జిల్లాలోని నాలుగు స్థానాలకు నాలుగు మేమే గెలుస్తామని చెబుతున్న టీఆర్‌ఎస్ నాయకులు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 8,55,465 మంది ఓటర్లు ఉండగా ఇందులో 84.14శాతం అంటే 7,20,780 మంది ఓటర్ల తమ ఓటు వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 4శాతం ఓట్లు అధికంగా పోలయ్యాయి. రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో 14శాతం ఎక్కువ ఓట్లు వేసి మరోసారి సిద్దిపేట జిల్లా చైతన్యాన్ని చాటారు. అయితే ఈ పోలింగ్‌శాతాన్ని చూసి అభ్యర్థుల్లో ఎవరికివారు దీమాను వ్యక్తం చేస్తున్నారు.
మెజార్టీపై అంచనాలు
జిల్లాలో పలుచోట్ల గెలుపు ఓటములపై, మరికొన్ని చోట్ల అభ్యర్థులకు వచ్చే మెజార్టీలపై రాజకీయ పక్షాలు, అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గంలో గతం కన్నా ç4.5శాతం ఓట్లు అధికంగా పోల్ కావడంతో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్య ర్థిగా పోటీలో ఉన్న తన్నీరు హరీశ్‌రావు మాత్రం తనకు లక్షకు పైగా మెజార్టీ వస్తుందనే ధీమాతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,09,339 ఓటర్లు ఉండగా 1,65,368 మంది ఓట్లు వేశారు. ఇందులో ప్రత్యర్థి బీజేపీకి 20వేల మేరకు ఓట్లు పడే అవకాశం ఉందని, మిగిలిన కూటమి అభ్యర్థి భవానీరెడ్డి, ఇతర అభ్యర్థులకు కలిపి మొత్తం మరో 15వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.
మిగిలిన లక్షా ముప్‌పైవేల ఓట్లు హరీశ్‌రావుకు వస్తాయని, సులభంగా లక్ష మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ, కూటమి అభ్యర్థులు కూడా తమకేమీ తక్కువ ఓట్లు రావని, గెలుపు ఓటమిలు అటుంచినా.. గౌరవ ప్రదమైన ఓట్లు వస్తాయని చెప్పడం గమనార్హం. అదేవిధంగా దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గంల్లో తమ నాయకులకు కూడా 60వేల మెజార్టీ వస్తుందని ఆయా నియోకవర్గాల టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గజ్వేల్‌లో కూడా భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయబావుటా ఎగుర వేయడం ఖాయమని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.
బీజేపీ, విపక్షాల్లో ధీమా
జిల్లాలోని నాలుగు స్థానాలకు నాలుగు మేమే గెలుస్తామని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే తామేమీ తక్కువ కాదని, 11వ తేదీన విడుదల కానున్న ఫలితాలే రుజువు చేస్తాయని విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు దీమాతో ఉండటం గమనార్హం. గజ్వేల్‌లో మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పడం విశేషం. అదేవిధంగా దుబ్బాకలో తమకు కూడా ఓట్లు బాగానే వస్తాయని, విజయం మావైపే ఉందని బీజేపీ, కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారు. హుస్నాబాద్‌లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత మాకు అనుకూలించిందని, కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా పనిచేశారని విజయం ఖాయమని సీపీఐ నాయకులు అంటున్నారు. ఇంతకాలం ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ గెలుపుపై చర్చలు పెడుతున్నారు. వీరితోపాటు తటస్థులు కూడా నలుగురు కూడిన చోట గెలుపోటముల ముచ్చటే కొనసాగతోంది. అయితే మరో రెండు రోజుల్లో ఈనెల 11న ఫలితాలు వెళ్లడి కానున్నందున అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment