తనిఖీలు నిర్వహిస్తున్న తూనికలు, కొలతల శాఖ అధికారులు
సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్‌లో పెట్రోల్ బంకుల యజమానులు రూట్ మార్చి మోసాలకు పాల్పడుతున్నారా, పెద్ద ఎత్తున ఒకేసారి కాకుండా ఒక లీటర్‌కు 5 నుంచి 10 మిల్లీ లీటర్లు తక్కువగా పోస్తూ రూపాయి రూపాయి వెనుకేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడుల్లో బయట పడుతున్న విషయాలే ఇందుకు నిదర్శనం.
రాష్ట్ర తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మూడు రోజులుగా గ్రేటర్ పరిదిలోని పెట్రోల్ బంకులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొలతలలో తేడాలు వస్తున్న బంకులపైన కేసులు నమోదు చేస్తున్నారు. తనిఖీల్లో ఒక్కో నాజిల్ నుంచి 5 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌ను పరిశీలించగా 35 నుంచి 30 మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు.
వరుసగా తనిఖీలు
హైదరాబాద్ జిల్లాలో 176, రంగారెడ్డి జిల్లా రీజియన్‌లో 375 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని రోజులుగా తూనికలు, కొలతల శాఖ అధికారులు స్థబ్ధుగా ఉండటంతో పెద్దగా కేసులు నమోదు కాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రేటర్‌లోని పెట్రోల్ బంకులపై ఫిర్యాదులు వస్తున్నందున తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న బంకుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 25న హస్తినాపురంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో లీటరుకు 6 మిల్లిలీటర్ల చొప్పున తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు.
బీఎన్ రెడ్డి నగర్, ఇంజాపూర్‌లోని మరో రెండు బంకుల్లోనూ తక్కువగా వస్తుండటంతో వాటిని సీజ్ చేశారు. ఈ నెల 26న అత్తాపూర్, కూకట్‌పల్లి, ఆరాంఘర్, కర్మాన్ ఘట్‌తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి మూడు బంకుల్లో తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు.
చిల్లర మోసం
పెట్రోల్ బంకుల యజమానులు ఒక లీటర్‌కు 6 మిల్లీలీటర్ల చొప్పున తక్కువగా వచ్చేలా నాజిల్‌లో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లీటరు పెట్రోల్ ధర రూ. 74.45 కాగా ఒక లీటరు కొనుగోలుపై 50 పైసల వరకు దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక బంకులో ఒక రోజు సుమారు 5వేల లీటర్ల అమ్మకాలు జరిగితే అదనంగా రూ. 2500 వరకు ఆదాయం వస్తుంది.
ఈ తరహా మోసాల వల్ల లీటరు, రెండు లీటర్లు పోయించుకునే వారికి పెద్దగా నష్టం ఉండకపోయినా పెద్ద వాహనాలైన లారీలు, బస్సులు, కార్లలో ఒక్కోసారి 100 లీటర్ల వరకు డీజిల్ పోయిస్తుంటారు. ఇలాంటి వినియోగదారులు బంకుల యజమానులు చేసే చిల్లర మోసాలకు అధికంగా నష్టపోతున్నారు.
దాడులతో అప్రమత్తం
గ్రేటర్‌లోని పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకుంటే మైలేజీ రావడం లేదని తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మొదటి రోజు, రెండో రోజు మూడు కేసులు నమోదు చేశారు. అధికారుల దాడులతో అప్రమత్తమైన బంకుల యజమానులు కొలతల్లో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
దీంతో మూడవ రోజు మేడ్చల్, ఆదిభట్ల, కర్మాన్ ఘట్, శామీర్‌పేట. షాద్‌నగర్ ప్రాంతాల్లోని 17 బంకుల్లో తనిఖీలు చేసిన పెద్దగా తేడాలు రాలేదని తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు.
రిమోట్ సహాయంతో సరిచేస్తూ పెట్రోల్ బంకుల్లో ఎక్కువ శాతం మోసాలు అధునాతన చిప్‌లను వినియోగించి చేస్తుంటారనే విషయం తెలిసిందే. కారు రిమోట్ తరహాలో ఉండే ఈ రిమోట్‌ల సహయంతో దూరం నుంచి కూడ వీటిని ఆపరేట్ చేసి నాజిల్‌లోని రీడింగ్‌ను సెట్ చేయవచ్చు.
అధికారులు దాడులకు వస్తే వెంటనే అప్రమత్తమయ్యే బంకుల యజమానులు రీడింగ్‌లో తేడాలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు సమాచారం. పలు బంకుల్లో లీటరుకు30 నుంచి 50 మిల్లీలీటర్ల వరకు తక్కువ వస్తున్నా అధికారుల దాడులతో జాగ్రత్త పడినట్లు సమాచారం.
అర్ధరాత్రి తరువాత దాడులు
మూడు రోజులుగా దాడులు చేస్తుండటంతో బంకుల నిర్వాహకులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మేము కూడ తెలివిగా వ్యవహరించి తనిఖీలు చేపడుతాం. అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేయాలని భావిస్తున్నాం. అక్రమాలకు పాల్పడే వారికి జరిమానాలు విధించడంతో పాటు, నాజిల్‌లను సీజ్ చేస్తున్నాం. వరుసగా పట్టుబడిన బంకుల యజమానులపై కేసులు నమోదు చేస్తాం.
– జగన్ మోహన్ రెడ్డి తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్
Comments
Please login to add a commentAdd a comment