siddipet constituency
-
మామ, అల్లుళ్ల డబుల్ ధమాకా
తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి ఊపిరి సిద్దిపేట. ఉద్యమాల పురిటి గడ్డగా, విలక్షణమైన తీర్పునకు వేదికగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. నాడు తెలంగాణ ప్రజాసమితితో తొలిదశ ఉద్యమానికి అనంతుల మదన్ మోహన్ నాయకత్వం వహించారు. నేడు మలిదశ ఉద్యమం ద్వారా స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ ఇది. మామ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని హరీశ్‌రావు ప్రస్తుతం అదే పరంపర కొనసాగిస్తున్నారు. సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం ఏర్పడి 71 ఏళ్లు అయినప్పటికీ ఐదు దశాబ్దాలుగా ముగ్గురిని మాత్రమే ప్రజలు ఆదరించి విలక్షణమైన తీర్పును ఇచ్చారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్ సాధించగా, సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీశ్‌రావు మాత్రం డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, ఒక్కొక్కసారి పీడీఎఫ్, టీపీఎస్, స్వతంత్ర అభ్యర్థులను ఆదరించారు. ప్రస్తుతం ఏడోసారి విజయం కోసం హరీశ్‌రావు బరిలో ఉన్నారు. ముగ్గురూ ముగ్గురే.. సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇరవై సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఐదుసార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. 1952లో ఎడ్ల గురవారెడ్డి(పీడీఫ్), 1957 లో రాజేశ్వర్‌రావు(కాంగ్రెస్), 1962లో సోమేశ్వర్ రావు(స్వతంత్ర), 1967లో వీబీ రాజు(కాంగ్రెస్)ను నియోజకవర్గ ప్రజలు ఒక్కోసారి ఆదరించి గెలిపించారు. తర్వాత 1970లో పోటీ చేసిన మదన్ మోహన్‌ను నాలుగు సార్లు, తర్వాత పోటీ చేసిన కేసీఆర్, హరీశ్‌రావును ఆరు సార్లు వరుసగా గెలిపించారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్, కేసీఆర్, హరీశ్‌రావు డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ఉద్యమానికి వేదిక.. సిద్దిపేట తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి వేదిక లాంటిది. 1969 తొలి విడత ఉద్యమ నేపథ్యంలో అప్పట్లో వీబీ రాజు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. 1970లో జరిగిన తొలి ఉపఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి(పీడీఎఫ్) నుంచి అనంతుల మదన్ మోహన్ పోటీచేసి విజయం సాధించారు. అక్కడి నుంచి మొదలైన మదన్ మోహన్ రాజకీయ ప్రస్థానం 1985 వరకు కొనసాగింది. కాంగ్రెస్‌లో టీపీఎస్ విలీనం కావడంతో పీవీ రాజేశ్వర్‌రావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాల్లో మదన్ మోహన్ పలుశాఖల మంత్రిగా పనిచేశారు. 1985లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మదన్ మోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగారు. అదే పంథాలో సీఎం కేసీఆర్ 2001లో మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు కేసీఆర్ ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు. 2001 నుంచి గులాబీ గుబాళింపు ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీలకు కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గం నేడు గులాబీ పార్టీకి కంచుకోట అయ్యింది. తెలంగాణ మలి విడత ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరిట గులాబీ జెండా చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు రెండు దశాబ్దాల కాలం పైగా సిద్దిపేట గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. -
అచ్చొచ్చిన చోట.. అలవోకగా.. ‘గెలుపు’
మెదక్ జిల్లాలో నాయకులకు నేటితో నరాలు తెగే ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెదక్ జిల్లా నాయకుల భవిష్యత్తును మార్చాయి. గతంలో మెదక్‌లో టీఆర్ఎస్ పది స్ధానాలను గెలుచుకుంది, కానీ ఇప్పుడు తొమ్మిది స్ధానాలకు పరిమితమైన ఓటు బ్యాంకు పెరగడంతో భారీ మెజారీటీతో మెదక్‌లో టీఆర్ఎస్ విజయం సాధించారు. ఉద్యమాల గడ్డగా పేరొందిన ‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత లక్ష మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. సాక్షి, మెదక్ : మెదక్‌లో రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటు, అడ్వకేట్ గా పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వంతో మెదక్ స్ధానాన్ని టీఆర్ఎస్ అభ్యర్ధి పద్మా దేవేందర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నపది స్ధానాల్లో ఘన విజయం సాధించింది.ఈసారి ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఒక స్థానాన్ని కొల్సోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ , హరీష్ రావులకు బలమైన కేడర్ ఉన్నా కానీ ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గంలో ప్రజల మద్దతును పొందింది. సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో గెలిచిన చింతా ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఒటమి చెందారు. ఇప్పుడు సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డి గెలుపోందారు. హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో గతంలో కన్న ఈసారి భారీ మెజారీటితో గెలిచారు. కష్టపడేతత్వమే ఈయన బలం, నిత్యం ప్రజలతో మమేకం అయ్యే హరీష్ రావుకు, సిద్దిపేటలో టీ.జే.ఎస్ అభ్యర్ధి భవాని రెడ్డి ప్రత్యర్ధిగా నిలుచున్న గట్టిపోటీ ఇవ్వలేక పొయింది. ఎందుకంటే హరీష్ రావుకు సిద్దిపేటలో ట్రబుల్ షూటర్‌కు కబలమైన కేడర్ ఉండడం వల్ల లక్ష పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సునీతారెడ్డి పైన టీఆర్ఎస్ అభ్యర్ధి చిలుముల మదన్ రెడ్డి విజయం సాధించారు. జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి కె.మాణిక్‌రావు గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్ధి గీతారెడ్డి ఒటమి పాలైనారు. పఠాన్‌చెరులో టీఆర్ఎస్ అభ్యర్ధి గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి కాటా శ్రీనివాస్ గౌడ్ పైన గెలిచారు. ఆందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ గట్టి పోటీ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్ధి చంటి క్రాంతి కిరణ్ గెలుపొందారు. నారయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సురేశ్ షెట్కార్ , టీఆర్ఎస్ అభ్యర్ధి భుపాల్‌రెడ్డి పైన చిత్తుగా ఒడిపోయారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్ధి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పైన , టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజారీటీతో విజయం సాధించారు. మాటల మాంత్రికుడు తనదైన పరిపాలనతో, ప్రత్యర్ధుల మాటలకు తన తూటలకు విసారే వాక్చాతుర్యంతో, కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి , బీజేపీ అభ్యర్ధి ఆకుల విజయ లు కేసీఆర్‌కు ఎంత పోటీ ఇచ్చిన, అభివృద్దే మంత్రంగా భావించే కేసీఆర్ గజ్వేల్ స్ధానాన్ని మరోసారి భారీ విజయంతో నిలబెట్టుకున్నారు. నియోజకవర్గం అభ్యర్ధి పార్టీ మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ నర్సాపూర్ చిలుముల మదన్ రెడ్డి టీఆర్ఎస్ జహీరాబాద్(ఎస్సీ) కె. మాణిక్ రావు టీఆర్ఎస్ సంగారెడ్డి జగ్గారెడ్డి కాంగ్రెస్ ఆందోల్ చంటి క్రాంతి కిరణ్ టీఆర్ఎస్ పఠాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ సిద్దిపేట టీ. హరీశ్ రావు టీఆర్ఎస్ గజ్వేల్ కేసీఆర్ టీఆర్ఎస్ హూస్నాబాద్ వడితెల సతీష్ కుమార్ టీఆర్ఎస్ దుబ్బాక సోలిపేట రామలింగా రెడ్డి టీఆర్ఎస్ నారాయణఖేడ్ ఎమ్. భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ -
సిద్దిపేట: ఆమే శక్తి
శాసనసభ ఎన్నికల్లో గెలుపోటములను మహిళలు ప్రభావితం చేయబోతున్నారా..? రాజకీయ నేతల భవితవ్యంపై తీర్పునివ్వబోతున్నారా..? మహిళ నిర్ణయమే శిరోధ్యారమవుతుందా.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. జిల్లాలో మహిళల నిర్ణయమే రాజకీయ పార్టీల భవిష్యత్తును శాసించబోతోంది. మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొనడం అభ్యర్థుల తల రాతలను మార్చబోతోంది. జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో గజ్వేల్ మినహా మిగతా చోట్ల మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోలింగ్ జరిగిన తీరు పరిశీలిస్తే మహిళలదే పైచేయిగా ఉంది. గజ్వేల్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 222436 ఓటర్లు ఉండగా... ఇందులో మహిళలు 111692, పురుషులు 110737 మంది ఉన్నారు. ఎన్నికల్లో 185976 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 93587 మంది ఓటు హక్కును వినియోగించుకోగా పురుషులు 92100 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ లెక్కన 1487 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లు వేశారు. నియోజకవర్గంలో స్థానిక అంశాలు ఓటింగ్‌ను ప్రభావితం చేశాయని తెలుస్తోంది. నియోజకవర్గంలోని మిషన్ భగీరథ పథకం పనులు కొన్ని గ్రామాల్లో పూర్తయి, మరికొన్ని గ్రామాల్లో ప్రగతిపథంలో ఉండడం, హుస్నాబాద్ పట్టణంలో 560 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం సాగుతుండడం తమకు అనుకూలంగా ఉంటుం దని... ఈ అంశాన్ని మహిళలు సానుకూలంగా తీసుకొని తమ వైపే మొగ్గు చూపారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫ ల్యాలు, అసంపూర్తి పనులు మహిళలను తమ వైపు మళ్లించాయని ప్రజాకూటమి అంచనా వే స్తోంది. దుబ్బాక నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ మొత్తంగా 190483 ఓట్లు ఉండగా... ఇందులో మహిళలు 96780, పురుషులు 93703 మంది ఉన్నారు. ఎన్నికల్లో మొత్తంగా 163798 ఓట్లు పోలవగా... ఇందులో మహిళలు 83176, పురుషులు 80482 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో 26 94మంది మహిళలు పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ అంశం తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. నియోజకవర్గంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఆసరా పింఛన్‌దారులు తమ వైపే మొగ్గు చూపారని అంచనా వేస్తోంది. మరోవైపు మిషన్ భగీరథ పథకం కూడా తమకు కలిసివచ్చిందనే ఆశలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నియోజకవర్గంలో స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందనే ఆశలో ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితి మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇక్కడ మహిళలు ఏకపక్షంగా తీర్పునిస్తారనే అంచనాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 209339 ఓట్లలో మహిళలు 105279 మంది ఉన్నారు. ఎన్నికల్లో 165368 ఓట్లు పోలవగా... ఇందులో మహిళలు 83575 మంది ఉన్నారు. వీరిలో 95శాతానికి పైగా తమవైపే మొగ్గు చూపారని టీఆర్ఎస్ భావిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, మర్కూక్, మనో హరాబాద్, తూప్రాన్ మండలాల్లో మొత్తంగా 233207 ఓట్లు ఉండగా... మహిళలు 116202, పురుషులు 116982, ఇతరులు 23మంది ఉన్నా రు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన గా... ఈ రెండు పార్టీలు కూడా తమ మేనిఫెస్టోతో మహిళల ముందుకు వెళ్లాయి. టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. నియోజకవర్గంలో రూ. 450కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని చే పట్టి 248 ఆవాసాలకు స్వచ్ఛమైన నల్లా నీటిని అందించామని పార్టీ శ్రేణులు ప్రచారంలో వివరించే ప్రయత్నం చేశాయి. గతంలో ఇక్కడ మం చినీళ్లు దొరకక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న కష్టాలను గుర్తు చేస్తూ కేసీఆర్‌కు ఓటు వేయాలని అభ్యర్థించాయి. అంతేగాకుండా మహిళా సంఘాలకు రుణాలు, ఇతర పథకాలను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ సైతం మేనిఫెస్టోలో పొందు పర్చిన ఓ కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచి తంగా పంపిణీ చేస్తామనే అంశాన్ని బలంగా మహిళల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. ఏటా 6 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తే మహిళల కష్టాలు తీరుతాయని వివరించాయి. అదే విధంగా మహిళా సంఘాలకు రుణాల పెంపు అంశాన్ని ప్రచారం చేశాయి. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు, సభలకు మహిళలను పెద్ద ఎత్తు న తరలించడంపైనే పార్టీలు దృష్టి పెట్టాయి. రెండు పార్టీలు మహిళలు తమవైపే ఉంటారని వి శ్లేషిస్తున్నాయి. ఎన్నికల్లో మొత్తంగా 206699 ఓటర్లు పాల్గొనగా... అందులో మహిళలు 1022309 మంది, పురుషులు 104457 మంది, ఇతరులు ముగ్గురున్నారు. రెండు పార్టీలు మహిళలు తమ వైపే మొగ్గు చూపారనే అంచనాల్లో నిమగ్నమయ్యాయి. మొత్తానికి సిద్దిపేట ఎన్నికల చిత్రం మహిళల పాత్రపైనే ఆధారపడి ఉండటం విశేషం. -
బెట్టింగ్..రంగా
ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై జిల్లావ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం గెలుపు ఎవరిదనే మాటే అందరి నోటా వినిపిస్తోంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల కోసం మరో 24గంటలు ఎదురు చూడాల్సిందే. జిల్లాలో మాత్రం ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఎవరికి వారు గెలుపోటములపై తమ తమ అంచనాలతో జోరుగా విశ్లేషిస్తున్నారు. ఫలితాలపై జోరుగా పందెం కొనసాగుతోంది. సిద్దిపేటజోన్ : ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? ఏ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరస్పరం బెట్టింగ్ కాస్తున్నారు. రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు తమ స్థాయికి తగ్గట్టుగా బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. మరి కొందరు విహార యాత్రలు, విందులు, వినోదాలు ఇచ్చేలా పందెం కాస్తున్నారు. తాము పెట్టిన సొమ్ముకు రెట్టింపుగా రాబట్టుకునేందుకు పందెంరాయుళ్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. జిల్లాలో కీలకమైన స్థానాలు ప్రధానంగా జిల్లాలో కీలకమైన స్థానాలు ఉండడం, అధికారంలో, పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్న వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కావడంతో బెట్టింగ్ రాయుళ్లు పందెం కాసేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదెవరు అనే అంశం మొదలుకొని నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే అంశంపై బెట్టింగులు కాస్తున్నారు. వివిధ రకాల ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు, సోషల్ మీడియా పోస్టింగులను బేస్ చేసుకొని బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. జాతీయ చానళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేకు భిన్నంగా లగడపాటి రాజగోపాలు సర్వే వివరాలు పేర్కొనడంపై యువతలో ఆసక్తి నెలకొంది. ఫలానా పార్టీ , ఫలానా అభ్యర్థి విజయం సాధిస్తారని, ఫలానా పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, నియోజకవర్గాల వారిగా ఫలానా అభ్యర్థికి వచ్చే మెజార్టీపై ఎవరికి వారు తమ అంచనాలకు అనుగుణంగా పందెంలో డబ్బులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గజ్వేల్‌లో గెలుపుపై భారీగా.. జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బరిలో ఉండడం, ఆయనకు పోటీగా కూటమి అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి నిలిచిన క్రమంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉందన్న సోషల్ మీడియా ప్రచారాన్ని చూసి యువత పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. రూ. 10 వేల నుంచి రూ. 5లక్షల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో బెట్టింగ్‌కు దిగడం విశేషం. దుబ్బాక నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై, మెజార్టీపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పొరుగునే ఉన్న జనగామ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలు చేర్యాల, కొమురవెల్లిలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. అక్కడ బరిలో ఉన్న వారిలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మరొకరు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు కావడం విశేషం. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు గెలుపోటములు, ప్రధానంగా మెజార్టీ పైనే బెట్టింగ్ జరుగుతుండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా జరిగే బెట్టింగ్ ప్రక్రియ సహజంగా పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా పాకుతోంది. ఆయా మండలాల్లోని కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు బెట్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట స్పెషల్.. లక్ష మెజార్టీపైనే పందెం ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట ప్రస్తుతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. గతంలోనే సిద్దిపేట అభ్యర్థి హరీశ్‌రావు రికార్డు స్థాయిలో రెండు సార్లు భారీ మెజార్టీని సాధించి రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించారు. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలు రావడం, షెడ్యూల్ విడుదల నుంచి లక్ష మెజార్టీ లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రచారాన్ని నిర్వహించాయి. పోలింగ్ ప్రక్రియ ముగియడం, అందరి అంచనాలకు అనుగుణంగానే పోలింగ్ శాతం పెరగడంతో ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో మెజార్టీపై చర్చ జోరుగా సాగుతోంది. ఓట్లేసి 72 గంటలు దాటినా ఇప్పటికీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. అది లక్ష మెజార్టీ పైనే. ప్రధానంగా హరీ«శ్ గెలుపు అంశాన్ని పక్కన బెట్టి స్వంత పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా యువతలో మెజార్టీ ప్రధాన అంశంగా జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. -
ఎవరి ధీమా వారిది
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 8,55,465 మంది ఓటర్లు ఉండగా ఇందులో 84.14శాతం అంటే 7,20,780 మంది ఓటర్ల తమ ఓటు వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 4శాతం ఓట్లు అధికంగా పోలయ్యాయి. రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో 14శాతం ఎక్కువ ఓట్లు వేసి మరోసారి సిద్దిపేట జిల్లా చైతన్యాన్ని చాటారు. అయితే ఈ పోలింగ్‌శాతాన్ని చూసి అభ్యర్థుల్లో ఎవరికివారు దీమాను వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీపై అంచనాలు జిల్లాలో పలుచోట్ల గెలుపు ఓటములపై, మరికొన్ని చోట్ల అభ్యర్థులకు వచ్చే మెజార్టీలపై రాజకీయ పక్షాలు, అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గంలో గతం కన్నా ç4.5శాతం ఓట్లు అధికంగా పోల్ కావడంతో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్య ర్థిగా పోటీలో ఉన్న తన్నీరు హరీశ్‌రావు మాత్రం తనకు లక్షకు పైగా మెజార్టీ వస్తుందనే ధీమాతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,09,339 ఓటర్లు ఉండగా 1,65,368 మంది ఓట్లు వేశారు. ఇందులో ప్రత్యర్థి బీజేపీకి 20వేల మేరకు ఓట్లు పడే అవకాశం ఉందని, మిగిలిన కూటమి అభ్యర్థి భవానీరెడ్డి, ఇతర అభ్యర్థులకు కలిపి మొత్తం మరో 15వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. మిగిలిన లక్షా ముప్పైవేల ఓట్లు హరీశ్‌రావుకు వస్తాయని, సులభంగా లక్ష మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ, కూటమి అభ్యర్థులు కూడా తమకేమీ తక్కువ ఓట్లు రావని, గెలుపు ఓటమిలు అటుంచినా.. గౌరవ ప్రదమైన ఓట్లు వస్తాయని చెప్పడం గమనార్హం. అదేవిధంగా దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గంల్లో తమ నాయకులకు కూడా 60వేల మెజార్టీ వస్తుందని ఆయా నియోకవర్గాల టీఆర్ఎస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గజ్వేల్‌లో కూడా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయబావుటా ఎగుర వేయడం ఖాయమని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. బీజేపీ, విపక్షాల్లో ధీమా జిల్లాలోని నాలుగు స్థానాలకు నాలుగు మేమే గెలుస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే తామేమీ తక్కువ కాదని, 11వ తేదీన విడుదల కానున్న ఫలితాలే రుజువు చేస్తాయని విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు దీమాతో ఉండటం గమనార్హం. గజ్వేల్‌లో మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పడం విశేషం. అదేవిధంగా దుబ్బాకలో తమకు కూడా ఓట్లు బాగానే వస్తాయని, విజయం మావైపే ఉందని బీజేపీ, కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారు. హుస్నాబాద్‌లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత మాకు అనుకూలించిందని, కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా పనిచేశారని విజయం ఖాయమని సీపీఐ నాయకులు అంటున్నారు. ఇంతకాలం ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ గెలుపుపై చర్చలు పెడుతున్నారు. వీరితోపాటు తటస్థులు కూడా నలుగురు కూడిన చోట గెలుపోటముల ముచ్చటే కొనసాగతోంది. అయితే మరో రెండు రోజుల్లో ఈనెల 11న ఫలితాలు వెళ్లడి కానున్నందున అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
భారీగా ‘ఓట్ల’ గల్లంతు
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుండారం, కల్లెపెల్లి గ్రామాల్లో సుమారు 350 మంది ఓట్లు గల్లంతయ్యాయి. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు తమ ఓటు లేదని తెలియడంతో ఆవేదనకు గురయ్యారు. తాము పలు ఎన్నికల్లో ఓటు వేయగా ఇప్పుడు ఎలా గల్లంతవుతాయని అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. వికలాంగ వృద్ధుద్దురాలు జత్నం రత్తవ్వ గుండారంలో ఓటు వేసేందుకు రాగా అక్కడ అధికారులు ఇచ్చిన ఓటరు స్లిప్‌లో పేరు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రంలో లేకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగింది. గుండారం, దాని శివారులోని కొత్తగా ఏర్పడ్డ పెరుకబండలోనే సుమారు 250 వరకు ఓట్లు గల్లంతు కాగా.. మరణించిన పలువురి ఓట్లు కొత్త జాబితాలో ఉండటంతో ప్రజలు మండిపడుతున్నారు. కల్లెపెల్లిలో సుమారు 70 ఓట్లు గల్లంతయిన ట్లు తెలిపారు. ఖాజీపూర్‌లో 40 ఓట్లు గల్లంతు మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని ఖాజీపూర్‌లో సుమారు 40 మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఓటర్ల పేర్లు రికార్డుల్లో లేకపోవడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి బంధువులు అంగన్వాడీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అంగన్వాడీ కార్యకర్తల నిర్లక్ష్యం కారణంగానే పేర్లు గల్లంతైనట్లు ఆరోపించారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటిక్యాలలో 200 ఓట్లు..జగదేవ్‌పూర్(గజ్వేల్): గ్రామంలో 1709 ఓట్లు ఉండగా.. అందులో సుమారు 200 ఓట్లు గల్లంతయినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది తమ ఆధార్ కార్డులను, ఎన్నికల గుర్తింపు కార్డులను తీసుకెళ్లినా ఓటర్ లిస్టులో పేరు లేదనే కారణంతో ఓటు వేసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు ఎన్నికల కేంద్రం నుంచి ఇంటికి వెనుదిరిగారు. పీర్లపల్లిలో ఎంపీపీ రేణుక ఓటు హక్కును, నర్సన్నపేటలో జెడ్పీటీసీ రాంచం ద్రం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాకలో...దుబ్బాకటౌన్: దుబ్బాక నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా చాలామంది ప్రజల ఓట్లు గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డులున్నా చాలామంది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో పరేషాన్ అయ్యారు. దుబ్బాక పట్టణంలోనే సుమారుగా నాలుగైదు వందల మందికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. దుబ్బాక పట్టణంలోని 38వ పోలింగ్ కేంద్రం వద్ద పట్టణంకు చెందిన అంకం రాజేశ్వర్, అంకం సత్తవ్వ, రేపాక సువర్ణ, రమ్యలకు చెందిన ఓట్లు గల్లంతు కావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. -
మందకొడిగా మొదలై..
సాక్షి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ కీలమైనది. నాయకుడిని ఎన్నుకునేందుకు అత్యధిక సంఖ్యలో ఓటర్ల భాగస్వామ్యం ఉండాలని భావించిన జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఓటింగ్ శాతం పెంచేందుకు పడిన కష్టానికి ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో వృద్ధులు, మహిళలకు అత్యధిక సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో గతం కన్నా ఈసారి జిల్లాలో పోలింగ్‌శాతం పెరిగింది. ఉదయం నుంచే బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లాలోని ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుదీరారు. ఉదయం అయితే ఎవరూ ఉండరనే ఆలోచనతో కొందరు.., ఓటు వేసి తమ పనులకు వెళ్లేందుకు కొందరు పోలింగ్ స్టేషన్ల బాటపట్టారు. దీంతో దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఉదయం 9గంటల వరకే వేగంగా పోలింగ్ నమోదైంది. అయితే హుస్నాబాద్‌లో మాత్రం మందకొడిగా మొదలైంది. అదేవిధంగా ఉదయం 11గంటలకు మూడు నియోకవర్గాల్లో అదేవేగంతో పోలింగ్ సరళి నడవగా.. హుస్నాబాద్‌లో మాత్రం అంతంత మాత్రంగానే సాగింది. అయితే మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ చివరికి 81 శాతం నమోదైంది. పోలింగ్ సరళి ఇలా.. (శాతంలో..) నియోజకవర్గం 9 గంటలకు 11గంటలకు 1గంటలకు 3 గంటలకు 5గంటలకు సిద్దిపేట 12 31 50 67.5 78.86 హుస్నాబాద్ 06 24 41 61 83.17 దుబ్బాక 11 30 49 65.85 85.92 గజ్వేల్ 14 26 42 61 88 సగటు 11 28 46 64 83.98 -
పోలింగ్ ప్రశాంతం
సాక్షి, సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారంజిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యధర్శి చాడ వెంకట్‌రెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డిలు పోటీ చేసే నియోజకవర్గాలు జిల్లాలోనే ఉండటంతో రాష్ట్రం చూపంతా జిల్లాపైనే పడింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రారంభంలో మొరాయించడంతో పలు ప్రాంతాల్లో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. అదేవిధంగా చీకటి గదుల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో కేసీఆర్, హరీశ్‌రావు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైనవి శాతం సిద్దిపేట 2,09,345 1,65,075 78.86 హుస్నాబాద్ 2,22,431 1,85,003 83.17 దుబ్బాక 1,90,482 1,63,658 85.92 గజ్వేల్ 2,33,205 2,05,222 88 మొత్తం 8,55,453 7,18,958 83.98 జిల్లా వ్యాప్తంగా 84శాతం పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 84 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 8,55,453 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1102 పోలింగ్ కేంద్రాల ద్వారా 7,18,958 మంది ఓటర్లు (83.98 శాతం)తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా గజ్వేల్ నియోకవర్గంలో మొత్తం 2,33,205 మంది ఓటర్లకు గాను 2.05,222 మంది (88 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 2,09,345 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,65,075 మంది (78.86శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో 1,90,482 మంది ఓటర్లకు గాను 1,63,658 మంది(85.92 శాతం) ఓటు వేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,22,431 మంది ఓటర్లకు గాను 1,85,003మంది(83.17శాతం) ఓట్లు వేశారు. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్.. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ప్రారంభమైంది. మాక్ పోలింగ్ సమయంలోనే ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడంలో అప్పటికప్పుడు అధికారులు పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మార్పులు చేశారు. కొన్నింటిని సరిచేసి నడిపించారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, బెజ్జంకి మండలం రేగులపల్లె, జగదేవ్‌పూర్, వర్గల్ మండలంలోని మీనాజీపేటలో ఈవీఎంలు మొరాయించాయి. అదేవిధంగా తొగుట మండలం కేంద్రంలోని 134, లింగారెడ్డిపల్లి 115 పోలింగ్ బూత్‌ల్లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. అదేవిధంగా దుబ్బాక మండలం నిజాంపేటలో ఈవీఎం మొరాయించడంతో కొంతసేపు పోలింగ్‌ను నిలిపి వేశారు. అదేవిధంగా చేర్యాల మండలంలోని చుంచన కోటలో ఈవీఎంలు మొరాయించడం, సక్రమంగా ఓటు పడకపోవడంతో రాత్రి 8గంటల వరకు, తొగుట మండలం లింగారెడ్డి పల్లి, గజ్వేల్ నియోజకవర్గంలోపలు పోలింగ్ స్టేషన్లలో రాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. ఓటర్లు రాత్రి వరకు అక్కడే ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా లైట్లు ఉంటే వీవీ ప్యాట్లు పనిచేయవనే కారణంతో ఈవీఎంలను చీకటిలో ఉంచారు. అయితే ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు చీకటిలో గుర్తులు కనింపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చేసేదిలేక ఏదో ఒక గుర్తుకు ఓటేశామని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు మండలంలో లాఠీచార్జీ ఎన్నికల్లో భాగంగా జరిగిన పలు సంఘటనలతో జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ములుగు మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ములుగు మండలంలోని బండ్ల మైలారంలో కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు రాగానే అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా మరోవైపు నుంచి కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ములుగు మండలంలోని సింగన్నగూడ, కొక్కండ గ్రామాల్లో కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యంతో సద్దుమణిగింది. రిమ్మనగూడెం గ్రామంలో కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ పడ్డారు. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలోని చెంచాన్పల్లిలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చిన అధికారులు స్థానిక టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో బస చేశారని కూటమికి చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారి ఆ ఇద్దరిని ఎన్నికల విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. -
‘మందు’ బంద్‌కు వేళాయె!
కోహెడ(హుస్నాబాద్): కోహెడలో ఉన్న వైన్స్‌షాపుల ఎదుట బుధవారం వినియోగదారులు మద్యం కోసం భారీగా క్యూ కట్టారు. అసెంబ్లీ ఎన్నికల నింబంధనల ప్రకారం బుధవారం సాయంత్రంతో రెండు రోజులు వైన్స్‌లో మద్యం విక్రయాలు బంద్ కావటంతో వినియోగదారులు మద్యం కోనుగోలుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. -
నిద్రలో కూడా ‘సిద్దిపేట’ గురించే ఆలోచన
నంగునూరు(సిద్దిపేట): నిద్రలో కూడా సిద్దిపేట గురించే ఆలోచించే మీ హరీశ్‌రావును రికార్డు మెజార్టీతో గెలిపించాలని హరీశ్‌రావు అన్నారు. బుధవారం నంగునూరు మండలంలోని గట్లమల్యాల, అక్కేనపల్లి, నంగునూరు, నర్మేట, కోనాయిపల్లి, వెంకటాపూర్, ముండ్రాయి గ్రామాల్లో హరీశ్‌వుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నంగునూరులో ప్రజలను ఉద్ధేశించి శ్రీనిత మాట్లాడుతూ తెలంగాణలో సిద్దిపేటకు మంచి గుర్తింపు ఉందని మీ తీర్పుతో హరీశ్‌రావును ప్రపంచం గుర్తించాలన్నారు. 18 గంటల పాటు పని చేసే మీ నాయకున్ని లక్షకుపైగా మెజార్టీతో గెలిపించాలన్నారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి చేస్తే ఆశ్చర్యం వేస్తోందని, కోమటి చెరువుపై ఉంటే ట్యాంక్‌బండ్ మీద ఉన్న అనుభూతి కలుగుతోందన్నారు. ప్రచారంలో అలసిపోయిన శ్రీనితకు నర్మేటలోని శ్రీ రామశర్మ తన ఇంట్లోకి ఆహ్వానించి మంచి నీళ్లు అందిచారు. ముండ్రాయిలోని ఓహోటల్లో చాయ్ తాగి కారు గుర్తును ఓటేయాలని కోరారు. కోనాయిపల్లిలో ప్రత్యేక పూజలు హరీశ్‌రావు సెంటిమెంట్ ఆలయం కోనాయిపల్లిలోని వేంకటేశ్వరాలయంలో శ్రీనిత పూజలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, హరీష్‌రావు రికార్డు మెజార్టీ సాదించాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, బూర విజయ, తడిసిన ఉమా, నందాదేవి, విజిత, కవిత, మంజూల, గీత, వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి, మల్లయ్య, రమేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, బౠస్కర్‌రెడ్డి, కోటిరెడ్డి, సంతోష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రచారి పాల్గొన్నారు -
దుబ్బాకలో రసవత్తర ‘పోరు’
దుబ్బాకటౌన్: దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రచార పర్వం ముగియడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటివరకు పోటాపోటీగా ప్రచారం చేపట్టిన పార్టీలు ప్రచార గడువు ముగియడంతో తెరవెనుక రాజకీయాలు నడిపిస్తున్నారు. పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు మాత్రమే వ్యవధి ఉండటంతో ప్రధాన పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మరింత జోరుగా చొచ్చుకుని వెళ్తున్నారు. గ్రామాల్లో ఏమాత్రం సమయాన్ని వృథా చేయకుండా ప్రధాన పార్టీల నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమకే ఓట్లు పడేలా విశ్వప్రయత్నాలు చేయడంలో తలమునకలయ్యారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే జోరుగా చర్చలు సాగుతున్నాయి. గ్రామాల్లో నలుగురు కలిసిన చోట.. ప్రధాన కూడళ్లు.. హోటళ్లు.. పొలం పనుల దగ్గర ఇలా ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ. ఎవరు గెలుస్తారు.. మీ ఊర్లో ఎట్లుంది.. ఏ పార్టీకి ఓట్లు వేస్తారన్న చర్చలే నడుస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి మొదటి విడతలోనే టికెట్ కేటాయించడంతో ఇప్పటికే గ్రామాలన్నీ చుట్టివచ్చారు. అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావుకు సైతం బీజేపీ అధిష్టానం మొదటి విడతలోనే టికెట్ కేటాయించడంతో ఆయన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేపట్టారు. మహాకూటమి పొత్తులో భాగంగా దుబ్బాకను టీజేఎస్‌కు కేటాయించడంతో ఆ పార్టీ తరఫున చిందం రాజ్‌కుమార్ బరిలో ఉండటం.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం చివరిరోజున కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి టికెట్ తెచ్చుకుని ప్రచారం చేపట్టడం జరిగిపోయింది. అభివృద్ధితో దూసుకుపోయిన సోలిపేట దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ప్రచారంలో దూసుకపోయారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం ద్వారా రూ. 500 కోట్లతో ఇంటింటికీ స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించడం, రూ.8 వేల కోట్లతో మల్లన్నసాగర్ రిజర్వాయర్, పంటకాలువల నిర్మాణం, మల్లన్నసాగర్‌తో నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు, రూ.160 కోట్లతో 160 చెరువల అభివృద్ధి, రాష్ట్రంలోనే 4 వేల డబుల్ బెడ్రూంల నిర్మాణాలతో అగ్రస్థానంలో ఉండటం, ఇప్పటికే 2 వేల ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని, దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి, రూ. 10 కోట్లతో సీఎం కేసీఆర్ చదువుకున్న బడి నిర్మాణం, రూ.17 కోట్లతో సమీకృత భవన సముదాయం, 7 కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు, నార్సింగ్, రాయపోల్ కొత్త మండలాలు, 21 కొత్త గ్రామపంచాయతీలతో పాటు రెండువేలకు పైగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ప్రజలకు వివరిస్తూ చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రామలింగారెడ్డి ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలోనే పింఛన్లు వస్తుండటంతో రామలింగారెడ్డి భారీ మోజార్టీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రతిపక్షాల్లో ఆశలు నాలుగేళ్ల అభివృద్ధిపై సోలిపేట రామలింగారెడ్డి ప్రచారం చేస్తుండగా.. ప్రతిపక్ష బీజేపీ, కూటమి అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లారు. అభివృద్ధి, సంక్షేమం ఆయుధాలుగా బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ప్రచారం చేశారు. ఆయన తరఫున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దాంతోపాటు రాష్ట్ర నాయకుడు కిషన్‌రెడ్డి కూడా రఘునందన్‌రావు తరఫున దుబ్బాకలో పర్యటించారు. ఆయన్ను గెలిపిస్తే మంచి నాయకుడు అవుతాడని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా మహాకూటమి మాత్రం టీఆర్ఎస్ కుటుంబ పాలనపై గురి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టింది. కాగా ఈ సీటును పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయించినా కాంగ్రెస్ తరఫున మద్దుల నాగేశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండటంతో కూటమి పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థంకాక కొందరు ఇంటికే పరిమితం అవుతుండటం కూడా కూటమికి పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. ఏదేమైనా విజయం ఎవరిని వరిస్తుందో.. ఏ పార్టీల ప్రభావం ఎంత ఉందో తెలియాలంటే ఈనెల 11వ తేదీ వరకు ఆగాల్సిందే. -
సిద్దిపేట ‘తీర్పు’ ఢిల్లీకి వినపడాలి
సిద్దిపేటజోన్: ‘ఇప్పటికి రెండుసార్లు లక్షలోపు మెజార్టీ ఇచ్చి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈసారి చరిత్రను తిరగరాసే తీర్పు ఇచ్చే అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ తీర్పు ఢిల్లీకి వినబడాలి’ అంటూ లక్ష మెజార్టీ లక్ష్యంపై సిద్దిపేట ఓటర్లను టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బుధవారం పట్టణ పురవీధుల గుండా హరీశ్‌రావు భారీ రోడ్ షోను నిర్వహించారు. స్థానిక నర్సాపూర్ చౌరస్తా నుంచి మొదలైన ర్యాలీ పట్టణంలో సుమారు 5గంటల పాటు కొనసాగింది. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ షోకు హాజరైన ప్రజలనుద్దేశించి హరీశ్‌రావు మాట్లాడారు. సిద్దిపేట ప్రజల ఆదరాభిమానాలు, స్వాగతం చూస్తుంటే తనకు మాటలు రావడం లేదన్నారు. మీ ప్రేమ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని జీవితంలో ఇంతకంటే పెద్ద అదృష్టం ఏముంటుందన్నారు. తనకు గెలుపోటముల గురించి ఆలోచన లేదని.. డిసెంబర్ 11న చరిత్రను తిరగరాసే విధంగా సిద్దిపేట ఓటర్లు తీర్పు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎన్ని జిల్లాలు తిరిగినా సిద్దిపేటకు రావాల్సిందే ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలోనే జిల్లాల్లో పర్యటించే తనను.. శాసనసభలో సహచర ఎమ్మెల్యేలు పక్షిలాగా తిరుగుతున్నావని హాస్యోక్తులు చేసేవారన్నారు. ఔను నిజంగా తాను పక్షినేనని, పక్షి రోజంతా తిరిగి రాత్రికి తన పిల్లల గూడుకు చేరుకున్నట్లే తాను ఎన్ని జిల్లాలు తిరిగినా మళ్లీ సిద్దిపేటకు చేరుకుంటానన్నారు. సిద్దిపేట ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకుంటేనే తన మనస్సు కుదుటపడుతుందన్నారు. సిద్దిపేట ప్రజల కష్టాలు తెలుసుకుని సేవ చేస్తేనే తన కడుపు నిండినట్లుగా, సిద్దిపేట ఇంట్లో పడుకుంటేనే కంటినిండా నిద్ర పడుతుందని ఒక్క రోజు రాకున్నా ఏదో కోల్పోయినట్లుగా ఉంటుందని సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని హరీశ్‌రావు ప్రజలతో పంచుకున్నారు. సిద్దిపేట నా కుటుంబమని మీ ప్రేమ, అప్యాయతలు అనిర్వచనీయమన్నారు. ఎన్నికలొస్తే నియోజకవర్గ ప్రజలే ముందుండి నడిపించారని ఇది తన అదృష్టమన్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఎన్నికలొస్తే నాయకులు ప్రజల చుట్టూ ఓట్ల కోసం తిరుగుతారని.. కానీ సిద్దిపేటలో ప్రజలే తనకు మద్దతుగా ముందుండి ఎన్నికలు నడిపించడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. సిద్దిపేట ప్రజలు, నాయకులు, కార్యకర్తలు నా ప్రచార బాధ్యతలు వారే భుజాల మీద వేసుకుని ముందుకు సాగారన్నారు. బాధ్యతగా ఓటెయ్యండి.. డిసెంబర్ 7న ఉదయమే ప్రతి ఓటరూ బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి కారు గుర్తుకే ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో సిద్దిపేట రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అదే విధంగా ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేట నంబర్‌వన్‌గా ఉండాలన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూంచారు. ఈ రోడ్ షోలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఆక్తర్, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, చిన్న, గ్యాదరి రవి, వెంకట్‌గౌడ్, చిప్పప్రభాకర్, గుడాల సంధ్యశ్రీకాంత్, దీప్తి నాగరాజు, సాకి బాల్‌లక్ష్మిఆనంద్, ప్రశాంత్, నర్సయ్య, బాసంగారివెంకట్, తాళ్లపల్లి లక్ష్మీసత్యనారాయణ, మరుపల్లి భవానిశ్రీనివాస్, మామిండ్ల ఉమాఐలయ్య, వజీర్, జావేద్, మోహిజ్, ఉమారాణి శ్రీనివాస్, బోనాల మంజుల నర్సింలు, జంగిటి కవితా కనకరాజు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
విజిలేస్తే వంద నిమిషాలు
సిద్దిపేటజోన్: అసెంబ్లీ ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. అందుకు అనుగుణంగానే వినూత్నంగా ప్రత్యేక యాప్‌లను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే సీ విజిల్ యాప్ జిల్లాలో పటిష్టంగా అమలవుతుంది. యాప్ వినియోగంతో అధికారులు ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వంద నిముషాల్లోనే సమస్యను పరిష్కరించే దిశగా ప్రణాళికలు సిద్దం చేసిన అధికారులు ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు. అధికారుల రికార్డుల ప్రకారం నవంబర్ 30 నాటికి సిద్దిపేట జిల్లాలో 20 ఫిర్యాదులు రాగా.. ఆయా నియోజకవర్గాల్లో సీ విజిల్ యాప్ ద్వారా 54 ఫిర్యాదులు అందాయి. మొత్తంగా చూస్తే యాప్ ద్వారా 74 ఫిర్యాదులు రావడం విశేషం. వాటిని సత్వరం పరిశీలించి సమస్యను నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయడం పట్ల ఎన్నికల కమిషన్ ప్రయోగానికి జిల్లాలో సత్ఫలితాలు వచ్చినట్లుగానే చెప్పవచ్చు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యం సిద్దిపేట జిల్లాలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సీ విజిల్ యాప్‌ను మొదటిసారిగా తెరమీదకు తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సీ విజిల్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని ఎన్నికలకు సంబంధించి డబ్బు, మద్యంతో పాటు ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించే ప్రక్రియలపై నేరుగా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత ఫోటోలను అప్లోడ్ చేస్తూ సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేసిన వంద నిముషాల్లోపే అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు ఫిర్యాదు చేసిన వారికి కూడా సమాచారం అందించాల్సిన బాధ్యతను ఎన్నికల కమిషన్ తీసుకుంది. వీటికి సంబంధించిన పర్యవేక్షణ కోసం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో డీసీసీ పేరిట కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. డీసీసీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి సమాచారం అందించి వాటిపై చర్యలకు ఆదేశాలను సైతం డీసీసీ పర్యవేక్షిస్తుంది. జిల్లాలో 74 ఫిర్యాదులు.. సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో యాప్ ద్వారా 74 రకాల ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు వచ్చాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్లోని డిస్ట్రిక్ కంట్రోల్ సెంటర్‌కు (డీసీసీ) 20 ఫిర్యాదులు గడిచిన నెలలో రావడం విశేషం. వాటిని జిల్లా ఎన్నిల అధికారి పర్యవేక్షణలో పరిశీలన చేశారు. అదే విధంగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో నాలుగు ఫిర్యాదులు రాగా వాటిలో ప్రధానంగా ప్రభుత్వ స్థలాల్లో, ఆస్తుల్లో పార్టీ జెండాలు కట్టడం, బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు, నిబంధనలకు విరుద్దంగా ప్రచారం గుర్తులు ఏర్పాటు వంటివి ఉన్నాయి. వాటిని యాప్ ద్వారా స్వీకరించిన అధికారులు వంద నిముషాల్లోనే పరిష్కరించడం విశేషం. మరోవైపు హుస్నాబాద్‌లో 8 ఫిర్యాదులు, గజ్వేల్‌లో అత్యధికంగా 27 ఫిర్యాదులు, సిద్దిపేటలో 15 ఫిర్యాదులు నమోదయ్యాయి. పార్టీ జెండాల ఏర్పాటు, పోస్టర్ల ఏర్పాటు, నిబంధనలకు విరుద్దంగా దేవాలయాల వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు, వాహనాలపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఎన్నికల అధికారులు నియమనిబంధనల మేరకు పరిశీలన చేసి పరిష్కారం చేశారు. జిల్లాలో సీ విజిల్ యాప్‌కు వచ్చిన స్పందన పట్ల అటు అధికారుల్లో, ఇటు ఫిర్యాదుదారులు సంతృప్తిగా ఉన్నారు. దీంతోపాటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుక యాప్ దోహద పడుతుందని విద్యావంతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు, రేపే.. ప్రచార వేగం
చూస్తూ చూస్తూనే ఎన్నికల ప్రచార ఘట్టానికి మరో రెండు రోజుల్లో తెరపడబోతోంది. ఈనెల 5వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఓటర్లను ఎంత అభ్యర్థించినా ఈ రెండు రోజుల్లోనే చేయాలి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. క్షణం కూడా వృథా చేయకుండా సుడి గాలి పర్యటనలు చేస్తున్నా రు. ఇప్పటికే ఒకసారి ప్రచారం పూర్తి చేసిన నాయకులు మరోసారి తిరిగిన ఇల్లు, తిరగని ఇల్లు అని లేకుండా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. షెడ్యూల్లో వెనుకబడిన కూటమి అభ్యర్థులు, ఇతర పార్టీలకు చెంది న వారితోపాటు ఇండిపెండెట్లు ఓటర్లను ఆకట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: ప్రచార కార్యక్రమం ముగింపునకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు వేగం పెంచారు. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలతోపాటు, జనగామ నియోజకవర్గంలో అంతర్భాగమైన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, మానకొండూరు నియోజకవర్గంలో భాగమైన బెజ్జంకి మండలాల్లో అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎన్నికలకు ముందు నుండే ప్రజాఆశీర్వాద సభల పేరిట నియోజకర్గంలోని అన్ని గ్రామాలను చుట్టివచ్చారు. అదేవిధంగా కుల సంఘాలు, వృత్తి సంఘాలు ఇతర అన్ని వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి తాను చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించమని ఓటర్లను కోరారు. అయితే హరీశ్‌రావుకు తన నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు ఉండటంతో.. ఆయన అనుచరులు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతోపాటు, అన్ని వార్డు కౌన్సిలర్లు, ఇతర ముఖ్య కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈసారి హరీశ్‌రావుకు ఎలాగైన లక్ష మెజారిటీ సాధించేందుకు అహోరాత్రులు కష్టపడుతున్నారు. అభివృద్ధిని కనులకు కట్టినట్లు చూపించేందుకు ఎల్ఈడీలు, కరపతాప్రలతో వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి నరోత్తంరెడ్డి, కూటమి అభ్యర్థి భవాని రెడ్డి, బీఎల్ఎప్ అభ్యర్థి జగన్ లతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు. గజ్వేల్‌లో బిజీ బిజీ .. గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డిలతోపాటు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రి ముత్యం రెడ్డిలు ప్రచారం చేస్తున్నారు. కీలక నాయకులకు మండలాలు విభజించి బాధ్యతలు అప్పగించడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఎం ఫాం హౌజ్‌లో కార్యకర్తల సమావేశం పెట్టి ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా ఈనెల 5వ తేదీన గజ్వేల్‌లో బహిరంగ సభ ఏర్పాట్లలో బిజీగా మారారు. అదేసమయంలో కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి చాపకింది నీరులాగా సైలెంట్‌గా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వంటేరుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నాయకులతో గజ్వేల్‌లో సభలు, సమావేశాలు నిర్వహిస్తారని ప్రచారం జరిగినా అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుకుంటూ రావడం గమనార్హం. గతంలో సిరిసిల్ల నుంచి కేటీఆర్‌పై పోటీ చేసి ఓటమి చవిచూసిన బీజేపీ అభ్యర్థి ఆకుల విజయ ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీకి దిగారు. ప్రభావం చూపేందుకు తన వంతు కష్టపడుతున్నారు. దుబ్బాకలో జోష్.. దుబ్బాక నియోజకవర్గం విషయానికొస్తే తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఉదయం నుండి సాయంత్రం వరకు నియోజకవర్గ కీలక నాయకులతో కలిసి అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల బహిరంగ సభను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇంతటితో ఆగకుండా మంత్రి హరీశ్‌రావుతో దుబ్బాకలో రోడ్‌షో నిర్వహించి వేలాది సంఖ్యలో జనాన్ని సమీకరించారు. అప్పటి వరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించి.. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాకలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభను పెట్టించి జోష్ నింపారు. అదేవిధంగా ఓటర్లను కలుస్తూ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. అయితే కూటమి అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్న టీజేఎస్ అభ్యర్థి చిందంరాజ్కుమార్ ప్రచారంలో వెనకబడి పోయారు. ఇప్పటి వరకు ఆయన ప్రచారం కోసం ఏ ఒక్క నాయకుడు కూడా రాకపోవడం విశేషం. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాగేశ్వర్‌రెడ్డి తన ట్రస్ట్ సభ్యులపై నమ్మకం పెట్టుకొని ప్రచారం చేయడం గమనార్హం. అదేవిధంగా బీఎల్ఎఫ్ అభ్యర్థి జగన్ అనుబంధ సంఘాల నాయకులను ప్రచారంలో దింపి ముందుకు వెళ్తున్నారు. హుస్నాబాద్‌లో పుంజుకున్న ప్రచార వేగం.. హుస్నాబాద్ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు స్తబ్ధతగా ఉన్నా.. గత మూడు, నాలుగు రోజుల నుంచి ప్రచారంలో వేగం పెంచారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీష్‌కుమార్ ముందస్తుగా పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పర్యటించి చేసిన అభివృద్ధి చెయ్యబోయే పనులు వివరించి ఓట్లు అడిగారు. కూటమి నుండి పోటీలో దిగిన సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డి నిన్న మొన్నటి వరకు స్తబ్ధతగా ఉన్నా ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఆదివారం హుస్నాబాద్‌లో సభను నిర్వహించి ప్రచారంలో ఊపు తెచ్చారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి చాడ శ్రీనివాస్‌రెడ్డి జాతీయ నాయకులతో రోడ్‌షోలు నిర్వహించి తమ బలాన్ని కూడా నిరూపించుకున్నారు. అదేవిధంగా మిగిలిన రెండు రోజు సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ అధినాయకులతో రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నాయి. -
ఉద్యమం–ఉప ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిద్దిపేట.. 1969 నాటి నుంచి తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ.. రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఉప ఎన్నికల్లో గెలవడం.. ఇక్కడ ఓటర్లకు చర్వితచర్వణం.. 1969 ఉద్యమ సమయంలో సిద్దిపేట ఎమ్మెల్యే, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉన్న వీబీ రాజీనామా చేశారు. అనంతరం 1970లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపకుల్లో ఒకరైన అనంతుల మదన్ మోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర సాధన కోసం 2001లోనూ చరిత్ర మరోమారు పునరావృతమైంది. టీడీపీ తరపున సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ 2001లో తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్తాపకులైన కేసీఆర్ 2001 ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మలి విడత తెలంగాణ ఉద్యమంలో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన తన్నీరు హరీష్‌రావు 2008, 2010లోనూ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికయ్యారు. 1952లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి 2014 వరకు సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఇప్పటి వరకు 19 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా, ఐదుమార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఇక్కడి ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో జరిగినవే కావడం గమనార్హం. -
నాయకుడిని కాదు.. సేవకుడిని
సాక్షి: డబుల్ హ్యాట్రిక్ సాధించబోతున్న అనుభవం ఎలా ఉంది ? హరీశ్: ఉద్యమ కాలం నుంచి నేటి వరకు సిద్దిపేట ప్రజలు నాకు అండదండగా నిలిచారు.. నాకు ఎంత మంచి పేరొచ్చినా.. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా.. అది నా సిద్దిపేట ప్రజలు పెట్టిన బిక్ష. అందుకోసమే వారికి నాయకుడిగా కాకుండా.. సేవకుడిగా ఉంటూ సేవ చేస్తున్నా. ప్రతీ పండుగ ప్రజల మధ్యనే ఉంటాను. ఎక్కడ ఏ శుభాశుభ కార్యక్రమాలు జరిగినా..వారిలో ఒకడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నా. ఎన్ని జన్మలెత్తినా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది. అందుకోసమే ప్రజలకు సేవచేయడం అంటే నాకు ఇష్టం. సాక్షి: సిద్దిపేట అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ? హరీశ్: పరాయి పాలనలో సిద్దిపేట ప్రజలు చాలా కష్టాలు, బాధలను అనుభవించారు. వారి సమస్యలు తీర్చడమే నా లక్ష్యం. అందుకోసమే విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, యువతకు ఉపాధి, మహిళా సాధికారత రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాం. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత సిద్దిపేట రేపురేఖలే మారిపోయేలా అభివృద్ధి చేస్తున్నాం. ప్రజల కష్టాలు తీర్చడంలో భాగంగానే జిల్లా కేంద్రాన్ని తెచ్చుకున్నాం. గడిచిన నాలున్నర సంవత్సరాల్లో రెండు ఎస్సీ, రెండు బీసీ, రెండు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చుకున్నాం. అర్బన్ అనాథపిల్లల పాఠశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించుకున్నాం.. ఇలా ఎనిమిది రెసిడెన్సియల్ పాఠశాలు ఏర్పాటు చేసుకున్నాం. పీజీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల తెచ్చుకున్నాం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచి ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేసుకున్నాం. ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్లు వేసుకున్నాం. ఇలా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలోనే సిద్దిపేట ప్రథమంగా ఉండేలా తీర్చిదిద్దాను. సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం ఏమిటి..? హరీశ్: తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలకు సిద్దిపేట కేంద్ర బిందువు కావడానికి ముఖ్య కారణం సాగునీటి కష్టాలు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో సిద్దిపేట నష్టపోయింది. సాగునీరు, తాగునీరు లేక ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. వందల అడుగుల లోతుకు బోర్లు వేసి నీళ్లు రాక రైతులు కన్నీళ్లు దిగమింగుతూ.. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇంకా మరిచిపోలేదు. అందుకోసమే సాగునీరు అందించాలనేది నా తపన. ఇందులో నుండి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం. దీంతో జిల్లాలో అనంతగిరి సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్.. ఇలా రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట జిల్లాను మార్చాలన్నదే లక్ష్యం. దేవుడి దయతో కొద్ది రోజుల్లోనే ఈ లక్ష్యం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సిద్దిపేట నియోజకవర్గంలో వందల కిలోమీటర్ల దూరంలో గలగల పారే గోదారమ్మ సవ్వడి జిల్లాలో వినిపిస్తుంది. ఇక ఒక్క సెంటు భూమి కూడా బీడు పడనివ్వను. సాక్షి: నిరుద్యోగ యువతను ఎలా ఆదుకుంటారు? హరీశ్: ఇంతకాలం సిద్దిపేట నియోజకవర్గంలోని యువతకు సరైన ఉపాధి మార్గాలు లేక ఇబ్బందులు పడ్డారు. అందుకోసమే వారికి ఉపాధి మార్గాలు కల్పించి నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించేలా పోటీ పరీక్షలను తట్టుకునేందుకు సిద్దిపేట జిల్లాగా ఏర్పడిన వెంటనే ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. టీచర్స్, పోలీస్ ఉద్యోగాల భర్తీ సమయంలో ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఇక పరిశ్రమల స్థాపన కీలకం. పరిశ్రమలు రావాలంటే ముందుగా రవాణా సౌకర్యాలు మెరుగుపడాలి. జాతీయ రోడ్డు మార్గం సిద్దిపేటకు ఉంది. రైల్వే లైన్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే నీటి వసతులు మెరుగుపడుతాయి. వీటిని చూసి ఇప్పటికే మన దేశంతోపాటు, ఇతర దేశాల నుండి పారిశ్రామికవేత్తలు సిద్దిపేటలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. దీనిని గుర్తించి 400 ఎకరాలను సేకరించి పారిశ్రామిక హబ్‌గా ఏర్పాటు చేశాం. ఇందులో ఇప్పటికే రెండు మూడు కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసి పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగం బలోపేతం అవుతుంది.. దీంతో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు వేగంగా జరుగుతాయి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్, నిరుద్యోగులకు చేతినిండా పని దొరికే రోజులు వస్తాయి. దీంతో నిరుద్యోగం మటు మాయం అవుతుంది. సాక్షి: రానున్న ఐదేళ్లకు ప్రణాళిక రూపొందించారా? హరీశ్: సిద్దిపేట ప్రజలు అన్ని వసతులు, సౌకర్యాలతో సంతోషంగా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం. అందుకోసమే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు అధునాతన వసతులతో ఆసుపత్రిని నిర్మించి కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా వైద్య సేవలు అందిస్తున్నాం. విద్యాపరంగా అన్ని సౌకర్యాలు కల్పించాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సమస్య తీరుతోంది. అయితే ఇది సరిపోదు. మౌలిక వసతులు కల్పించాలి. వీలైనంత త్వరగా కాళేశ్వరం నీళ్లు తేవాలి. రైల్వే లైన్ పనులు వేగవంతం చేసి సిద్దిపేటలో రైలు కూత వినిపించేలా చేయాలి. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. ఇవి నా ముందు ఉన్న పెద్ద సవాళ్లు. ఇక పోతే నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో గల్లీగల్లీకి సీసీ రోడ్ల నిర్మాణం చేయాలి. ఐకేపీ సంఘాలను బలోపేతం చేయాలి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. సేంద్రియ వ్యవసాయ పద్దతులు, మంచి డిమాండ్ ఉన్న పంటల సాగుకు శిక్షణ మొదలైన కార్యక్రమాలు చేపడతాం. కష్టాలు, కన్నీళ్లతో కాలం గడిపిన రైతు కుటుంబాలు సిరి సంపదలతో తులతూగే రోజులు రావాలి. అందుకు నా శక్తినంతా ధారపోస్తా. సాక్షి: మీ బలం, విజయ రహస్యం ఏమిటి? హరీశ్: సిద్దిపేట నియోజకవర్గ ప్రజలే నా బలం. వారి దీనెనలే నన్ను విజయం వైపు నడిపిస్తున్నాయి. సిద్దిపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాను. చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట రూరల్, అర్బన్ మండలాల్లో ప్రజల అవసరాన్ని గుర్తించి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాను. నా రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలతోపాటు, ప్రజల ఆశీస్సులు నా విజయ రహస్యం. అదేవిధంగా నా టీంలో నిస్వార్థ ప్రజాప్రతినిధులు ఉన్నారు. సైనికుల్లాంటి కార్యకర్తలు నా వెంట ఉండి ముందు నడిపిస్తున్నారు. అందుకోసమే సిద్దిపేటలో పోటీ చేయాలంటేనే ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ బలమే ఈ ఎన్నికల్లో లక్షకుపైగా మెజార్టీతో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. ఇది తప్పకుండా సాధ్యం అవుతుంది. -
నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో పూర్తి అయింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గంలో చివరగా 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెరాస నుంచి తన్నీరు హారిష్ రావు,భాజపా నుంచి నాయిని నరోత్తంరెడ్డి, మహాకూటమికి చెందిన తెలంగాణ జనసమితి పార్టీ నుంచి భవానిరెడ్డిలు పోటీలో ఉన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి గ్యాదరి జగన్, బహుజన సమాజ్ పార్టీ నుంచి పెద్దోళ్ల శ్రీనివాస్, శ్రమ జీవి పార్టీ నుంచి పుష్పలత, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి బుర్ర శ్రీనివాసులు పోటీచేస్తున్నారు. వీరితో పాటు సిద్దిపేట పట్టణానికి చెందిన మరో ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని సిద్దిపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. 31 మంది 59 సెట్లు నామినేషన్ల దాఖలు చేయగా, అందులో 2 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు తెలిపారు. 29 మంది నామినేషన్లు సవ్యంగా ఉన్నట్టు చెప్పారు. గురువారం రోజు 17 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఓటర్లు సహకరించాలని కోరారు. -
రణక్షేత్రం సిద్దిపేట..
తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 14 సార్లు శాసనసభకు సాధారణ ఎన్నికలు జరిగాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది పర్యాయాలు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ స్థానాలకు మాత్రం ఇన్నేళ్ల ఎన్నికల చరిత్రలో ఒక్క పర్యాయం కూడా ఉప ఎన్నిక నిర్వహించాల్సిన సందర్భం ఎదురవలేదు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో ఐదు పర్యాయాలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు జరిగడం విశేషం. ఆ స్థానం నుంచి హరీశ్‌రావు మూడు పర్యాయాలు ఉప ఎన్నికల బరిలో నిలిచి ప్రతీ సారి మెజారిటీ పెంచుకుంటూ విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన వల్లూరు బసవ రాజు (వీబీ రాజు) 1967లో సిద్దిపేట నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేసిన వీబీ రాజు 1969 నాటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తన మంత్రి పదవి, శాసనసభ సభ్యత్వానికి వీబీ రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో 1970లో జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపకుల్లో ఒకరైన అనంతుల మదన్మోహన్ సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రాజేశ్వర్రావుపై గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుపొందిన కేసీఆర్‌కు.. చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కలేదు. కొంతకాలం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన కేసీఆర్.. 2001 ఏప్రిల్‌లో తన శాసన సభ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను స్థాపించిన క్రమంలోనే 2001లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్ స్వతంత్య అభ్యర్థిగా బస్సు గుర్తుపై పోటీ చేసి వరుసగా ఐదో పర్యాయం విజయం సాధించారు. సిద్దిపేట నుంచి వరుసగా ఆరో పర్యాయం పోటీ చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే కరీంనగర్ ఎంపీగా కూడా ఎన్నిక కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో అప్పటికే వైఎస్ కేబినెట్లో మంత్రిగా ఉన్న హరీశ్‌రావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తిరిగి 2008 మేలో జరిగిన ఉప ఎన్నికలోనూ హరీష్‌రావు మరోమారు పోటీ చేసి గెలుపొందారు. 2010లోనూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మూడు పర్యాయాలు ఒకే పార్టీ నుంచి విజయం సాధించిన నేతగా రికార్డును సొంతం చేసుకున్నారు. రామాయంపేటలో అంజయ్య ఏకగ్రీవం.. రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిపై అసమ్మతి స్వరం పెరగడంతో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు టంగుటూరి అంజయ్య 11 అక్టోబర్ 1980న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీ కారం చేసే నాటికి అంజయ్య కేంద్ర కార్మిక శాఖ మంత్రి హోదాలో ఉన్నారు. శాసనసభలో ప్రాతినిథ్యం కోసం అంజయ్య ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యా రు. రామాయంపేట ఎమ్మెల్యే రాజన్నగారి ముత్యంరెడ్డిని రాజీనామా చేయించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.రామాయంపేట ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి హోదాలో అంజయ్య 1981 ఏప్రిల్ 8న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజకీయాల్లోకి వచ్చిన రామాయంపేట జడ్పీటీసీ సభ్యురాలు పద్మా దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పక్షాన 2004 పన్నెండో శాసనసభ ఎన్నికల్లో రామాయంపేట నుంచి గెలుపొందారు. అయితే పార్టీ పిలుపు మేరకు 2008లో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తిరిగి అదే 2008లో రామాయంపేట స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. మరో నాలుగు సెగ్మెంట్లలో..! అందోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పదో శాసనసభ (1994–99) టీడీపీ పక్షాన గెలుపొందిన మల్యాల రాజయ్య .. 1998 లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట ఎంపీగా విజయం సాధించారు. రాజయ్య రాజీనామాతో 1998లో అందోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సినీనటుడు బాబూమోహన్ టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా, 1983, 1985, 1994లో టీడీపీ నుంచి గెలుపొందిన కరణం రామచంద్రరావు 1999లో మరోమారు విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్లో ఉన్నత శాఖ మంత్రిగా పనిచేస్తూ 2002లో మరణించారు. 2002 జూలైలో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి ఉమాదేవి టీడీపీ తరపు పోటీ చేసి విజయం సాధించారు. పాత్రికేయుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన సోలిపేట రామలింగారెడ్డి 2004లో జరిగిన పన్నెండో శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన దొమ్మాట నుంచి గెలుపొందారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2008లో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తిరిగి అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామలింగారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు పీ.కిష్టారెడ్డి 2015 ఆగస్టు 25న గుండె పోటుతో మరణించారు. దీంతో 2016 ఫిబ్రవరిలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కిష్టారెడ్డి తనయుడు డాక్టర్ పి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన భూపాల్‌రెడ్డి గెలుపొం ది, అసెంబ్లీలో అడుగు పెట్టారు. -
సిద్దిపేట..ఉద్యమాల కోట
ఉద్యమాల పురిటి గడ్డగా, ప్రజాచైతన్యానికి వేదికగా సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతంలో ఉప్పెనల ఎగిసింది. ఈ గడ్డపై పుట్టిన అనేక మంది కళాకారులు తమ ఆటా, పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. మలిదశ తెలంగాణ పోరాట రథ సారథి, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ సిద్దిపేట. తెలంగాణ ప్రజా సమితితో తొలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనంతుల మదన్మోహన్ రాజకీయ ప్రస్థానం సాగింది కూడా ఇక్కడి నుంచే. మదన్ మోహన్ అనంతరం కేసీఆర్, ప్రస్తుతం హరీశ్‌రావుకు వరుస విజయాలను అందించి ఆశీర్వదించారు ఇక్కడి ప్రజలు. 1970 నుంచి 2014 వరకు ఈ నియోజవర్గానికి జరిగిన 15 ఎన్నికల్లో ఈ ముగ్గురే విజేతలుగా నిలవడం విశేషం. రాజకీయ చైతన్యం తొనికిసలాడే సిద్దిపేట నియోజకవర్గంపై ప్రత్యేక కథనం.. సాక్షి, సిద్దిపేటజోన్: నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అత్యధికంగా ఐదు సార్లు ఉప ఎన్నికలు జరగడం విశేషం. 1969లో తొలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో 1970 ఉప ఎన్నిక తర్వాత మలివిడత ఉద్యమంలో వరస రాజీనామాలతో 2001, 2004, 2008, 2010లో ఉప ఎన్నికలు జరిగడం విశేషం. తెలంగాణ ప్రజా సమితితో ఉద్యమానికి తొలివిడతలో తెరలెపిన అనంతుల మదన్‌మోహన్‌తో పాటు ఆయన వద్ద రాజకీయ శిష్యరికం పొందిన ప్రస్తుత టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్‌రావుకే నియోజకవర్గ ప్రజలు వరసగా పట్టం కట్టారు. 1983లో గురువు మదన్మోహన్పై పోటి చేసి ఓటమి చెందిన కేసీఆర్ 1985నుంచి వరుసగా డబుల్ హట్రిక్ విజయాలు సాధించి రికార్డు నెలకొల్పారు. అనంతరం ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు 2004 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసి వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో విజయం సాధించాడు. అందులో మూడు ఉప ఎన్నికలే కావడం విశేషం. సిద్దిపేట నియోజకవర్గ స్వరూపం నియోజకవర్గంలో సిద్దిపేట మున్సిపల్‌తో పాటు సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలు ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఓటర్లు 1,97,920 మహిళలు 98,557, పురుషులు 99,337 ఇతరులు 26 మొత్తం పోలీంగ్ స్టేషన్లు 256 నియోజకవర్గంలోని గ్రామాలు 81 1952లో నియోజకవర్గం ఏర్పాటు.. సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆరుసార్లు టీఆర్ఎస్ని, నాలుగు సార్లు టీడీపీని, ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీని, ఒక్కోక్క సారి తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్), ప్రోగ్రెసివ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్), స్వతంత్రులకు పట్టంకట్టారు. నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా గెలిచిన వారిలో అనంతుల మదన్మోహన్, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన్నీరు హరీష్‌రావు మంత్రులుగా పనిచేశారు. 1952లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి గురువారెడ్డి సమీప ప్రత్యర్ధి పీవి. రాజేశ్వరావుపై విజయం సాదించి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా రాజకీయ ముఖచిత్రంలో స్థానం సంపాదించుకున్నారు. 1957లో పీవీ రాజేశ్వర్‌రావు గురువారెడ్డిని ఓడించి ప్రతికారం తీర్చుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసిన సోమేశ్వర్రావు, కాంగ్రెస్ అ«భ్యర్థి వీబీ రాజేశ్వర్‌పై విజయం సాదించారు. 1967లో వీబీ. రాజు, సీపీఎం అభ్యర్థి నర్సింహరెడ్డిపై గెలుపొందారు. 1969లో తొలి విడత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వీబీ. రాజు రాజీనామా చేశారు. 1970లో జరిగిన నియోజకవర్గ తొలి ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి పక్షాన అనంతుల మదన్మోహన్ విజయం సాదించారు. అక్కడి నుంచి ప్రారంభమైన మదన్మోహన్ రాజకీయ ప్రస్తానం 1985 వరకు కొనసాగింది. ఈ మద్య కాలంలో ఆయన పీవీ. నర్సింహరావు, చెన్నారెడ్డి, భవనం వెంకట్రావు, టి. అంజయ్య, కోట్ల విజయబాస్కర్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించారు. 1983లో ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం 1983లో ఆవిర్భవించిన టీడీపీ నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే రాజకీయ గురువు మదన్మోహన్ చేతిలో ఓటమి చెందిన కేసీఆర్ తర్వాత వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2001లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిఘటించిన కేసీఆర్ టీడీపీ సభ్యత్వానికి, శాసనసభకు, డిప్యూటీ స్పీకర్ పదవికి మూకుమ్మడి రాజీనామలు సమర్పించారు. 2001లో టీఆర్ఎస్ పక్షాన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్, అనంతరం 2004లో సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించారు. ఈ సమయంలోనే సిద్దిపేట ఎమ్మెల్యే పదివికి రాజీనామా సమర్పించడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు నియోజకవర్గానికి 2004 ఉప ఎన్నికల ద్వారా ఆరగ్రేటం చేశారు. అప్పట్లోనే వైఎస్ మంత్రి వర్గంలో హరీశ్ యువజన సర్వీస్‌ల శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవిని స్వీకరించి కొద్ది రోజులకే భారీ మెజార్టీతో సిద్దిపేట నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి 2014 వరకు ఐదు పర్యాయాలు విజయాన్ని సాదించారు. ఇటీవల ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో మరోసారి ఎన్నికలు అనివార్యంగా మారింది. ఇప్పటికే ఐదు సార్లు సిద్దిపేట నియోజకవర్గం నుండి విజయం సాధించిన హరీష్‌రావు డబుల్ హ్యట్రిక్ దిశగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. -
నీటి వనరుల సంరక్షణకు నిధులు మంజూరు
సిద్దిపేట టౌన్: సిద్దిపేట నియోజకవర్గంలో 2014-15 సంవత్సరానికి గాను నీటి వనరుల సంరక్షణ కోసం నిధులు మంజూరైనట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్, అనంతసాగర్, విఠలాపూర్ గ్రామాలకు ఐడబ్ల్యూఎంపీ పథకం కింద 4313 హెక్టార్లలో రూ. 517.56 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నంగునూరు మండలం కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి, నర్మెట, మగ్ధుంపూర్, అంక్షాపూర్, ఖానాపూర్, నంగునూరు గ్రామాల్లో 4418 హెక్టార్లకు రూ. 530.16 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. మెగా వాటర్ షెడ్ (జీఓ ఎంఎస్ నం. 11) ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో నీటి వనరుల సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. దీంతో భూగర్భ జలవనరులు పెరుగుతాయన్నారు. 2010-11 సంవత్సరంలో చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, ఇబ్రహీంనగర్, మాచాపూర్, పెద్దకోడూరు గ్రామాల్లో 4082 హెక్టార్లలో రూ.489.84 లక్షలతో, నంగునూరు మండలం ఓబులాపూర్, వెల్కటూరు, ముండ్రాయి, పాలమాకుల, రాంపూర్, బద్ధిపడగ, రాజ్‌గోపాల్‌పేట గ్రామాల్లో 4966 హెక్టార్లలో రూ. 595.85 లక్షలతో పనులు జరుగుతున్నాయన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ పథకం అమలు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపామన్నారు. -
‘పసుపు’ పలచనైంది..
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి నేడు సిద్దిపేట నియోజకవర్గంలో టీడీపీకి ఎదురవుతోంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్‌ను కలిగి రాష్ట్ర స్థాయిలో పార్టీ అధిష్టానం దృష్టిలో పడిన సిద్దిపేట టీడీపీ నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలవెలాపోతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సంగ్రామంలో రాజకీయ పార్టీల నేతలు తమ జెండాలను గ్రామాల్లో రెపరెలాడించేందుకు కార్యన్మోఖులయ్యారు. కాని నియోజక వర్గంలోని మూడు మండలాల్లో టీడీపీ పరిస్థితి నిరాశ జనకంగా ఉంది. నియోజకవర్గంలోని సిద్దిపేట చిన్నకోడూర్, నంగునూర్ మండలాల పరిధిలో ఉన్న 47 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 17 స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండడం విశేషం. మరోవైపు మిగతా స్థానాలకు అభ్యర్థులు దొరకకపోవడంతో ఆయా గ్రామాల క్యాడర్ పరిస్థితి ప్రస్తుత ఎన్నికల్లో ప్రశ్నార్ధకంగానే మారింది. వివరాల్లోకి వెళ్తె.. టీడీపీ అవిర్భావ సమయం నుంచి 2000 సంవత్సరాల వరకు 17 సంవత్సరాలు నియోజకవర్గంలో టీడీపీది ఏకఛత్రాధిపత్యం. ప్రస్తుత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. కాలక్ర మేణా టీఆర్ఎస్ అవిర్భావం చెందడం. కేసీఆర్‌తో పాటే ఉన్న పార్టీ శ్రేణుల్లో అత్యధికం ఆయన బాటే పట్టారు. ఉన్న కొద్దిపాటి క్యాడర్‌తో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో పార్టీ అభ్యర్థుల ఎన్నిక కష్టతరంగా మారింది. కొన్ని గ్రామాల్లో అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టినప్పటికీ నామినేషన్ల నాటికి కూడా అభ్యర్థులు దొరక కపోవడంతో పరిస్థితి అనుకూలంగా ఉన్న గ్రామాల్లోని అభ్యర్థులను బరిలోకి నిలిపింది. అయినప్పటికీ అత్యధిక గ్రామాల్లో టీడీపీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం తొమ్మిది చోట్ల అభ్యర్థులను నిలిపారు. మరోవైపు మొన్నటి వరకు మండలంలో కొద్దిపాటి బలం ఉన్న నంగునూరులో పరిస్థితి దయనీయంగా మారింది. 12 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 4 చోట్ల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిద్దిపేట మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు నాలుగురే పోటీకి దిగడంతో నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల బ్యాలెట్ పేపర్లో 30 స్థానాల్లో టీడీపీ ఊసేలేకపోవడం విశేషం. -
ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట
సిద్దిపేటజోన్,న్యూస్‌లైన్: సిద్దిపేట నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కృషి చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణానికి కేంద్ర మానవవనరుల శాఖ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయం మంజూరైందన్నారు. ఇందుకు తోడు సిద్దిపేటలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది సిద్దిపేటతో పాటు సికింద్రాబాద్‌కు నూతనంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరైనప్పటికీ సీఎం కిరణ్ సిద్దిపేటపై చూపిన వివక్ష కారణంగా పెండింగ్ పడిందన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తున్న క్రమంలో పెండింగ్‌లోని ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. స్పందించిన ఆయన జీవో విడుదల చేశారన్నారు. దీంతో జిల్లాలోనే సిద్దిపేట నియోజకవర్గానికి మూడు పాలిటెక్నిక్ కళాశాలలు సాధించుకున్న ఘనత దక్కిందన్నారు.గతంలో వెటర్నరీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఐటీఐ, మోడల్ పాఠశాలలు , కస్తూర్బా పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు కమల్‌నాథ్, పల్లంరాజు, జైరాంరమేష్‌ను కలిసి నియోజకవర్గ ప్రతిపాదనలపై చర్చించామన్నారు. సిద్దిపేటలో 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లో ఎంసెట్, ఎడ్‌సెట్, పాలిటెక్నిక్ అడ్మిషన్ కేంద్రాలతో పాటు కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటుకు జీవో విడుదల కానుందన్నారు. సిద్దిపేటలోని బలహీన వర్గాల కోసం రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద రూ. 120 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, త్వరలో మంజూరు కానున్నాయన్నారు. సిదిపేటలో ఎస్ఎంహెచ్ భవనాల నిర్మాణ పనులు రూ. 3.5 కోట్లతో కొనసాగుతున్నాయని, మరో రూ. 2.25 కోట్లు మంజూరు కానున్నాయన్నారు. సిద్దిపేట పట్టణంలో ఉన్నత విద్యా అవకాశాలను మెరుగు పరిచే క్రమంలో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూసా పథకం కింద రూ. 60 కోట్లతో సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు కానుందని త్వరలో జీవో రానుందని అశాభావం వ్యక్తం చేశారు. రూ. 19 కోట్లతో పీజీ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు దువ్వల మల్లయ్య, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, వెంకట్‌రెడ్డి, నందు పాల్గొన్నారు. -
కాల్చేసి... కలిసుందామంటారా!
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: ‘‘వారు భోగి మంటల్లో దహనం చేసింది తెలంగాణ బిల్లు ప్రతులను కాదు...నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల హృదయాలను. ఇది ఆంధ్రానేతల దురహంకారానికి నిదర్శనం..తెలంగాణోడు రోడ్డెక్కితే అరెస్టు చేసే డీజీపీ, సీఎస్‌లు ఇపుడు ఏం చేస్తున్నారు...బిల్లు ప్రతులను దహనం చేసి వారిపై కేసులు పెట్టాల్సిందే..ఇంత జరిగాక కూడా కులిసుందామంటే ఎట్లా కుదురుతుంది’’ అంటూ ఎమ్మెల్యే హరీష్‌రావు నిప్పులు చెరిగారు. గురువారం రావురూకుల సర్పంచ్ అల్లం శ్యామలకిషన్‌లతో పాటు వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు బాస్‌ల తీరును తప్పుపట్టారు. రాష్ట్రపతి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లులను పిలుపునిచ్చి మరీ భోగి మంటల్లో కాల్చేస్తుంటే వారు ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలన్నారు. సకలజనుల సమ్మెలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన తెలంగాణవాదులపై కేసులు పెట్టిన ఈ అధికారులు ఇపుడు ఎందుకని మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. నాడు గాంధీ.. నేడు కేసీఆర్.. నాడు దేశానికి స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అయితే రేపు తెలంగాణ రాష్ట్రం తెచ్చేది కేసీఆర్ అని ఎమ్మెల్యే హరీష్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ మాటను నిషేధించిన నేపథ్యంలో కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి రాష్ట్రం కావాలని ఎలుగెత్తడం వెనుక కేసీఆర్ చేసిన సంవత్సరాల ఉద్యమముందన్నారు. ఆకలి అయిన వారికే అన్నం విలువ తెలిసినట్లు ఉద్యమకారులకే తెలంగాణ ప్రజల గోస తెలుస్తుందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆత్మహత్యలులేని ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడాలంటే బిల్లులో తగిన మార్పులు అవసరమన్నారు. పొట్టచేతబట్టుకుని ఇతర దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలంతా ఇక్కడికి రావలంటే తగిన సాగునీరు, ఉద్యోగాలు, ఉపాధి అనివార్యమన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గంలో 75 మంది సర్పంచ్‌లుంటే వారిలో 70 మంది టీఆర్ఎస్ మద్దతుదారులుండడం గర్వంగా ఉందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు శ్రీనివాస్‌రావు, రవీందర్‌రెడ్డి, దువ్వల మల్లయ్య, సారయ్య, బాల్‌రంగం, జనార్దన్, రామస్వామి,రామకృష్ణరెడ్డి, రాజయ్య, కొళ్ల రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.