సీసీసీలో క్రైమ్‌టీమ్స్ | CCClo Crime Teams | Sakshi
Sakshi News home page

సీసీసీలో క్రైమ్‌టీమ్స్

Published Fri, Mar 14 2014 1:03 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

CCClo Crime Teams

  • నేరాలు జరిగే ప్రాంతాలు, సమయాలతో మ్యాపింగ్స్
  •    స్నాచింగ్, ‘డైవర్షన్’ బాధితులకు ‘ట్రాఫిక్’ సాయం
  •    కసరత్తులు పూర్తి చేసిన సీసీఎస్, త్వరలో అమలులోకి
  •  సాక్షి, హైదరాబాద్:  ఒకవైపు రాష్ట్రపతి పాలన... మరోవైపు ఎన్నికల హడావుడి... ఈ పరిణామాలతో ప్రస్తుతం పోలీసుల దృష్టంతా శాంతిభద్రతల నిర్వహణ, బందోబస్తులపైనే ఉంటుంది. రానురాను ఈ అంశాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు నేరాల నిరోధానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  కేవలం ఎన్నికల సీజన్‌లోనే కాకుండా... భవిష్యత్తులోనూ ఈ విధానాలను కొనసాగించాలని నిర్ణయించామని క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనల్ని ఉన్నతాధికారులకు పంపి, త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేశారు.
     
    ఆ సెంటర్‌లో ప్రత్యేక బృందాలు:
     
    నగర కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఉండే 12 స్క్రీన్లను వినియోగించి నగరంలోని 275 ప్రాంతాల్లో (కూడళ్లు, రహదారులు) పరిస్థితిని పర్యవేక్షించే అవకాశం ఉంది. ఈ సెంటర్‌లోనే ప్రత్యేక క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎస్‌తో పాటు నగరంలోని ఠాణాల్లో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లను ఎంపిక చేసుకుని నిత్యం ముగ్గురు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా రహదారులపై తిరుగుతున్న నేరగాళ్లను గుర్తించడం వీరి పని.
     
    ఆధునిక పంథాలో మ్యాపింగ్స్:
     
    చైన్‌స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్ వంటి నేరాలు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సమయాల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. నగర వ్యాప్తంగా గడిచిన కొన్నేళ్లుగా నమోదైన కేసుల డేటాను విశ్లేషిస్తున్న సీసీఎస్ పోలీసులు ఆ ప్రాంతాలు, సమయాలతో మ్యాప్స్ రూపొందిస్తున్నారు. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలు, సమయాల్లో మఫ్టీ పోలీసుల్ని వాహనాలతో మోహరిస్తారు. ఏదైనా ఫిర్యాదు వచ్చినా, సీసీసీలో ఉండే క్రైమ్ సిబ్బంది రోడ్డుపై పాతనేరగాళ్లను గుర్తించినా... ఆ సమీపంలోనే ఉన్న ఈ మఫ్టీ బృందాలు వెళ్లి నేరగాడిని రెడ్‌హ్యాండెడ్ పట్టుకోవడం లేదా.. నేరగాడు తన షెల్టర్‌కు చేరుకునే లోపు పట్టుకొనేలా వ్యూహాలు రచిస్తున్నారు.
     
     ట్రాఫిక్ పోలీసు సహకారం

     రహదారులపై జరిగే స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్ వంటి నేరాల బారినపడుతున్న బాధితులు ప్రస్తుతం సివిల్ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నారు. లేదంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాల్సి వస్తోంది. దాదాపు ప్రతి జంక్షన్, కీలక రోడ్లపై లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నా, ఉండకపోయినా... ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. కచ్చితంగా వీరివద్ద వైర్‌లెస్ సెట్ అందుబాటులో ఉంటుంది. ఇకపై రోడ్ల మీద నేరాల బారినపడిన బాధితులు సమీపంలోని ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చెప్పే అవకాశాన్నీ కల్పిస్తున్నారు. వీరి వద్ద ఉండే వైర్‌లెస్ సెట్ ద్వారా కంట్రోల్‌రూమ్‌తో పాటు ఒకేసారి నగర వ్యాప్తంగా ఉన్న పోలీసుల్ని అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు మాత్రం షాక్‌లో ఉండకుండా సాధ్యమైనంత త్వరగా సమాచారం ఇచ్చే కోణంలో ప్రచారం నిర్వహించనున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement