
'యూపీలో రాష్ట్రపతి పాలన విధించండి'
శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రణబ్ను మాయావతి కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని ప్రణబ్కు వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవల ముజఫర్నగర్లో చోటు చేసుకున్న మత ఘర్షణలే అందుకు ఉదాహరణ అని మాయావతి చెప్పారు.
ముజఫర్నగర్ ఘర్షణలను అరికట్టడంలో అఖిలేష్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. అలాగే ఆ ఘర్షణల అనంతరం స్థానికంగా శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు ఆ ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందో మాయావతి మీడియా ముఖంగా ఏకరువు పెట్టారు.
ముజఫర్నగర్ ఘర్షణలో దాదాపు 48 మరణించారని, వందలాది మంది గాయాలపాలైయ్యారని ఈ సందర్భంగా మాయావతి వివరించారు. మతఘర్షణల వల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయిన అఖిలేష్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారించిందని మాయావతి మండిపడ్డారు.