18 రైళ్లు బుక్ చేసిన మాజీ సీఎం
ఉత్తరప్రదేశ్‌లో ఈసారి మళ్లీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి.. తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఈనెల 9వ తేదీన పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించాలని తలపెట్టారు. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల నుంచి లక్ష మందిని సమీకరించాలని.. ఇప్పటికే 18 రైళ్లు బుక్ చేశారు. వీటిలో 16 పశ్చిమ యూపీ నుంచి, మరో రెండు బలియా జిల్లా నుంచి బయల్దేరతాయి. చివరి రోజున కనీసం 20 లక్షల మంది మద్దతుదారులను సమీకరించాలన్నది పార్టీ లక్ష్యమని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
ప్రతి రైల్లో 5వేల మంది వరకు వలంటీర్లు 8వ తేదీనే లక్నో చేరుకుంటారు. వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నవాళ్లంతా బస్సుల్లో తమ నియోజకవర్గం నుంచి జనాన్ని తరలించాలని కూడా మాయావతి ఆదేశించారు. లక్నో చేరుకోవాలని చాలామంది కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా ఉన్నారని, కానీ వాళ్లకు రైళ్లు.. ఇతర రవాణా సదుపాయాలు కల్పించడం తమకు సాధ్యం కావడం లేదని బలియా ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ చెప్పారు. ఆయన ఇప్పటికే రెండు రైళ్లు బుక్ చేశారు. లక్నో ర్యాలీ బీఎస్పీ బలాన్ని సూచిస్తుందని మరో నాయకుడు తెలిపారు. మాయావతి ఇప్పటికే ఆగ్రా, ఆజాంగఢ్, సహారన్‌పూర్, అలహాబాద్ ప్రాంతాల్లో ర్యాలీలు చేసి 220 నియోజకవర్గాలను కవర్ చేశారంటున్నారు. ప్రధానంగా దళితులు, ముస్లింలు బ్రాహ్మణుల ఓటు బ్యాంకుపై కన్నేసిన బీఎస్పీ.. మిగిలిన అన్ని వర్గాల నుంచి కూడా జనాన్ని సమీకరించాలని తలపెడుతోంది.
అయితే ఇటీవల నిర్వహించిన పలు సర్వేలలో మాత్రం.. ఉత్తరప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ - సమాజ్‌వాదీలకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయని, కాంగ్రెస్, బీఎస్పీ లాంటివి సోదిలోకి కూడా కనపడకుండా పోతాయని తేలింది. అయితే సర్వేలను సైతం తలదన్నేలా తాము ఫలితాలు సాధిస్తామని బీఎస్పీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.