బీఎస్పీ అధినేత కుమారి మాయావతి
రాష్ట్రంలో శాంతి భద్రతల మృగ్యమైన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షురాలు కుమారి మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్ వెలుపల విలేకర్ల సమావేశంలో మాయావతి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు అనేది మచ్చుకైన లేకుండా పోయాయని అన్నారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్, కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని మధురలోని అత్యాచారానికి గురైన యువతి, ఆమె తల్లి కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు కాల్పుల జరిపి ఆ యువతిని హత్య చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆ ఘటనలో ఆ యువతి తల్లి తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మృత్యువుతో పోరాడుతుందని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
ఓ విధంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో అరాచకత్వం రాజ్యమేలుతుందని అఖిలేష్ ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్ర మంత్రి ఆజాం ఖాన్ గేదెలు ఆచూకీ తెలియకపోయాయి. ఆ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడం చేయడం ఎంతవరకు సబబని మాయావతి విలేకర్ల సమావేశంలో ప్రశ్నించారు.