ఉత్తరాఖండ్‌లో 31న బలపరీక్ష
హైకోర్టు తీర్పు
♦ అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలకూ ఓటువేసే అవకాశం
♦ కేంద్రానికి ఎదురుదెబ్బ; తీర్పును సవాల్‌చేసే యోచన
నైనిటాల్: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కొత్త మలుపు. కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలేలా హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన రెండు రోజులకే ఉత్తరాఖండ్ హైకోర్టు ఈనెల 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని మంగళవారం ఆదేశించింది. అలాగే, అనర్హత వేటుపడ్డ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ ఓటు వేసేందుకు అనుమతించింది. అయితే వారి ఓట్లను విడిగా ఉంచాలని, వీరి అనర్హతను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పును బట్టి వాటిపై నిర్ణయం ఉంటుందని చెప్పింది. రాష్ట్రపతి పాలనను సవాల్‌చేస్తూ పదవీచ్యుత సీఎం హరీశ్‌రావత్ దాఖలుచేసిన పిటిషన్‌పై జస్టిస్ యూసీ ధ్యాని వరుసగా రెండోరోజూ వాదనలు విన్నారు.
బలపరీక్ష సజావుగా జరిగేందుకు ఆ రోజు అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని డీజీపీని ఆదేశించారు. విశ్వాసపరీక్ష నిర్వహించాలని ఆదేశించినప్పటికీ, రాష్ట్రపతి పాలనపై స్టే విధించారా లేదా అన్నదానిపైనా, రద్దయిన రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించారా లేదా అన్న విషయాలపైనా స్పష్టత లేదు. తొలుత గవర్నర్ విశ్వాసపరీక్షకు ఈనెల 28ని ఖరారుచేయగా, దాని కంటే ఒకరోజు ముందు కేంద్రం రాష్ర్టపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.
సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై కేంద్రం బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసే అవకాశముంది. అలాగే, అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు అనుమతించడంపై కాంగ్రెస్ కూడా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలనే యోచనలో ఉంది. రావత్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం నిర్హేతుకంగా విధించిన రాష్ట్రపతి పాలనను తక్షణమే రద్దు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వాదనలను కోర్టు అంగీకరించిందని, రాష్ట్రపతి పాలన విధించకుండా విశ్వాస పరీక్ష నిర్వహించడానికి అవకాశముందని పేర్కొందని సింఘ్వీ మీడియాకు చెప్పారు. కేవలం బేరసారాల ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి పాలన విధించలేరని, బల పరీక్షనూ ఆపలేరన్నారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను ఓటు వేసేందుకు అనుమతించడంపై సింఘ్వీ మాట్లాడుతూ, వారి అనర్హత రద్దు అయితే తప్ప వారి ఓట్లు చెల్లుబాటు కావని చెప్పారు.
వారికి ఎదురుదెబ్బ: రావత్
కోర్టు తీర్పును హరీశ్ రావత్ స్వాగతించారు. నిరంకుశ పాలనను తేవడానికి యత్నిస్తున్న కేంద్రానికి ఇది ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. అలాగే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేయాలన్న వారి యత్నాలను ఈ తీర్పు అడ్డుకుంటుందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిందని, దీన్ని కేంద్రం అడ్డుకుంటే 24 గంటలపాటు నిరశన దీక్ష చేపడతానని చెప్పారు. తమకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ చెబుతోంది. తమ పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలతోపాటు 6 మంది పీడీఎఫ్ మ్మెల్యేలు, ఒక బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యే మద్దతు ఉందని చెప్పింది.