లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకం రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర చర్చకు తెరలేపింది. పేదరిక నిర్మూలనపై హామీలు గుప్పించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ రెండేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఇరు పార్టీలు ఒకే గూటి పక్షులని ఆరోపించారు. పేదరికాన్ని నిర్మూలిస్తామనే ఈ పార్టీల నినాదాలు ఓట్ల వేట ముగిసిన అనంతరం మరుగునపడతాయని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పధకాన్ని ఎన్నికల ఎత్తుగడగా బీజేపీ చెబుతోందని, ఎన్నికల హామీలు గుప్పించడం ఆ పార్టీ సొత్తుగా కాషాయ పార్టీ భావిస్తోందా అని బీజేపీని ఆమె నిలదీశారు. పేదలు, కార్మికులు, రైతులు, ఇతర వర్గాల ప్రయోజనాలు విస్మరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక దానికి మరోటి తీసిపోవని మాయావతి ట్వీట్ చేశారు.
తాము అధికారంలోకి వస్తే దేశంలో 5 కోట్ల అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 అందచేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను ఎన్నికల జిమ్మిక్కుగా బీజేపీ విమర్శిస్తున్న క్రమంలో మాయావతి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ హామీ ఆచరణ సాధ్యం కాదని బీజేపీ నేతలు ఆక్షేపిస్తుంటే ఆర్థిక నిపుణులతో కూలంకషంగా చర్చించిన మీదటే కనీస ఆదాయ హామీ పధకం ప్రకటించామని కాంగ్రెస్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment