
'సీఎం హద్దులు దాటి లేఖలు రాస్తున్నారు'
ఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హద్దులు దాటి లేఖలు రాస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ పాల్వయి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. ఒకవేళ లేఖలు రాసే అధికారం ఆయనకు ఉన్నా, కేబినెట్ అనుమతి లేకుండా లేఖలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. మరోసారి అఖిలపక్ష భేటీ ఉంటుందని హోంమంత్రి సుశీల్ కుమార్ ప్రకటించిన సందర్భంగా పాల్వాయి గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన జీఓఎం(కేంద్ర మంత్రుల బృందం) చేస్తున్న పనిని పార్టీలకు వివరించేందుకే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ విభజన ప్రక్రియలో సంప్రదించలేదని ఆరోపిస్తున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలను తీసుకుంటారని పాల్వాయి తెలిపారు.
నవంబరు చివరికల్లా జీఓఎం పని పూర్తి చేస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీఎం తనకు నచ్చిన విధంగా లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. లేఖలు రాసే ముందు కేబినెట్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరముందని పాల్వాయి తెలిపారు.