ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట | Siddipet as a educational hub | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట

Published Sat, Mar 1 2014 11:53 PM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

Siddipet as a educational hub

 సిద్దిపేటజోన్,న్యూస్‌లైన్: సిద్దిపేట నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కృషి చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణానికి కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయం మంజూరైందన్నారు.

 ఇందుకు తోడు సిద్దిపేటలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది సిద్దిపేటతో పాటు సికింద్రాబాద్‌కు నూతనంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరైనప్పటికీ సీఎం కిరణ్ సిద్దిపేటపై చూపిన వివక్ష  కారణంగా పెండింగ్ పడిందన్నారు.  రాష్ట్రపతి పాలన విధిస్తున్న క్రమంలో పెండింగ్‌లోని ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. స్పందించిన ఆయన జీవో విడుదల చేశారన్నారు. దీంతో జిల్లాలోనే సిద్దిపేట నియోజకవర్గానికి మూడు పాలిటెక్నిక్ కళాశాలలు సాధించుకున్న ఘనత దక్కిందన్నారు.గతంలో వెటర్నరీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు.

అలాగే ఐటీఐ, మోడల్ పాఠశాలలు , కస్తూర్బా పాఠశాలలు మంజూరయ్యాయన్నారు.  ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు కమల్‌నాథ్, పల్లంరాజు, జైరాంరమేష్‌ను కలిసి నియోజకవర్గ ప్రతిపాదనలపై చర్చించామన్నారు. సిద్దిపేటలో 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లో ఎంసెట్, ఎడ్‌సెట్, పాలిటెక్నిక్ అడ్మిషన్ కేంద్రాలతో పాటు కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటుకు జీవో విడుదల కానుందన్నారు.

సిద్దిపేటలోని బలహీన వర్గాల కోసం రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద రూ.  120 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, త్వరలో మంజూరు కానున్నాయన్నారు. సిదిపేటలో ఎస్‌ఎంహెచ్ భవనాల నిర్మాణ పనులు రూ. 3.5 కోట్లతో కొనసాగుతున్నాయని,  మరో రూ. 2.25 కోట్లు మంజూరు కానున్నాయన్నారు. సిద్దిపేట పట్టణంలో ఉన్నత విద్యా అవకాశాలను మెరుగు పరిచే క్రమంలో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూసా పథకం కింద రూ. 60 కోట్లతో సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు కానుందని త్వరలో జీవో రానుందని అశాభావం వ్యక్తం చేశారు. రూ. 19 కోట్లతో పీజీ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.  సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు దువ్వల మల్లయ్య, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, వెంకట్‌రెడ్డి, నందు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement