స్పీడ్ రీడింగ్ వల్ల ప్రయోజనాలు శూన్యమే..! | Speed reading DOESN'T work: Researchers say people don't understand information they take in | Sakshi
Sakshi News home page

స్పీడ్ రీడింగ్ వల్ల ప్రయోజనాలు శూన్యమే..!

Published Mon, Jan 18 2016 8:36 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

స్పీడ్ రీడింగ్ వల్ల ప్రయోజనాలు శూన్యమే..! - Sakshi

స్పీడ్ రీడింగ్ వల్ల ప్రయోజనాలు శూన్యమే..!

స్పీడ్ రీడింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటూ వివిధ సంస్థలు కోచింగ్ క్లాస్ లు, యాప్ లతో ఊదరకొడుతుంటే... అదంతా వృధా ప్రయాసేనంటున్నారు అధ్యయనకారులు. ఎంతటి సమాచారాన్నయినా స్పీడ్ రీడింగ్ ప్రాక్రిస్ తో గుర్తు పెట్టుకోవచ్చన్న వాదాన్ని వారు తప్పుబడుతున్నారు. స్పీడ్ రీడింగ్ పై జరుగుతున్న ప్రచారానికి అర్థం లేదని, వేగంగా పఠించడం వల్ల విషయాలు గుర్తుండవని, హాయిగా... ప్రశాంతంగా చదివినదే ఎక్కువకాలం గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నది పరిశోధకుల వాదన.

వేగ పఠనంపై అందుబాటులో ఉన్న యాప్ లు, టెక్నిక్ లను అధ్యయనం చేసిన పరిశోధకులు వాటివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటున్నారు. దశాబ్దాల కాలంగా జరిగిన పరిశోధనలను పరిశీలించిన అధ్యయనకారులు స్పీడ్ రీడర్స్ చదివిన విషయాలను గుర్తు పెట్టుకోలేకపోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ మెయిల్, సామాజిక మీడియా ప్రపంచంలో స్పీడ్ రీడింగ్ అవసరమౌతుందే తప్పించి దీర్ఘ కాల ప్రయోజనాలకు అవసరం లేదంటున్నారు. అతి పెద్ద పుస్తకాల్లో రాసిన విషయాన్ని అప్పటికప్పుడు చదివి,  తక్కువ సమయం గుర్తుపెట్టుకొనేందుకు స్పీడ్ రీడింగ్ షార్ట్ కట్ మెథడ్ అని, విజ్ఞాన శాస్త్రంలో అది ఓ చిన్న ఆధారం మాత్రమే అని పరిశోధనల్లో తేలిందని సైకలాజికల్ సైంటిస్టుల బృందం చెప్తోంది.

 

దశాబ్దాల కాలంగా స్పీడ్ రీడింగ్ కోర్సులు ఉండగా... ఇటీవల కన్జూమర్ మార్కెట్లో స్పీడ్ రీడింగ్ టెక్నాలజీల సంఖ్య భారీగా పెరిగిపోయిందని, శాన్ డియాగోలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా  సైకలాజికల్ సైంటిస్ట్ ఎలిజబెత్ స్కాటర్ చెప్తున్నారు. తక్కువ సమయంలో చదవడం వల్ల, విషయాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం  తక్కువగానే ఉంటుందని ఆమె వివరిస్తున్నారు. పఠనం అనేది మనసుకు, కళ్ళకు సంబంధించిన ప్రక్రియ అని, ఎంతో నైపుణ్యం కలిగిన వారు నిమిషానికి సుమారు 200 నుంచి 400 పదాలు చదవగల్గుతారని అంటున్నారు.

కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ మధ్యభాగంలో వెంట వెంటనే పదాలు ప్రదర్శించడంద్వారా వేగ పఠనం అలవర్చుకొనేందుకు స్పీడ్ రీడింగ్ టెక్నాలజీలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ సరైనది కాదని, ఇందులో జరిగిపోయిన పదాన్ని తిరిగి చదివేందుకు, వాక్యనిర్మాణానికి అవకాశం లేదని, ఇలా స్పీడ్ గా కదిలిపోయే పదాల్లో పది శాతం పదాలను మాత్రమే కళ్ళు చూడగల్గుతాయని పరిశోధకులు చెప్తున్నారు. మన దృష్టి, సామర్థ్యం కలిపితేనే వ్యాక్య నిర్మాణం జరుగుతుందని అప్పుడే చదవడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

భాష పట్ల అవగాహన లేకుండా స్పీడ్ గా చదివే సమర్థతను పెంచడం వల్ల ఏమీ లాభం లేదంటున్నారు. అయితే విషయాలపట్ల సమగ్ర అవగాహన ఉండి, వేగంగా చదివేవారికి ఇది వర్తించదంటున్నారు. చదువుతున్న విషయంపై ఆసక్తి అధికంగా ఉండి, ఎక్కువ విషయాన్ని తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉన్నవారికి ఈ స్పీడ్ రీడింగ్ ది కొంత ప్రయోజనకరంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన పఠనాశక్తి కలిగి ఉండాలంటే మాత్రం విషయంపట్ల అవగాహన అవసరం అని, అది మోతాదు ప్రకారం పెంచుకోవడమే అన్ని రకాలుగా శ్రేయస్కరమని అధ్యయనకారులు తేల్చి చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement