మన పోలీసులింతే! | Our polisulinte! | Sakshi
Sakshi News home page

మన పోలీసులింతే!

Published Sun, Feb 16 2014 6:02 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM

Our polisulinte!

బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ముగ్గురు వ్యక్తులు నగరం నడిబొడ్డున ఆటోలో వెళ్తున్న అమ్మాయిలపై చేతులేశారు. అసభ్య చేష్టలతో హడలెత్తించారు. దుండగుల్ని పట్టించడానికి ఆటోడ్రైవర్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఏసీపీ వరకు అందర్నీ సంప్రదించాడు. ఏ దశలో ఎవరూ కనీసం స్పందించలేదు. ఏదైనా ఘటన జరిగితే నానా హడావుడి చేసే రక్షకభటులు.. ఘటనకు కారకులైన వారు దొరికే అవకాశం ఉన్నా పట్టుకోవడానికి ప్రయత్నించలేదు.

ఇది అభాగ్య నగరంలో మహిళలు, యువతలకున్న భద్రతలోని డొల్లతనాన్ని తెలిపే ఉదంతం.. వివరాల్లోకి వెళ్తే..
 ఇబ్రహీంపట్నానికి చెందిన రవీంద్రగౌడ్ ఆటోడ్రైవర్. శనివారం రాత్రి 7.30 సమయంలో మాదాపూర్ తీసుకెళ్లేందుకు సోమాజిగూడలో ముగ్గురు మహిళల్ని ఆటో ఎక్కించుకున్నాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద సిగ్నల్ పడడంతో ఆటో ఆగింది. అక్కడి ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు యువకులు.. అందరూ చూస్తుండగానే ఆటోలో ఉన్న యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, చేతులేస్తూ ఇబ్బందికి
 
గురి చేశారు. ఆటోడ్రైవర్ వారిస్తున్నా వినకుండా తమ ఆగడాన్ని కొనసాగించారు. ఎలాగో వారి బారి నుంచి తప్పించి ఆటోడ్రైవర్ ముగ్గురు యువతుల్ని గమ్యానికి చేర్చి.. తిరిగి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్దకు చేరాడు. అంత క్రితం అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకుల గురించి గాలించాడు. సమీపంలోని బస్టాపులో కూర్చొని మద్యం తాగుతుండటాన్ని గమనించి అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చెప్పాడు. శాంతిభద్రతల పోలీసులకు చెప్పాలని వారు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. కనీసం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరితే విసుక్కున్నారు. దీంతో ఆటోడ్రైవర్ ‘సాక్షి’ విలేకరి ద్వారా బంజారాహిల్స్ ఏసీపీ అశోక్‌కుమార్ నెంబర్ సంపాదించాడు.  

ఆయనకు విషయాన్ని చెప్పగా, జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయాలని సూచించారు. ఆయనకు జరిగిన ఘటన చెప్పి, ముగ్గురు యువకులు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిపాడు. పది నిమిషాల్లో పోలీసులను పంపిస్తానని సదరు ఇన్‌స్పెక్టర్ చెప్పగా.. అరగంటైనా ఎవరూ రాలేదు. అప్పటికే ఫూటుగా తాగిన దుండగులు తాపీగా జారుకున్నారు. ఆటోడ్రైవర్ రవీంద్రగౌడ్ పడిన తాపత్రయం చూసిన వారంతా.. పోలీసుల నిర్వాకమింతేనని వ్యాఖ్యానించారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రవీంద్ర తెలిపారు. ఘటనకు పాల్పడినవారు యాచకులై ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement