఫైలు సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. సీఎం కేసీఆర్ పాత పాలకవర్గాలను కొనసాగించేందుకు సుముఖంగా లేరనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త కమిటీ నియామక ప్రక్రియ ప్రారంభం కానప్పటికీ ముందస్తు ప్రయత్నాల్లో నాయకులు నిమగ్నమయ్యారు. రిజర్వేషన్లు అనుకూలించకపోవడం, వివిధ సమీకరణాల వల్ల పోటీకి అవకాశం దక్కని వారు, ఓటమి పాలైన నాయకులు తమకే అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు.

 వీటికే నియామకాలు
 జిల్లాలో 17 మార్కెట్ యార్డులు ఉండగా ఇందులో 13 యార్డులకు పాలకమండళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్, జైనథ్, నిర్మల్, సారంగాపూర్, కుభీర్, ఖానాపూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, బోథ్, వీటికి పాలకమండళ్లు కొనసాగుతున్నాయి. ఈ కమిటీలకు మూడేళ్ల పదవీకాలం ఇంకా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదే శాలు రావటంతో వాటి కాలం ముగిసినట్లే. కొత్త వారిని నియమించే అవకాశాల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బెల్లంపల్లి, ఇంద్రవెల్లి, జైనూర్, భైంసాల కమిటీల నియామకం కాలేదు. వీటిని కూడా సంబంధిత నామినేటెడ్ సమయంలో భర్తీ చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement