
'అధిష్టానమే కిరణ్ ను సీఎం చేసింది'
హైదరాబాద్:కాంగ్రెస్ అధిష్టానమే కిరణ్ కుమార్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తించుకుంటే మంచిదని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానంపై సీఎం పరోక్షంగా విరుచుకుపడిన అనంతరం పాల్వాయి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానమే కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసిన విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించిన అనంతరం సీఎం ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు. పార్టీకి ద్రోహం చేసే పని చేయవద్దని ఆయన సీఎంకు సూచించారు.
రవీంద్ర భారతిలో తెలుగు భాషా దినోత్సవ సభలు సందర్భంగా ప్రసంగించిన సీఎం అధిష్టానానికి చురకలంటించిన సంగతి తెలిసిందే. 'మన ప్రజా స్వామ్యంలో ప్రజలే కీలక నిర్ణయాలు తీసుకుంటారని, ఒకవేళ పార్టీలు నిర్ణయాలు తీసుకోదలిస్తే.. ఆ ప్రభుత్వానికి ప్రజలు పూర్తిగా సెలవు ప్రకటిస్తారన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందనుకోవడం పొరపాటన్నారు.సరైన నిర్ణయాలు తీసుకోని ప్రభుత్వాలకు ప్రజలు ఎన్నోసార్లు సెలవు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు'.
సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ పెద్దలు మండిపడుతున్నారు. సీఎం కిరణ్ వ్యాఖ్యలు ఆయన నైరాస్యానికి అర్ధం పడుతున్నాయని మరోఎంపీ ఎంపీ ఆనంద్ భాస్కర్ విమర్శించారు. మాతృ ద్రోహానికి పాల్పడితే చరిత్ర క్షమించదని ఆయన అభిప్రాయపడ్డారు.