BSP supremo
-
మసూద్‌నూ వదలరా..?
సాక్షి,న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించిన నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు ఈ చర్యను స్వాగతిస్తుండగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రచార అస్త్రంగా మలుచుకున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో బీజేపీ ప్రభుత్వం మసూద్ అజర్‌ను విడుదల చేసి అతిధి మర్యాదలతో విదేశాల్లో అప్పగించిందని, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మసూద్ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు. కాషాయపార్టీ తీరు తీవ్ర అభ్యంతరకరమని మాయావతి ఆక్షేపించారు. కాగా, కాందహార్‌లో ఎయిర్ఇండియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన క్రమంలో వారి డిమాండ్‌కు తలొగ్గిన అప్పటి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం మసూద్ అజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మసూద్ అజర్‌ను విడుదల చేయడాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా విపక్షాలు ఇటీవల విమర్శలు గుప్పించారు. అప్పటి అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి ఫలితంగానే పుల్వామా దాడి సహా జైషే మహ్మద్ ఉగ్ర మూకలు చెలరేగుతున్నాయని విపక్షాలు వ్యాఖ్యానించాయి. -
బీజేపీ, కాంగ్రెస్‌లపై బెహన్ మండిపాటు
లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకం రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర చర్చకు తెరలేపింది. పేదరిక నిర్మూలనపై హామీలు గుప్పించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ రెండేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఇరు పార్టీలు ఒకే గూటి పక్షులని ఆరోపించారు. పేదరికాన్ని నిర్మూలిస్తామనే ఈ పార్టీల నినాదాలు ఓట్ల వేట ముగిసిన అనంతరం మరుగునపడతాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పధకాన్ని ఎన్నికల ఎత్తుగడగా బీజేపీ చెబుతోందని, ఎన్నికల హామీలు గుప్పించడం ఆ పార్టీ సొత్తుగా కాషాయ పార్టీ భావిస్తోందా అని బీజేపీని ఆమె నిలదీశారు. పేదలు, కార్మికులు, రైతులు, ఇతర వర్గాల ప్రయోజనాలు విస్మరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక దానికి మరోటి తీసిపోవని మాయావతి ట్వీట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే దేశంలో 5 కోట్ల అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 అందచేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను ఎన్నికల జిమ్మిక్కుగా బీజేపీ విమర్శిస్తున్న క్రమంలో మాయావతి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ హామీ ఆచరణ సాధ్యం కాదని బీజేపీ నేతలు ఆక్షేపిస్తుంటే ఆర్థిక నిపుణులతో కూలంకషంగా చర్చించిన మీదటే కనీస ఆదాయ హామీ పధకం ప్రకటించామని కాంగ్రెస్ చెబుతోంది. -
‘ఉద్రిక్తతల మాటున వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటున్నారు’
లక్నో : ఇండో-పాక్ ఉద్రిక్తతల మాటున ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చకుంటున్నారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. పీఓకేలో జరిపిన వైమానిక దాడుల ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో, సుపరిపాలన అందించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఘోరంగా విఫలమైందని పార్టీ నేతల భేటీలో మాయావతి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ సర్కార్ అవలంభిస్తున్న ఎత్తుగడలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపు ఇచ్చారు. బీజేపీ కుయుక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని రానున్న లోక్‌సభ ఎన్నికలకు సన్నాహక సమావేశంగా ఏర్పాటు చేసిన భేటీలో మాయవతి పేర్కొన్నారు. ఎస్పీతో పొత్తుపై పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని ఆమె ఈ సమావేశంలో తెలుసుకున్నారు. యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ 38 స్ధానాల్లో ఎస్పీ 37 స్ధానాల్లో పోటీచేయనున్నాయి. -
మాయావతి షాక్ : అఖిలేష్‌తో కాంగ్రెస్ మంతనాలు
భోపాల్ : బీఎస్పీ అధినేత్రి మాయావతి పొత్తుకు ససేమిరా అనడంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఈ అంశాన్ని ధృవీకరించారు. కొద్దిరోజుల కిందట అఖిలేష్‌తో పొత్తుకు సంబంధించి తాను మాట్లాడానని, దీనిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. బీఎస్పీ తమకు అందించిన సీట్ల జాబితాలో ఆ పార్టీ గెలిచే స్ధానాలు లేవని, ఓడిపోయే స్ధానాలను కోరడంతోనే బీఎస్పీతో పొత్తు ప్రయత్నాలకు విఘాతం కలిగిందని కమల్ నాధ్ చెప్పారు. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ కాదని, క్షేత్రస్ధాయిలో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ కనిపిస్తోందన్నారు. ఓట్ల చీలికతో బయటపడాలని బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. -
అటల్జీ మృతిని వాడుకుంటున్నారు..
లక్నో : బీజేపీ టార్గెట్‌గా బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ప్రజల మధ్య విభజన చిచ్చు రాజేస్తున్నాయని ఆరోపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిని బీజేపీ రాజకీయ లబ్ధికి వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల హామీలను నెరవేర్చకుండా అటల్జీ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమయ్యే ప్రతిపాదనను ప్రస్తావిస్తూ తమ పార్టీ ఏ రాష్ట్రంలో, ఎలాంటి ఎన్నికలకైనా పొత్తులకు సిద్ధంగా ఉందని, అయితే బీఎస్పీకి గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని స్పష్టం చేశారు. తమకు తగినంతగా సీట్లు కేటాయించని పక్షంలో ఒంటరి పోరుకు దిగుతామని పేర్కొన్నారు. -
అది పాము, ముంగిసల బంధం
సాక్షి, లక్నో : యూపీలోని పూల్పూర్, గోరఖ్‌పూర్ లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థులకు మద్దతిస్తామని బీఎస్పీ ప్రకటించడాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తప్పుపట్టారు. ఎస్పీ, బీఎస్పీల మధ్య భాగస్వామ్యం పాము, ముంగిసల కలయిక వంటిదని అభివర్ణించారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల పరిస్థితికి ఇది అద్దంపడుతుందని వ్యాఖ్యానించారు. పూల్పూర్, గోరఖ్‌పూర్‌లో బీఎస్పీ అభ్యర్థులు పోటీలో ఉండరని, అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించే సత్తా ఉన్న అభ్యర్ధులకు తమ కార్యకర్తలు ఓటేస్తారని ఇందులో తప్పేమీలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రానున్న రాజ్యసభ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల్లో ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయని ఆమె వెల్లడించారు. గత ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం యోగి ఆదిత్యానాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో గోరఖ్‌పూర్, పూల్పూర్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
18 రైళ్లు బుక్ చేసిన మాజీ సీఎం
ఉత్తరప్రదేశ్‌లో ఈసారి మళ్లీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి.. తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఈనెల 9వ తేదీన పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించాలని తలపెట్టారు. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల నుంచి లక్ష మందిని సమీకరించాలని.. ఇప్పటికే 18 రైళ్లు బుక్ చేశారు. వీటిలో 16 పశ్చిమ యూపీ నుంచి, మరో రెండు బలియా జిల్లా నుంచి బయల్దేరతాయి. చివరి రోజున కనీసం 20 లక్షల మంది మద్దతుదారులను సమీకరించాలన్నది పార్టీ లక్ష్యమని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ప్రతి రైల్లో 5వేల మంది వరకు వలంటీర్లు 8వ తేదీనే లక్నో చేరుకుంటారు. వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నవాళ్లంతా బస్సుల్లో తమ నియోజకవర్గం నుంచి జనాన్ని తరలించాలని కూడా మాయావతి ఆదేశించారు. లక్నో చేరుకోవాలని చాలామంది కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా ఉన్నారని, కానీ వాళ్లకు రైళ్లు.. ఇతర రవాణా సదుపాయాలు కల్పించడం తమకు సాధ్యం కావడం లేదని బలియా ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ చెప్పారు. ఆయన ఇప్పటికే రెండు రైళ్లు బుక్ చేశారు. లక్నో ర్యాలీ బీఎస్పీ బలాన్ని సూచిస్తుందని మరో నాయకుడు తెలిపారు. మాయావతి ఇప్పటికే ఆగ్రా, ఆజాంగఢ్, సహారన్పూర్, అలహాబాద్ ప్రాంతాల్లో ర్యాలీలు చేసి 220 నియోజకవర్గాలను కవర్ చేశారంటున్నారు. ప్రధానంగా దళితులు, ముస్లింలు బ్రాహ్మణుల ఓటు బ్యాంకుపై కన్నేసిన బీఎస్పీ.. మిగిలిన అన్ని వర్గాల నుంచి కూడా జనాన్ని సమీకరించాలని తలపెడుతోంది. అయితే ఇటీవల నిర్వహించిన పలు సర్వేలలో మాత్రం.. ఉత్తరప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ - సమాజ్‌వాదీలకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయని, కాంగ్రెస్, బీఎస్పీ లాంటివి సోదిలోకి కూడా కనపడకుండా పోతాయని తేలింది. అయితే సర్వేలను సైతం తలదన్నేలా తాము ఫలితాలు సాధిస్తామని బీఎస్పీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణ రభసకు సర్కారే కారణం: మాయావతి
తెలంగాణ అంశం కారణంగా పార్లమెంటు పని చేయకపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. లోక్‌సభ, రాజ్యసభ రెండూ అస్సలు పనిచేయడం లేదని, యూపీఏ ప్రభుత్వం, కేంద్రమే ఇందుకు బాధ్యత వహించాలని ఆమె అన్నారు. తెలంగాణ కావాలని కొందరు, వద్దని కొందరు సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారని, దాంతో సభ కొంచెం కూడా ముందుకు నడవట్లేదని ఆమె పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయితే తమ పార్టీ మాత్రం తెలంగాణకు మద్దతు ఇస్తుందన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి, పాలన మెరుగవుతాయని, అందువల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. మరి పార్లమెంటులో ఈ అంశం కారణంగానే బిల్లులేవీ చర్చకు రావట్లేదని ప్రస్తావించగా, ప్రభుత్వం నిజంగానే బిల్లుల విషయంలో చిత్తశుద్ధితో ఉంటే, వాటిని గత ఐదేళ్లలో ఎందుకు పెట్టలేదని ఆమె అడిగారు. సభ జరగకపోవడానికి కేవలం ప్రభుత్వమే కారణమని మాయావతి అన్నారు. -
'రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి మహాప్రభో'
రాష్ట్రంలో శాంతి భద్రతల మృగ్యమైన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షురాలు కుమారి మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్లమెంట్ వెలుపల విలేకర్ల సమావేశంలో మాయావతి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు అనేది మచ్చుకైన లేకుండా పోయాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్, కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని అత్యాచారానికి గురైన యువతి, ఆమె తల్లి కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు కాల్పుల జరిపి ఆ యువతిని హత్య చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆ ఘటనలో ఆ యువతి తల్లి తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మృత్యువుతో పోరాడుతుందని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్‌లో అరాచకత్వం రాజ్యమేలుతుందని అఖిలేష్ ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్ర మంత్రి ఆజాం ఖాన్ గేదెలు ఆచూకీ తెలియకపోయాయి. ఆ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడం చేయడం ఎంతవరకు సబబని మాయావతి విలేకర్ల సమావేశంలో ప్రశ్నించారు.