ఏ క్షణంలోనైనా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అవకాశముందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: ఏ క్షణంలోనైనా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అవకాశముందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించే దిశగా కేంద్రం ఆలోచిస్తోందన్నారు. ఆయన గురువారమిక్కడ ఎమ్మెల్సీ ఆమోస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాదిన్నరగా ప్రభుత్వ పాలన లేకుండాపోయిందని, వరుస ఉద్యమాలతో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. సీఎం కిరణ్, కేబి నెట్ మంత్రులంతా ప్రభుత్వాన్ని నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘‘ఇలాంటి పరిస్థితి గతంలో పి.వి.నరసింహారావు హయాంలో ఏర్పడింది. ఆనాడు ముల్కీ నిబంధనలపై తీర్పు వెలువడటంతోపాటు పీవీ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టడంతో ఆంధ్రా పెత్తందారులు ‘జై ఆంధ్రా’ ఉద్యమాన్ని నడిపారు.
సీఎం పనిచేయలేని పరిస్థితి నెలకొనడం, ఉద్యమాలను నియంత్రించలేకపోవడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన విధించింది. ప్రస్తుతం రాష్ట్రం లో మళ్లీ అలాంటి పరిస్థితులే కన్పిస్తున్నా యి’’ అని అన్నారు. సమైక్య ఉద్యమాన్ని ప్రభుత్వంలో ఉన్నవారే ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని తనతోపాటు పలువురు ఎంపీలు కేంద్ర పెద్దలను కోరినట్టు తెలిపారు. వారంతా సానుకూలంగా ఉన్నారని, సోనియాగాంధీతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రపతి పాలన వస్తే ప్రస్తుత గవర్నర్ నరసింహన్ తన విధులను సమర్థంగా నిర్వర్తించలేరని, ఆయన స్థానంలో అనుభవమున్న వ్యక్తిని నియమించాలని కోరారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రాజకీయ వ్యభిచారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.