సిద్దిపేటలో రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ‘ఇప్పటికి రెండుసార్లు లక్షలోపు మెజార్టీ ఇచ్చి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈసారి చరిత్రను తిరగరాసే తీర్పు ఇచ్చే అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ తీర్పు ఢిల్లీకి వినబడాలి’ అంటూ లక్ష మెజార్టీ లక్ష్యంపై సిద్దిపేట ఓటర్లను టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బుధవారం పట్టణ పురవీధుల గుండా హరీశ్‌రావు భారీ రోడ్ షోను నిర్వహించారు. స్థానిక నర్సాపూర్ చౌరస్తా నుంచి మొదలైన ర్యాలీ పట్టణంలో సుమారు 5గంటల పాటు కొనసాగింది.
అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ షోకు హాజరైన ప్రజలనుద్దేశించి హరీశ్‌రావు మాట్లాడారు. సిద్దిపేట ప్రజల ఆదరాభిమానాలు, స్వాగతం చూస్తుంటే తనకు మాటలు రావడం లేదన్నారు. మీ ప్రేమ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని జీవితంలో ఇంతకంటే పెద్ద అదృష్టం ఏముంటుందన్నారు. తనకు గెలుపోటముల గురించి ఆలోచన లేదని.. డిసెంబర్ 11న చరిత్రను తిరగరాసే విధంగా సిద్దిపేట ఓటర్లు తీర్పు ఇవ్వాలని ఆకాంక్షించారు.
ఎన్ని జిల్లాలు తిరిగినా సిద్దిపేటకు రావాల్సిందే
ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలోనే జిల్లాల్లో పర్యటించే తనను.. శాసనసభలో సహచర ఎమ్మెల్యేలు పక్షిలాగా తిరుగుతున్నావని హాస్యోక్తులు చేసేవారన్నారు. ఔను నిజంగా తాను పక్షినేనని, పక్షి రోజంతా తిరిగి రాత్రికి తన పిల్లల గూడుకు చేరుకున్నట్లే తాను ఎన్ని జిల్లాలు తిరిగినా మళ్లీ సిద్దిపేటకు చేరుకుంటానన్నారు. సిద్దిపేట ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకుంటేనే తన మనస్సు కుదుటపడుతుందన్నారు.
సిద్దిపేట ప్రజల కష్టాలు తెలుసుకుని సేవ చేస్తేనే తన కడుపు నిండినట్లుగా, సిద్దిపేట ఇంట్లో పడుకుంటేనే కంటినిండా నిద్ర పడుతుందని ఒక్క రోజు రాకున్నా ఏదో కోల్పోయినట్లుగా ఉంటుందని సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని హరీశ్‌రావు ప్రజలతో పంచుకున్నారు. సిద్దిపేట నా కుటుంబమని మీ ప్రేమ, అప్యాయతలు అనిర్వచనీయమన్నారు. ఎన్నికలొస్తే నియోజకవర్గ ప్రజలే ముందుండి నడిపించారని ఇది తన అదృష్టమన్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఎన్నికలొస్తే నాయకులు ప్రజల చుట్టూ ఓట్ల కోసం తిరుగుతారని.. కానీ సిద్దిపేటలో ప్రజలే తనకు మద్దతుగా ముందుండి ఎన్నికలు నడిపించడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. సిద్దిపేట ప్రజలు, నాయకులు, కార్యకర్తలు నా ప్రచార బాధ్యతలు వారే భుజాల మీద వేసుకుని ముందుకు సాగారన్నారు.
బాధ్యతగా ఓటెయ్యండి..
డిసెంబర్ 7న ఉదయమే ప్రతి ఓటరూ బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి కారు గుర్తుకే ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో సిద్దిపేట రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అదే విధంగా ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేట నంబర్‌వన్‌గా ఉండాలన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూంచారు.
ఈ రోడ్ షోలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఆక్తర్, కౌన్సిలర్‌లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, చిన్న, గ్యాదరి రవి, వెంకట్‌గౌడ్, చిప్పప్రభాకర్, గుడాల సంధ్యశ్రీకాంత్, దీప్తి నాగరాజు, సాకి బాల్‌లక్ష్మిఆనంద్, ప్రశాంత్, నర్సయ్య, బాసంగారివెంకట్, తాళ్లపల్లి లక్ష్మీసత్యనారాయణ, మరుపల్లి భవానిశ్రీనివాస్, మామిండ్ల ఉమాఐలయ్య, వజీర్, జావేద్, మోహిజ్, ఉమారాణి శ్రీనివాస్, బోనాల మంజుల నర్సింలు, జంగిటి కవితా కనకరాజు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment