సాక్షి: డబుల్ హ్యాట్రిక్ సాధించబోతున్న అనుభవం ఎలా ఉంది ?
హరీశ్: ఉద్యమ కాలం నుంచి నేటి వరకు సిద్దిపేట ప్రజలు నాకు అండదండగా నిలిచారు.. నాకు ఎంత మంచి పేరొచ్చినా.. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా.. అది నా సిద్దిపేట ప్రజలు పెట్టిన బిక్ష. అందుకోసమే వారికి నాయకుడిగా కాకుండా.. సేవకుడిగా ఉంటూ సేవ చేస్తున్నా. ప్రతీ పండుగ ప్రజల మధ్యనే ఉంటాను. ఎక్కడ ఏ శుభాశుభ కార్యక్రమాలు జరిగినా..వారిలో ఒకడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నా. ఎన్ని జన్మలెత్తినా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది. అందుకోసమే ప్రజలకు సేవచేయడం అంటే నాకు ఇష్టం.
సాక్షి: సిద్దిపేట అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ?
హరీశ్: పరాయి పాలనలో సిద్దిపేట ప్రజలు చాలా కష్టాలు, బాధలను అనుభవించారు. వారి సమస్యలు తీర్చడమే నా లక్ష్యం. అందుకోసమే విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, యువతకు ఉపాధి, మహిళా సాధికారత రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాం. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత సిద్దిపేట రేపురేఖలే మారిపోయేలా అభివృద్ధి చేస్తున్నాం. ప్రజల కష్టాలు తీర్చడంలో భాగంగానే జిల్లా కేంద్రాన్ని తెచ్చుకున్నాం. గడిచిన నాలున్నర సంవత్సరాల్లో రెండు ఎస్సీ, రెండు బీసీ, రెండు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చుకున్నాం. అర్బన్ అనాథపిల్లల పాఠశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించుకున్నాం..
ఇలా ఎనిమిది రెసిడెన్సియల్ పాఠశాలు ఏర్పాటు చేసుకున్నాం. పీజీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల తెచ్చుకున్నాం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచి ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేసుకున్నాం. ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్లు వేసుకున్నాం. ఇలా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలోనే సిద్దిపేట ప్రథమంగా ఉండేలా తీర్చిదిద్దాను.
సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం ఏమిటి..?
హరీశ్: తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలకు సిద్దిపేట కేంద్ర బిందువు కావడానికి ముఖ్య కారణం సాగునీటి కష్టాలు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో సిద్దిపేట నష్టపోయింది. సాగునీరు, తాగునీరు లేక ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. వందల అడుగుల లోతుకు బోర్లు వేసి నీళ్లు రాక రైతులు కన్నీళ్లు దిగమింగుతూ.. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇంకా మరిచిపోలేదు. అందుకోసమే సాగునీరు అందించాలనేది నా తపన. ఇందులో నుండి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.
దీంతో జిల్లాలో అనంతగిరి సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్.. ఇలా రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట జిల్లాను మార్చాలన్నదే లక్ష్యం. దేవుడి దయతో కొద్ది రోజుల్లోనే ఈ లక్ష్యం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సిద్దిపేట నియోజకవర్గంలో వందల కిలోమీటర్ల దూరంలో గలగల పారే గోదారమ్మ సవ్వడి జిల్లాలో వినిపిస్తుంది. ఇక ఒక్క సెంటు భూమి కూడా బీడు పడనివ్వను.
సాక్షి: నిరుద్యోగ యువతను ఎలా ఆదుకుంటారు?
హరీశ్: ఇంతకాలం సిద్దిపేట నియోజకవర్గంలోని యువతకు సరైన ఉపాధి మార్గాలు లేక ఇబ్బందులు పడ్డారు. అందుకోసమే వారికి ఉపాధి మార్గాలు కల్పించి నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించేలా పోటీ పరీక్షలను తట్టుకునేందుకు సిద్దిపేట జిల్లాగా ఏర్పడిన వెంటనే ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. టీచర్స్, పోలీస్ ఉద్యోగాల భర్తీ సమయంలో ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఇక పరిశ్రమల స్థాపన కీలకం. పరిశ్రమలు రావాలంటే ముందుగా రవాణా సౌకర్యాలు మెరుగుపడాలి. జాతీయ రోడ్డు మార్గం సిద్దిపేటకు ఉంది. రైల్వే లైన్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి.
ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే నీటి వసతులు మెరుగుపడుతాయి. వీటిని చూసి ఇప్పటికే మన దేశంతోపాటు, ఇతర దేశాల నుండి పారిశ్రామికవేత్తలు సిద్దిపేటలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. దీనిని గుర్తించి 400 ఎకరాలను సేకరించి పారిశ్రామిక హబ్‌గా ఏర్పాటు చేశాం. ఇందులో ఇప్పటికే రెండు మూడు కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసి పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగం బలోపేతం అవుతుంది.. దీంతో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు వేగంగా జరుగుతాయి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్, నిరుద్యోగులకు చేతినిండా పని దొరికే రోజులు వస్తాయి. దీంతో నిరుద్యోగం మటు మాయం అవుతుంది.
సాక్షి: రానున్న ఐదేళ్లకు ప్రణాళిక రూపొందించారా?
హరీశ్: సిద్దిపేట ప్రజలు అన్ని వసతులు, సౌకర్యాలతో సంతోషంగా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం. అందుకోసమే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు అధునాతన వసతులతో ఆసుపత్రిని నిర్మించి కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా వైద్య సేవలు అందిస్తున్నాం. విద్యాపరంగా అన్ని సౌకర్యాలు కల్పించాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సమస్య తీరుతోంది. అయితే ఇది సరిపోదు. మౌలిక వసతులు కల్పించాలి. వీలైనంత త్వరగా కాళేశ్వరం నీళ్లు తేవాలి. రైల్వే లైన్ పనులు వేగవంతం చేసి సిద్దిపేటలో రైలు కూత వినిపించేలా చేయాలి.
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. ఇవి నా ముందు ఉన్న పెద్ద సవాళ్లు. ఇక పోతే నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో గల్లీగల్లీకి సీసీ రోడ్ల నిర్మాణం చేయాలి. ఐకేపీ సంఘాలను బలోపేతం చేయాలి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. సేంద్రియ వ్యవసాయ పద్దతులు, మంచి డిమాండ్ ఉన్న పంటల సాగుకు శిక్షణ మొదలైన కార్యక్రమాలు చేపడతాం. కష్టాలు, కన్నీళ్లతో కాలం గడిపిన రైతు కుటుంబాలు సిరి సంపదలతో తులతూగే రోజులు రావాలి. అందుకు నా శక్తినంతా ధారపోస్తా.
సాక్షి: మీ బలం, విజయ రహస్యం ఏమిటి?
హరీశ్: సిద్దిపేట నియోజకవర్గ ప్రజలే నా బలం. వారి దీనెనలే నన్ను విజయం వైపు నడిపిస్తున్నాయి. సిద్దిపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాను. చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట రూరల్, అర్బన్ మండలాల్లో ప్రజల అవసరాన్ని గుర్తించి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాను. నా రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలతోపాటు, ప్రజల ఆశీస్సులు నా విజయ రహస్యం.
అదేవిధంగా నా టీంలో నిస్వార్థ ప్రజాప్రతినిధులు ఉన్నారు. సైనికుల్లాంటి కార్యకర్తలు నా వెంట ఉండి ముందు నడిపిస్తున్నారు. అందుకోసమే సిద్దిపేటలో పోటీ చేయాలంటేనే ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ బలమే ఈ ఎన్నికల్లో లక్షకుపైగా మెజార్టీతో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. ఇది తప్పకుండా సాధ్యం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment